ఎమ్మెల్యేకే దమ్కీ ఇచ్చిన డ్వామా పీడీ
హెలికాఫ్టర్ టూరిజం తెచ్చిన ముప్పు
ఉపాధి గ్రామసభల్లో నాయకుల భజన వద్దన్న అధికారి
సిబ్బందితో పాటు కూటమి నాయకులూ బాధితులే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘ఎక్కడా ఎవరి దగ్గరా కనీసం టీ, కాఫీ కూడా ఆశించకండి.. వీలైతే మీ నీరు మీరే పట్టుకెళ్లండి. నేను కూడా అదే పని చేస్తాను. మీరూ అలా ఉంటేనే సక్రమంగా పని చేయగలం. ప్రతీదానికి డబ్బులు ఆశించడం, కాదంటే కొర్రీలు పెట్టడం వంటి పనులు ఇకనైనా మానుకోండి.’’
ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో పాటు ఎక్కడా ఎవర్నుంచీ టీ, కాఫీ కూడా ఆశించకుండా తన వాటర్ తానే తెచ్చుకొని పని చేస్తున్న అధికారి ఆయన. ఇది నాణేనికి ఒక కోణం.
‘‘మీరు నా మీద సభాహక్కుల నోటీసులు ఇచ్చి అసెంబ్లీకి పిలిపిస్తే నేను మీ మీద అట్రాసిటీ కేసు పెట్టగలను. మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన మీరేం చేసినా చూస్తూ కూర్చోలేను. నేనూ ఎదురుదాడి చేయగలను.’’
ఇది అదే అధికారిలో కనిపిస్తున్న నాణేనికి రెండో కోణం. ఒకే వ్యక్తిలో ఈ స్ల్పిట్ పర్సనాలిటీ ఉండటం అపరిచితుడు సినిమాలో చూశాం. ఇప్పుడు డుమా పీడీ సుధాకర్‌నే చూస్తున్నాం.
జిల్లా నీటి యాజమాన్య సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అయినదానికీ, కానిదానికీ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని, మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, రాత్రి 11 దాటాక కూడా పని చేయిస్తున్నారని ఇటీవల జిల్లా వ్యాప్తంగా డుమా ఉద్యోగులు నిరసన తెలిపింది, డీఆర్వోకు వినతిపత్రం సమర్పించింది ఈ పీడీ సుధాకర్‌పైనే. ఇప్పుడు ఇదే పీడీ స్వయంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానని పేర్కొన్నట్టు పార్టీలో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ కథాకమామీషులోకి వెళ్లాలంటే ముందుగా రాష్ట్ర పండుగగా ఇటీవల జరుపుకొన్న రథసప్తమి వేడుకల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి.
రథసప్తమి సందర్భంగా హెలీకాఫ్టర్ టూరిజం అంటూ నాలుగు రోజులు ఇక్కడ హెలికాఫ్టర్ గాలిలో ఎగిరింది. దీనికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. హెలికాఫ్టర్ నడిపేవాడికి ఎక్కడా విశ్రాంతి లేకుండా గాలిలో చక్కర్లు కొడుతునే ఉంది. దీనిని డుమా పీడీ నేరుగా పర్యవేక్షించారు. టిక్కెట్ల అమ్మకం, పైలెట్ వసతి వంటివి ఆయనే చూశారు. ఈ హెలికాఫ్టర్ ఎక్కడానికి డుమా టిక్కెట్ కౌంటర్ తెరిచింది. దీనికి జనాలు పోటెత్తడంతో పీడీ సిఫార్సు ఉన్న లేఖ ఉంటేనే టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని రెండోరోజు