భావనపాడు స్థానంలో అనూహ్యంగా తెరపైకి
ఈ మార్పే సిక్కోలు పాలిట మేలిమలుపుగా మారుతోంది
ఇప్పటికే శరవేగంగా పోర్టు నిర్మాణ పనులు
కొత్తగా ఎయిర్‌పోర్టు, సాగరమాల రోడ్లు, పారిశ్రామిక హబ్
పెట్రో రిఫైనరీ కూడా మంజూరయ్యే అవకాశం

పేరుకు తగ్గట్లే అది ఒక మూలన ఎవరికీ పట్టని.. అసలు తెలియనట్లు ఉన్న చిన్న గ్రామం. ఇప్పడదే ఒక ప్రముఖ కేంద్రంగా పరిశ్రమల పుంతగా.. అభివృద్ధికి మూలస్థానంగా రూపుదిద్దుకుంటోందా? అంటే ప్రభుత్వాలు చేస్తున్న ప్రతిపాదనలు అవుననే చెబుతున్నాయి. అదే జిల్లాలోని మూలపేట. సంతబొమ్మాళి మండలంలో సముద్రతీరాన ఉన్న ఈ చిన్నగ్రామం తన స్వరూపాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. తనతో పాటు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలనే మార్చే దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే అక్కడ నౌకాశ్రయం(పోర్టు) నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోర్టుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు మూలపేట వేదిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే మినీ ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రియల్ హబ్, సాగరమాల ప్రాజెక్టుతో పాటు పెట్రో రిఫైనరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాలిస్తే ఇంతకాలం వెనుకబాటుతో, వలసలతో కుంగిపోతున్న శ్రీకాకుళం జిల్లా అగ్రపథంలోకి దూసుకుపోతుందన్న ఆశాభావం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని అంటారు. అది ఎంతవరకు నిజమో గానీ.. వెనుకబడిన జిల్లాగా అట్టడుగున మగ్గిపోతున్న శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా అడ్డంకులను అధిగమించి ప్రగతిపథంలో దూసుకుపోయేందుకు అనువైన పరిణామాలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. జిల్లావాసులకు శుభసంకేతాలు పంపుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ.. విభజత ఆంధ్రప్రదేశ్‌లో గానీ సిక్కోలుది చిట్టచివరి స్థానమే. ఏమాత్రం అభివృద్ధి వాసనలు లేని ఈ జిల్లా ఒక్కటంటే ఒక్కటైనా భారీ పరిశ్రమకు నోచుకోక దశాబ్దాలుగా పేదరికం నీడలో మగ్గిపోతోంది. ఉన్న ఒక్కగానొక్క ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. చిన్నాచితకా పరిశ్రమలు తప్ప పెద్దగా ఉపాధి అవకాశాలు లేక జిల్లా ప్రజలు పొట్ట చేతపట్టుకుని వలసల బాట పడుతున్న దుస్థితి. దాంతో శ్రీకాకుళం వలసల జిల్లాగా పేరుపడిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే పేరుతో అనేక ప్రాజెక్టులు, జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు హామీ ఇస్తూ ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన వాటిలో ఒక్కటి కూడా శ్రీకాకుళం జిల్లాకు దక్కలేదు. అదే చట్టంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ కూడా గాల్లో కలిసిపోయింది. ఇలా అన్నివిధాలా అన్యాయమైపోతున్న జిల్లాకు అనుకోని విధంగా మూలపేట రూపంలో అదృష్టం తలుపు తడుతోంది. వరాల మూటలు తీసుకొస్తోంది. అభివృద్ధిపై కొత్త ఆశలకు రెక్కలు తొడుగుతోంది.
