ఇంతవరకు చంద్రబాబు నుంచి రాని పిలుపు
కుమారుడితో కలిసి వెళ్లేందుకు విశాఖలో లక్ష్మీదేవి ఎదురుతెన్నులు
పాతపట్నంలో కలమట రమణదీ అదే పరిస్థితి
ఒకవేళ పిలిచినా బాబు ఏం చెబుతారోనన్న ఉత్కంఠ
తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. చేయాల్సిన మార్పులు, కూర్చాల్సిన కూర్పులు అయిపోయినట్టేనని చంద్రబాబు ప్రకటించేశారు. ఇక బీజేపీ మార్చుకోవాల్సి వస్తే ఒకటీ అరా సీట్లు, జనసేనకు ఇచ్చినవాటిలో మూడు స్థానాల్లో తప్ప మిగిలిన టీడీపీ సీట్లన్నీ ప్రకటించేసినట్లేనని, ఇక అభ్యర్థులు కార్యక్షేత్రంలోకి దూకాలని చంద్రబాబు స్వయంగా శుక్రవారం ట్వీట్ చేశారు. అయితే జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తారనే ఆశాభావంతో సీనియర్లు ఉన్నారు. వీరిని బుజ్జగించడానికి రెండు రోజుల క్రితం ఆ పార్టీ జోనల్ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి వచ్చి చంద్రబాబు నుంచి పిలుపు వస్తుందని, సిద్ధంగా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ తుది జాబితా ప్రకటించేశారని, అందులో ఇక మార్పులు, చేర్పులు ఉండవని శనివారం టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థ్థమవుతుంది. అయితే చంద్రబాబు నుంచి ఇంకా పిలుపు రాకపోయినా ఎప్పుడు పిలుపువచ్చినా వెళ్లి వాలిపోయేందుకు ఆమె విశాఖలో రెడీగా ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు మాట్లాడినా ఏం చెబుతారు? ఎలా బుజ్జగిస్తారనేది టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తి రేపుతోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం అభ్యర్థిని మార్చి గుండ లక్ష్మీదేవికి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, కార్యకర్తలంతా సంయమనంతో ఉండాలని అప్పలసూర్యనారాయణ కొద్దిరోజులుగా పిలుపునిస్తున్నారు. మరోవైపు గుండ చిన్న కుమారుడు విశ్వనాథ్‌ను పిలిపించి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నుంచి పిలుపు వస్తుందంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆ ప్రకారం కాలిఫోర్నియా నుంచి నేరుగా విశాఖపట్నం వస్తున్న తన చిన్నకొడుకును రిసీవ్ చేసుకొని, అటునుంచి అటే తాడేపల్లికి వెళ్లేందుకు వీలుగా చంద్రబాబు నుంచి పిలుపు కోసం గుండ లక్ష్మీదేవి వైజాగ్‌లో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కథనం రాసే సమయానికి కూడా చంద్రబాబు నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని తెలిసింది. మరోవైపు పాతపట్నం టికెట్ దక్కని అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి కలమట రమణ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించినప్పుడు కలమట రమణకు వ్యతిరేకంగా బటన్ నొక్కినవారు సైతం మామిడి గోవిందరావు అభ్యర్థి అనగానే రమణకు సానుభూతి తెలుపుతున్నారు. శ్రీకాకుళంలో లక్ష్మీదేవికి టికెట్ రాలేదన్న తర్వాత వచ్చిన సానుభూతి పవనాల కంటే పాతపట్నంలో కలమట రమణకు ఎక్కువ కనిపిస్తోంది. అదే సమయంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలన్న నిర్ణయంలో లక్ష్మీదేవి కంటే కలమట రమణే పట్టుదలగా ఉన్నట్లు టీడీపీ జిల్లా శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే తన మద్దతుదారులతో టీడీపీ అన్యాయం చేసిందంటూ రమణ ర్యాలీ నిర్వహిస్తే పాతపట్నం కిటకిటలాడిరది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు పసుపు జెండాలతో తీసిన ర్యాలీ హిట్ అవ్వలేదని పాతపట్నంలో చెప్పుకొంటున్నారు. ఒకవేళ చంద్రబాబు పునరాలోచిస్తే పాతపట్నం టికెట్ విషయంలోనే ఉంటుంది తప్ప రాష్ట్రంలో మరొకటి ఉండబోదని పరిశీలకులు చెబుతున్నారు.