ప్రవేశపెట్టారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హెలికాఫ్టర్ టిక్కెట్ కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో ఎమ్మెల్యే గొండు శంకరే పీడీకి పలుమార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదట. చివరకు గత్యంతరం లేక జిల్లా కలెక్టర్‌కు శంకర్ ఫోన్ చేయడం, కలెక్టర్ దినకర్ పుండ్కర్ పీడీకి ఫోన్ చేయడం, అయినా ఆయన స్పందించకపోవడంతో జిల్లా అధికారుల గ్రూపులో టిక్కెట్లు కావాలంటూ కలెక్టర్ మెసేజ్ పెట్టడంతో 12 టిక్కెట్లు ఇచ్చినట్లు భోగట్టా. అయితే ఎమ్మెల్యేగా రాష్ట్ర పండగగా రథసప్తమి జరపడంలో ముఖ్యమంత్రిని ఒప్పించిన తనకే హెలికాఫ్టర్ ఎక్కడానికి టిక్కెట్ ఇవ్వకపోవడం, ఫోన్ చేస్తే పీడీ స్పందించకపోవడంపై అసెంబ్లీ సమావేశాల్లో పీడీపై సభాహక్కుల నోటీసు ఇస్తానంటూ ఎమ్మెల్యే పేర్కొనడంతో, అదే జరిగితే తాను అట్రాసిటీ కేసు పెడతానని పీడీ సమాధానమిచ్చినట్టు చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యే వెనక్కు తగ్గారో, లేదూ అంటే జిల్లాలో వేరేవారి అండదండలున్నాయని భావించారో తెలీదు గానీ ప్రస్తుతానికి ఇరువురూ అంతవరకు వెళ్లలేదు. స్వయంగా హెడ్‌క్వార్టర్ ఎమ్మెల్యే మీదే పీడీ స్థాయి అధికారి ఈ విధంగా కేసు పెడతాననడం ఇప్పుడు సంచలనమై కూర్చుంది. పీడీగా సుధాకర్ వచ్చిన తొలిరోజుల్లోనే గార మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల కోసం ఓచోట గ్రామసభ నిర్వహిస్తే, అందులో పాల్గొన్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యే, ఎంపీలు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వివరిస్తుంటే, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ఏ పనులు చేపట్టాలనేది మాత్రమే చర్చించాలని, రాజకీయ భజనలు మానుకోవాలని డుమా పీడీ ఆ సభలోనే సూచించడంతో ఈ పంచాయితీ ఎమ్మెల్యే గొండు శంకర్ వద్దకు అప్పట్లోనే వచ్చింది. ఈ విషయంపై పీడీ సుధాకర్‌ను కార్యాలయానికి పిలిపించి ఎమ్మెల్యే మందలించినట్టు భోగట్టా. అక్కడికి కొద్ది రోజుల తేడాలోనే శ్రీకాకుళం రూరల్ మండలంలో కూడా ఓ గ్రామసభలో ఇదే తంతు జరిగింది. అప్పట్నుంచి ఎమ్మెల్యేకు, డుమా పీడీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ మంటలో నెయ్యి పోసినట్టు రథసప్తమిలో హెలికాఫ్టర్ గొడవ ఒకటొచ్చి చేరింది. ఇంతవరకు సిబ్బంది మాత్రమే పీడీతో ఇబ్బంది పడుతున్నారని డుమాలో అందరూ భావించారు. కానీ ప్రజాప్రతినిధులు కూడా ఆయనతో ఇబ్బందే ఎదుర్కొంటున్నారు. ఆమధ్య కొందరు వైకాపా ఫీల్డ్ అసిస్టెంట్లను తన నియోజకవర్గంలో తొలగించాలని మంత్రి అచ్చెన్నాయుడు సుధాకర్‌కు చెప్పారు. కానీ అది ఎప్పటికీ చేయకపోవడంతో నిమ్మాడ పిలిచి సుధాకర్‌ను మందలించడంతో ఆ పని జరిగినట్లు తెలుస్తుంది.
