top of page

మీరు బయటకు రావాలా!.. బ్రోకరాఫీసును సంప్రదించండి

Writer: NVS PRASADNVS PRASAD
  • కాలనీ మొత్తం ట్రాన్స్‌పోర్ట్‌మయం

  • గంజాయి రవాణాకు కేరాఫ్‌ అడ్రస్‌

  • రెచ్చిపోతున్న రౌడీమూకలు

  • న్యూకాలనీ`క్రైమ్‌ కహానీ 2



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మీరు న్యూకాలనీవాసులా?.. పొరపాటున లోన్‌ మీద కారు కొనుక్కున్నారా? దాన్ని అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు తీయాలంటే లారీ బ్రోకరాఫీసులను సంప్రదించండి. అదేంటీ? మా అపార్ట్‌మెంట్‌ నుంచి మా కారు బయటకు తీయాలంటే లారీ బ్రోకరాఫీసుకు ఎందుకడగాలనే ప్రశ్న తలెత్తితే.. ఒక్కసారి న్యూకాలనీ వెళ్లి అక్కడ నివసిస్తున్నవారిని అడిగిచూడండి. న్యూకాలనీలో ఒకప్పుడు నిండా జనాలు, రాజకీయ నాయకుల పరిభాషలో చెప్పాలంటే ఓటర్లు ఉండేవారు. కానీ ఇక్కడ ఇండివిడ్యువల్‌ భవనాలన్నీ గొడౌన్లుగానో, లేదంటే లారీ బ్రోకర్‌ ఆఫీసులుగానో మారిపోయాయి. న్యూకాలనీలోకి ప్రవేశించడానికి ఉన్న అన్ని మార్గాల్లోనూ కనీసం రెండుకు తక్కువ లేకుండా ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో నిత్యం భారీ వాహనాలు ఇక్కడకు వస్తున్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌ అనగానే ఎత్తైన కంటైనర్‌ లాంటి లారీలు న్యూకాలనీలోకి ప్రవేశించి రోడ్డు మీదే నిల్చుంటున్నాయి. అక్కడే లోడిరగ్‌, అన్‌లోడిరగ్‌ జరుపుతున్నాయి. దీనివల్ల ఎవరు ఆ మార్గం గుండా ప్రయాణించాలన్నా ముందుగా ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాలకు వెళ్లి బాబ్బాబు మా కారొచ్చింది కొంచెం లారీలను పక్కన పెట్టిస్తారా అని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు న్యూకాలనీలో నివాసమున్న ఇంటిదగ్గర నుంచి ఆ చుట్టుపక్కలన్నీ ఇప్పుడు గొడౌన్లే. సరిగ్గా డైమండ్‌పార్క్‌ మొదటి రోడ్డు జంక్షన్‌ వద్ద జేవై స్కూల్‌, దానికి ఆనుకొనే రెండు ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాలు ఉన్నాయి. సాయంత్రం పిల్లలను విడిచిపెట్టడం, ట్రాన్స్‌పోర్ట్‌ లారీల నుంచి సరుకును దిగుమతి చేయడం ఒకేసారి జరుగుతుంటాయి. ఈ రోడ్డులో వెళ్లాలంటే కనీసం అరగంట వేచివుండాలి. అలాగే బాకర్‌సాహెబ్‌పేట వైపు నుంచి వచ్చే మార్గంలో నవత, ఎస్‌ఆర్‌ఎంటీ ట్రాన్స్‌పోర్టులు పెద్ద పెద్ద వాహనాలను నిలిపేస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా న్యూకాలనీలోకి ప్రవేశించలేం. ఇక ఎక్సైజ్‌ సర్కిల్‌ ఆఫీసు ఎదురు రోడ్డు నుంచి వస్తే అక్కడ కూడా ట్రాన్స్‌పోర్టు బ్రోకర్‌ ఆఫీసులు ఉన్నాయి. న్యూకాలనీ మెయిన్‌ రోడ్డులో మరో రెండు, బుర్రావారితోట రోడ్డు పక్క నుంచి న్యూకాలనీలోకి వెళ్లే మార్గంలో మరో రెండు ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఇవనీ ్న పేరుమోసిన ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు కావడం, రోజుకు నాలుగు లారీలకు తక్కువ కాకుండా రావడం, అవి కూడా భారీవి కావడం న్యూకాలనీవాసులు చేసుకున్న పాపం. రోడ్డు మీదే లారీలు నిలిపి సరుకును దించడం వల్ల ఒకవైపు లారీలు, మరోవైపు సరుకుతో రోడ్డు నిండిపోతుంది. అడిగితే దండయాత్రకు వస్తున్నారంటూ స్వయంగా కాలనీ సంక్షేమసంఘం ప్రతినిధులే గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. న్యూకాలనీలో మూడు కార్పొరేట్‌ కాలేజీలు, రెండు కార్పొరేట్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నవారికి కొదవే లేదు. వాస్తవానికి ట్రాన్స్‌పోర్టు మొత్తం ఊరి శివారులో ఉండాలి. ఏ జిల్లాలో చూసుకున్నా ఇదే అమలవుతుంది. అయితే పెద్దపాడు, లేదా బలగ వైపు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, వాహనాలు తరలిపోవాల్సి ఉన్నా పోలీసులు, కార్పొరేషన్‌ యంత్రాంగం మాత్రం ఆ దిశగా ఆలోచించడంలేదు. నగరం నడిబొడ్డులో ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు ఎంత ప్రమాదకరమో వీరికి అర్థం కావడంలేదు. పెద్ద ఎత్తున రవాణా జరుగుతుందని చెప్పలేం కానీ కొన్ని ట్రాన్స్‌పోర్టు వాహనాల నుంచి కొద్దికొద్దిగా గంజాయి శ్రీకాకుళం దిగుమతి కావడమో, ఎగుమతి కావడమో జరుగుతుందన్న ఆరోపణలు మాత్రం ఉన్నాయి. అతి పెద్ద వాహనంలో అనేక వస్తువుల మధ్య ఒక వంద గ్రాముల గంజాయిని తేవడం పెద్ద విషయమేమీ కాదు. ఇటువంటి ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల మీద సాధారణంగా జీఎస్టీ అధికారుల దృష్టి మాత్రమే ఉంటుంది. పోలీసులు పట్టించుకోరు. ప్రస్తుతం న్యూకాలనీలో గంజాయి విరివిగా దొరుకుతుందంటే కారణం లారీల రాకపోకలేనన్న ఆరోపణలూ ఉన్నాయి. గంజాయి తాగి, మందు కొట్టి ఇక్కడ రాత్రిపూట కాలనీవాసులు బయటకు రాకుండా రౌడీమూకలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘సత్యం’లో ప్రచురించిన నిన్నటి కథనంలో పేర్కొన్న ప్రాంతం వద్ద చిమ్మచీకటిగా ఉందంటూ అనేకమార్లు ఫిర్యాదు చేయడం, కార్పొరేషన్‌ యంత్రాంగం వచ్చి వీధిదీపం వేయడం, ఆ రాత్రే గంజాయి మూకలు దాన్ని రాళ్లు విసిరి పగలగొట్టడం వల్ల ఫిర్యాదు చేయడాన్నే ఏకంగా మానుకున్నారు. కుటుంబానికి అద్దెకిచ్చేకంటే కమర్షియల్‌ వినియోగానికి అద్దెకివ్వడం వల్ల, అందులోనూ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నందున ఇక్కడ భవన యజమానులు గొడౌన్లకు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలకు అద్దెకిచ్చేస్తున్నారు. ప్రస్తుతం న్యూకాలనీలో సిమెంట్‌, టైల్స్‌, శానిటరీ వేర్‌ గొడౌన్లు 10 వరకు ఉండగా, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫర్నిచర్‌ గొడౌన్లు మరో 10 వరకు ఉన్నాయి. వీటిని దించడానికో, ఎత్తడానికో కొన్ని వాహనాలు, రెగ్యులర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీల నుంచి మరికొన్ని వాహనాలతో న్యూకాలనీ పూర్తిగా ఆటోనగర్‌గా మారిపోయింది. ఆటోనగర్‌లు ఎప్పుడూ ఊరిశివారులో ఉంటాయి. ఆ తర్వాత ఊరు విస్తరించొచ్చు. కానీ విస్తరించిన ఊర్లో మాత్రం మధ్యలో ఉండవు.

గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయని భావించడం వల్ల ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకున్న వైకాపా నాయకుడు ఆక్రమణలకు బార్లా గేట్లు తెరిచేశారు. దీంతో అనేక బడ్డీలు, వెల్డింగ్‌ షాపులు, మెకానిక్‌ షాపులు రోడ్డు మీదే వ్యాపారాలు చేసుకుంటున్నారు. న్యూకాలనీకి రోడ్డు వేయాలన్నా, లైటు వేయాలన్నా తనకు చెప్పే జరగాలని మున్సిపాలిటీని తన గుప్పెట్లో పెట్టుకున్న ఈ నాయకుడి ఓటుబ్యాంకు రాజకీయం వల్ల న్యూకాలనీ పూర్తిగా గాడితప్పింది.

గడ్డర్ల ఏర్పాటుకు అనుమతివ్వండి

న్యూకాలనీలోకి భారీ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు రాకుండా అడ్డుకోవాలని, వీటిని ఊరి శివార్లలోకి తరలించాలని కాలనీ సంక్షేమ సంఘం గతంలో గ్రీవెన్స్‌కు ఇచ్చిన వినతుల్లో పేర్కొంది. పరిష్కారం కాకపోవడంతో కోర్టు మెట్లెక్కింది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటనేది తెలియదు గానీ, న్యూకాలనీలో మాత్రం ప్రధాన ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు, వాటికి అనుసంధానంగా నడుస్తున్న కార్గో వాహనాలు రోడ్ల మీదే కనిపిస్తున్నాయి. పోలీసుల ఉదాశీనత, రాజకీయ నాయకుల ఓటుబ్యాంకు వల్ల ఫలితం కనిపించడంలేదని భావిస్తున్న కాలనీవాసులు తమ సొంత ఖర్చుతో కాలనీకి వచ్చే మార్గాల్లో ఒక నిర్ధిష్ట స్థాయి ఎత్తులో గడ్డర్లు ఏర్పాటు చేసుకుంటామని, అందుకు కనీసం అనుమతులైనా ఇవ్వాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌కు విన్నవించుకుంటున్నారు. సెల్ఫ్‌ ఆపరేటింగ్‌ విధానంలో కాలనీవాసుల అవసరాల కోసం గడ్డర్‌లో పైభాగాన్ని అడ్జస్ట్‌ చేసుకునే విధంగా సొంత ఖర్చులు పెట్టుకుంటామని, ఈమేరకు అనుమతులు ఇప్పించాలని కోరుతున్నారు.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page