గుండ వర్గం నుంచి జారిపోతున్న క్యాడర్
కలమట రమణ మాదిరిగా అప్పలసూర్యనారాయణ శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించి బలప్రదర్శనకు దిగకపోయినా నియోజకవర్గంలో పార్టీ సింబల్ ఉన్నవారితోనే పయనిస్తామని చెప్పే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. లక్ష్మీదేవికి టికెటివ్వకపోవడం అన్యాయమంటూ మొదటిరోజు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తగులబెట్టిన క్యాడర్‌లో కొందరు, దాన్ని పరోక్షంగా సమర్ధించిన మరికొందరు ఇప్పుడు నెమ్మదిగా టీడీపీ సీటు దక్కించుకున్న గొండు శంకర్ వెనుక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మరో నాలుగు రోజులుపోతే పార్టీ హైకమాండే అల్టిమేట్ అనుకునేవారంతా పార్టీ గుర్తు ఉన్నవారి వెనుక వెళ్లిపోవచ్చు. ఇప్పటికే గుండ లక్ష్మీదేవి వర్గంలో కళింగవైశ్యులు, పెద్దమార్కెట్ వర్గాల్లో బలమైన పట్టున్న కోరాడ హరిగోపాల్ రెండు రోజుల క్రితం గొండు శంకర్ గొడుగు కిందకు వెళ్లిపోయారు. అలాగే వైకాపాలో ధర్మాన శైలిని నిరసిస్తూ ఈమధ్య గుండ లక్ష్మీదేవి సమక్షంలో పార్టీలో చేరిన కళింగవైశ్య నేతలు కూడా శంకర్‌తో కలిసి నడుస్తున్నారు. బలగ యువత ఇంతకు ముందునుంచే శంకర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తిరుగుతుండగా, రెండురోజుల క్రితం ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఓ సాధారణ సభకు గ్రూపులతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతిపరులు హాజరయ్యారు. చంద్రబాబుతో భేటీ ఉంటుందని జోనల్ ఇన్‌ఛార్జి శ్రీనివాసరెడ్డి చెప్పిన మరుసటి రోజే పార్టీ తుది జాబితా విడుదల చేయడం వల్ల అభ్యర్థుల మార్పు ఉంటుందన్న వారి ఆశలు అడుగంటిపోయాయి. దీంతో పార్టీ కమిట్‌మెంట్‌తో ఉన్న మరికొందరు నేతలు కూడా సైలెంట్‌గా టికెట్ పొందిన అభ్యర్థి వైపు మళ్లిపోతారని వేరేగా చెప్పనక్కరలేదు.
ఏం హామీ ఇస్తారో?