నీటి యాజమాన్య సంస్థ రాష్ట్ర సంఘంలో నాయకుడిగా ఉన్న సుధాకర్ వాస్తవానికి నిజాయితీపరుడే. గడిచిన ఏడేళ్లు డుమాను పూర్తిగా గాలికొదిలేసి ప్రతీ పనిలోనూ వాటాలు సర్దుకున్న అధికారులు పనిచేసిన చోట సుధాకర్ లాంటి డబ్బులకు కక్కుర్తిపడని వ్యక్తి పనిచేయడం గొప్ప విషయమే. కానీ ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను కాదని ఆయన సంస్థను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడం కష్టం. చాలా కాలం నుంచి వందరోజుల పనికల్పనలోనూ, అత్యధికంగా వేతనాలు అందించడంలోనూ శ్రీకాకుళం ఒకటి నుంచి మూడు స్థానాల లోపే రాష్ట్రంలో ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడ వలస పోయే కూలీలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఒక వరం. పీడీలుగా ఉన్నవారు ఏ పనీ చేయకపోయినా శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో కూలీలకు, పనులకు కొదవలేదు. గత ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను వేరే పథకాలకు మళ్లించడంతో రూ.265 కోట్ల నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో మెటీరియల్ కాంపొనెంట్ పనులు జరగలేదు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం చెరువుల తవ్వకం వంటి పనులను ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపట్టడానికి సిద్ధంగా లేదు. దాని స్థానంలో గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాలకు మండువేసవిలో కూడా నీరు అందించే విధంగా చిన్నచిన్న 8/8 ఫారం పాండ్స్ తవ్వడం, అలాగే ప్రతీ ఇంటి ముందు వాడకం నీరు భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలు తవ్వడం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే మెటీరియల్ కాంపొనెంట్ కింద పశువుల శాలలు ఏర్పాటుచేయాలని, సముద్రతీర ప్రాంతాల్లో చేపలు ఎండబెట్టడానికి ప్లాట్‌ఫారాలు కట్టమని చెబుతుంది. అయితే ఇవి గ్రామాల్లో పైపైగా చేసే చెరువు పనులు లాంటివి కావు. మస్తరేసి వేతనం తీసుకుపోవడానికి కుదరదు. ఎకరం పొలం ఉన్న రైతు క్షేత్రంలో 8/8 గుంత తవ్వకపోతే స్వయంగా రైతే ఒప్పుకోడు. అలాగే ఇంటిముందు ఇంకుడు గుంత లెక్కప్రకారం తవ్వకపోతే ఇంటి యజమాని ఊరుకోడు. కాబట్టి ఈ పనులు చేయడానికి గ్రామాల్లో కూలీలు ముందుకు రావడంలేదు. కానీ రూ.360 కోట్లకు పైబడి నిధులు ఉండిపోయాయని, అప్పటికీ పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ వంటి శాఖలకు పనులు అప్పగించినా డుమాలో మాత్రం ఇంకా ఉండిపోతున్నాయని భావిస్తున్న పీడీ సుధాకర్ దాన్ని ఎలా చేయించుకోవాలో తెలీక సిబ్బంది మీద విరుచుకుపడుతున్నారు. విజయవాడలో డుమా హెడ్‌ఆఫీస్ ఫలానా పనిని వారం రోజుల్లో పూర్తిచేయాలని డెడ్‌లైన్ ఇస్తే, ఈయన ఇక్కడ మూడు రోజులకే పూర్తికావాలని సిబ్బందిని రఫ్ఫాడేస్తున్నారు. అసలే కూలీలు దొరక్క క్షేత్రస్థాయిలో డుమా సిబ్బంది ఇబ్బంది పడుతుంటే, విజయవాడ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ మీటింగ్ అయిన వెంటనే శ్రీకాకుళంలో డుమా ఉద్యోగులందరితోనూ అర్థరాత్రి, అపరాత్రి లేకుండా పీడీ గూగుల్ మీటింగ్ పెడుతున్నారు. వీటన్నిటిపైనా అటు కలెక్టర్, ఇటు మంత్రి దృష్టిలో ఉన్నా పీడీ మీద ఎటువంటి చర్యలూ లేవు. ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యేపైనే కేసు పెడతానన్న అంశంలో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Comments