`మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ అస్త్ర సన్యాసం
`కుమారుడి భవిష్యత్తు కోసం తెరవెనుక మంత్రాంగం
`జీవితాంతం వ్యతిరేకించిన టీడీపీలోకే చేర్చే వ్యూహం
`ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా రెండు సిటింగ్‌లు

శ్రీకాకుళం రాజకీయ యవనికపై ఓ ప్రధాన ఘట్టం మరికొన్ని నెలల్లో ఆవిష్కృతం కానుంది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలు నెరిపి జిల్లాలో యాంటీ టీడీపీకి నిలువెత్తు పొగరైన జెండాలా నిలిచిన మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారు. అదే సమయంలో ఆయన తనయుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. 2024 ఎన్నికల తర్వాత గెలిచినా, ఓడినా ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని ధర్మాన ప్రసాదరావు భావించారు. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఘోరంగా తుడిచిపెట్టుకుపోవడంతో రాజకీయాల నుంచి విరమించుకోడానికి ఇంతకు మించిన సమయం మరోసారి రాదని భావిస్తున్న ధర్మాన ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు తన సన్నిహితుల వద్ద కొద్ది రోజులుగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి గురువారం నాటి కథనం ద్వారా వెల్లడిరచింది కూడా.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కాంగ్రెస్ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావు జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి జిల్లాలో చక్రం తిప్పారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోగా, 2009 ఎన్నికల్లోనూ తాను కోరుకున్నవారికే టిక్కెట్లు ఇప్పించుకొని మరీ జిల్లాలో తొమ్మిది స్థానాలు గెలిపించుకోగలిగారు. అయితే రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ధర్మాన ప్రభ మెల్లగా తగ్గడం ప్రారంభించింది. సీబీఐ కేసుల్లో పేరుండటం వల్ల ధర్మానను మంత్రి పదవి నుంచి తప్పించాలని అప్పుడే భావించినా జిల్లాలో ఆయన్ను కాదని రాజకీయాలు చేయలేమన్న భావనతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రి పదవి ఇచ్చి ధర్మానను కేబినెట్‌లో కొనసాగించారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ నిర్వీర్యమైపోయిందని గ్రహించిన ధర్మాన 2014లో సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో చేరారు. కానీ ధర్మాన ఓడిపోవడంతో పాటు వైకాపా కూడా ప్రతిపక్షానికి పరిమితమైంది. ఎన్నికల్లో ఓడిపోయినా జిల్లాలో ధర్మాన పట్టు సడలలేదు.
జగన్ ప్రభుత్వంలోనే ధర్మానకు కష్టాలు
ఐదేళ్ల తర్వాత 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మాన ప్రసాదరావుకు అసలు కష్టాలు మొదలయ్యాయి. 151 స్థానాలతో పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కలేదు సరికదా ఆయన సోదరుడు కృష్ణదాస్‌కు రెవెన్యూశాఖ ఇచ్చి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడం ద్వారా ప్రసాదరావుకు ప్రత్యామ్నాయంగా జిల్లాలో తయారుచేస్తున్నారన్న భావనను పార్టీ కలిగించింది. అప్పట్నుంచి ధర్మాన పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం రెండున్నరేళ్ల తర్వాత కృష్ణదాస్‌ను తప్పించి ధర్మాన ప్రసాదరావును రెవెన్యూమంత్రిని చేసింది. ఆ తర్వాత ధర్మాన జనం నుంచి మరింత డిటాచ్ అయిపోయారు. రెవెన్యూమంత్రి హోదాలో కేబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రిని కలవడం తప్ప ప్రత్యేకంగా జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడిన సందర్భం లేదు. మరోవైపు జిల్లాలో ధర్మాన వ్యతిరేకులకు జగన్ ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహించారు. ఒకప్పుడు ధర్మాన అవునన్నవారు మంత్రి, కాదన్నవారు కంత్రీ అన్న లెక్కలోనే రాజకీయాలు నడిచేవి. గొర్లె హరిబాబునాయుడైనా, దువ్వాడ శ్రీనివాసైనా, ఇచ్ఛాపురం నుంచి లల్లూ అయినా ధర్మాన కాదంటే రాజకీయ సమాధి అయిపోవాల్సిందే. కానీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్మానకు ఎవరు వద్దో వారే పార్టీకి ముద్దయ్యారు. ఆయన ప్రమేయం లేకుండానే జిల్లాలో రాజకీయ పరిణామాలన్నీ ఏకపక్షంగా సాగిపోయాయి. ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్‌తో ధర్మాన ప్రసాదరావుకు గ్యాప్ ఉంది. కానీ జగన్ సాయిరాజ్ సతీమణి విజయను తీసుకువచ్చి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ చేశారు. ఇక దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు మధ్య ఉన్న రిలేషన్ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. కానీ దువ్వాడను ఎమ్మెల్సీ చేయడంతో పాటు ఆర్థికంగా జగన్మోహన్‌రెడ్డి దన్ను అందించారు. మొన్నటి ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరికి టికెట్ ఇస్తున్నారన్న విషయం కూడా సిట్టింగ్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకు తెలియదు. చివరకు తన శిష్యుడు పేరాడ తిలక్‌కు ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం కూడా ధర్మాన దృష్టిలో లేదు. అయితే బయటకు మాత్రం ధర్మాన సిఫార్సుతోనే ఇక్కడ టికెట్లు కేటాయించారన్న ప్రకటనను పార్టీ ఇప్పించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు వెలుగు తగ్గుతూ వచ్చింది. 2014లో ప్రతిపక్షంలో ఉన్నా ఆయన బంగ్లా వద్ద కనపడిన సందడి 2019లో గెలిచిన తర్వాత కనిపించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేగంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా నడుచుకోవడం ధర్మానకు సాధ్యంకాకే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలని భావిస్తున్నారు. సొంత పార్టీ కాంగ్రెస్ ఇప్పట్లో ఆంధ్రలో బట్టకట్టే పరిస్థితి లేకపోవడం, వైకాపాలో తనకు ప్రాధాన్యత లేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
తనయుడిని టీడీపీలోకి పంపే యత్నాలు
ఇదే సమయంలో ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్ నాయుడు టీడీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్రమంత్రి నారా లోకేష్‌కు బాగా సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ద్వారా ఈమేరకు సంప్రదింపులు జరిగినట్లు తెలిసింది. ధర్మాన ప్రసాదరావు ఎలాగూ ఇప్పుడు పార్టీ మారలేరని, మారినా అవకాశాలు రావు కాబట్టి ఆయన తనయుడిని టీడీపీలోకి తీసుకువచ్చి తెర వెనుక ధర్మాన మంత్రాంగాన్ని వాడుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరితే రామ్‌మనోహర్ నాయుడుకు ఏ పదవి ఇస్తారు, ఎలా న్యాయం చేస్తారని కాకుండా రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీల్లో దేనిలో చేరినా ఒకటే కాబట్టి వైకాపాకు ప్రత్యామ్నాయంగా టీడీపీలో చేరితే బాగుంటుందన్న లోకేష్ సూచన మేరకు ఇప్పటికే రెండు సిటింగ్‌లు జరిగినట్లు సమాచారం. వాస్తవానికి రామ్‌మనోహర్‌నాయుడుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న యోచన ఎప్పట్నుంచో ఉంది. 2014లో ధర్మాన ఓడిపోవడం వల్ల 2019లో గుండ కుటుంబాన్ని ఢీకొట్టడానికి ధర్మాన అభ్యర్థిత్వం తప్పనిసరి అయింది. 2024లో రామ్‌మనోహర్ నాయుడుకు సీటు కావాలని అడిగినా జగన్మోహన్‌రెడ్డి కాదనడంతో మళ్లీ ధర్మానే బరిలో నిలబడాల్సి వచ్చింది. అప్పట్లో ఐప్యాక్ టీమ్ నిర్వహించిన సర్వేలో రామ్‌మనోహర్‌నాయుడు కంటే ఓ మాజీ జెడ్పీటీసీ, మరో సీనియర్ వైకాపా నాయకుడి వైపు ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపారన్న రిపోర్టు మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధిష్టానం కన్సిడర్ చేయలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో తనకు ఎలాగైనా టికెట్ ఇప్పించాలని తండ్రి మీద రామ్‌మనోహర్‌నాయుడు నిరంతరం ఒత్తిడి తెచ్చేవారని చెప్పుకుంటారు. ఇంత సీనియర్ అయిన ధర్మాననే జగన్మోహన్‌రెడ్డి నమ్మలేదు. పక్కనున్న విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణను తీసుకువచ్చి ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించారు. ఎన్నికల సమయంలో కూడా బొత్స మేనల్లుడు చిన్నశ్రీనును ఇక్కడ పరిశీలకుడిగా నియమించారు. పార్టీలో తనకే గౌరవం దక్కనప్పుడు తన కుమారుడ్ని ఇంకా అణిచేస్తారన్న భావన ధర్మానలో ఉండి ఉండవచ్చు. అందువల్లే టీడీపీ వైపు మొగ్గుతున్నట్లు తెలిసింది.
Comments