అభ్యర్థి మార్పు కుదరనప్పుడు లక్ష్మీదేవి కుటుంబానికి చంద్రబాబు ఏం హామీ ఇస్తారనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. చంద్రబాబు పిలిపిస్తారు.. మాట్లాడి బుజ్జగిస్తారు.. అన్న ప్రచారాన్ని అసంతృప్తి ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ అధిష్టానం చేయించింది. దీనికి మొదటి సాక్షి మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావే. టీడీపీ రెండో జాబితాలో నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి పేరు ప్రకటించిన తర్వాత అంతవరకు రేసులో ఉన్న డాక్టర్ బగ్గు శ్రీనివాసరావు తండ్రి బగ్గు లక్ష్మణరావుతో చంద్రబాబు మాట్లాడతారని ఆ పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇప్పటికీ లక్ష్మణరావుకు చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్ రాలేదు. అలాగే కలమట రమణ వద్దకు వెళ్లి కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఉంటుందని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ ఆ సూచనలే అక్కడి నుంచి లేవని తెలుసుకున్న తర్వాత కలమట బలప్రదర్శనకు దిగారు. అయితే కలమట కంటే గుండ అప్పలసూర్యనారాయణ పార్టీ పట్ల ఎక్కువ కమిట్‌మెంట్ ఉన్న నేత. కనీసం మాటవరుసకైనా టికెట్ వేరేవారికి ఇస్తున్నామని తమకు చెప్పలేదనే ఆయన మొదటి నుంచి బాధపడుతున్నారు తప్ప, ఎక్కడా పార్టీ లైన్ దాటడానికి ఇష్టపడటంలేదు.
పార్టీ పదవులతో బుజ్జగింపు

ఎచ్చెర్ల నియోజకవర్గంలో 500 లోపు ఓట్లు ఉండే కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదిటి ఈశ్వరరావుకు పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ తరఫున కళా వెంకట్రావుకో, కలిశెట్టి అప్పలనాయుడుకో ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం టీడీపీ కార్యకర్తల్లో ఉంది. మరీ ముఖ్యంగా 2,39,271 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తూర్పుకాపులు 22.93 శాతం, రెడ్డిక 12.30 శాతం, మత్స్యకార 11.47 శాతం, కాళింగ 11.40 శాతం, ఎస్సీ 9.12 శాతం, తెలగ/బలిజ 7.73 శాతం, యాదవ 5.13 శాతం, పద్మశాలి 3.99 శాతం, ఓసీ 2.56 శాతం, శ్రీశయన 2.28 శాతం, వెలమ 2.28 శాతం, వైశ్య 1.99 శాతం, రజక 1.42 శాతం. ఇక మిగిలిన కులాల ఓట్లన్నీ ఒక శాతం లోపు ఉన్నాయి. ఎక్కడా సోదిలో లేని సామాజికవర్గం నుంచి ఈశ్వరరావును తీసుకువచ్చి వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై పోటీకి నిలబెట్టడంతో ఆ పార్టీలో కూడా అభ్యర్థి మార్పు కోరుకుంటున్నారు. అయితే ఇది కూడా జరిగే పని కాదు. ఎందుకంటే.. కళా వెంకట్రావును చీపురుపల్లి అసెంబ్లీకి, కలిశెట్టి అప్పలనాయుడును విజయనగరం పార్లమెంట్‌కు పంపించి చేతులు దులుపుకున్న తెలుగుదేశం నాయకత్వం అభ్యర్థుల మార్పుపై పునరాలోచించదని తేలుతుంది. కాదూ.. కూడదంటే రెండు రోజులుగా చంద్రబాబు ఒక్కొక్కరితో మాట్లాడి పార్టీ పదవులు ఇస్తున్నారు. మాజీమంత్రి దేవినేని ఉమకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టు ఇచ్చారు. విశాఖపట్నంలో గండి బాబ్జీకి ఆ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మాజీమంత్రి జవహర్‌కు కూడా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఎలాగూ కూన రవి ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అసంతృప్తి నేతలకు పార్టీ పదవులు ఇచ్చి గెలుపు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యం లేదు. పెందుర్తి నుంచి మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఇక మిగిలింది. విజయనగరం, శ్రీకాకుళంలో అసంతృప్తుల వంతే. ఏం జరుగుతుందో చూడాలి.! ఎచ్చెర్ల బీజేపీకి టిక్కెట్ ఇచ్చినా, స్వయంగా ఆ పార్టీ నేతలే నడికుదిటి ఈశ్వరరావును మార్చాలంటూ ఘొరావ్ చేస్తున్నారు. బీజేపీలో బీసీ నేతలే దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. అయినా మార్పు ఉండకపోవచ్చు.
Comments