భావనపాడు స్థానంలో తెరపైకి మూలపేట
రెండేళ్ల క్రితం వరకు మూలపేట గురించి రాష్ట్రానికే కాకుండా జిల్లా ప్రజలకు కూడా సరిగ్గా తెలియదు. భావనపాడులో ప్రతిపాదించిన పోర్టు నిర్మాణాన్ని గత వైకాపా ప్రభుత్వం మూలపేటకు మార్చడంతో ఇది వెలుగులోకి వచ్చింది. భావనపాడులో పోర్టు నిర్మాణ ప్రతిపాదన దాదాపు ఐదు దశాబ్దాలనాటిది. నిర్మాణానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి ఫలవంతం కావని నిర్ధారణ కావడంతో నిలిపివేశారు. ఇక్కడ సముద్రం బెర్తులు నిర్మించి, నౌకలు నిలిపేందుకు అనుకూలం కాదని తెలడంతో ఇక పోర్టు రాదనుకున్నారు. కానీ గత ప్రభుత్వం నిపుణులతో అధ్యయనం చేయించి భావనపాడుకు కొద్ది దూరంలోనే ఉన్న మూలపేటలో పోర్టు నిర్మించాలని నిర్ణయించింది. స్థలం మార్పుపై చాలా వ్యతిరేకత వచ్చినా ఎట్టకేలకు పోర్టు నిర్మాణం ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది. సముద్రంలో అలల తాకిడిని తగ్గించేందుకు బ్యాక్ వాటర్స్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అదే సమయంలో జాతీయ రహదారి నుంచి మూలపేట పోర్టుకు కనెక్ట్ చేసేలా రహదారుల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు కట్టుబడి ఉండటమే కాకుండా సాధ్యమైనంత త్వరగా పోర్టును అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తోంది. పోర్టు నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తే.. దీనికి అనుబంధంగా అనేక చిన్న పరిశ్రమలు ఏర్పాటై వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
మరికొన్ని ప్రాజెక్టులు
దశాబ్దాల తర్వాత సాకారమవుతున్న పోర్టుతోనే చాలా అభివృద్ధి జరుగుతుందని అనుకుంటే ఇప్పుడు దానికితోడు మరికొన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనల గురించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రస్తావించడంతో వీటిపై ఆశలు చిగురిస్తున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢల్లీి పర్యటనలో భాగంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి రాష్ట్రంలో విమాన సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలోనే రాష్ట్రంలో మరో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగింటిలో ఒకటి శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దాంతోపాటు చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదుర్తి, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లలోనూ కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు సమావేశం అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటించారు.
రాష్ట్రానికి పొడవైన సాగరతీరం ఉంది. అందులో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే వంద కిలోమీటర్లకుపైగా తీరప్రాంతం ఉంది. తీరం పొడవునా అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్రం ప్రతిపాదించిన సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఆరులైన్ల రోడ్లు నిర్మించనున్నారు.
మూలపేటలో నిర్మిస్తున్న పోర్టు కారణంగా నౌకాయాన, రవాణా రంగాలకు చెందిన అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశాలు మెండుగా ఉండగా వాటికి అదనంగా పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. రాష్ట్రంలో రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటు చేస్తామని చెబుతూ వాటిలో ఒకటి శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను మూలపేట హబ్‌లో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడిరచారు.
రిఫైనరీ కూడా వచ్చే ఛాన్స్
వీటితో పాటు మరో జాక్‌పాట్ తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే భారీ పెట్రోలియం రిఫైనరీ. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలోనే హెచ్‌పీసీఎల్ పెట్రో రిఫైనరీ ఉంది. విశాఖ అభివృద్ధిలో దాని పాత్ర ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అటువంటి భారీ పరిశ్రమే మన జిల్లాకు ప్రత్యేకించి మూలపేటకు వచ్చే ఛాన్స్ ఉంది. దేశంలో ప్రముఖ ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) తన విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ రిఫైనరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. రూ.60వేల కోట్లతో ఏటా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించే ఈ రిఫైనరీకి ప్రధానంగా మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. మచిలీపట్నం, రామయపట్నం, మూలపేట పోర్టు ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. మచిలీపట్నంలో భూముల రేట్లు అధికంగా ఉండటం వల్ల భూసేకరణకే పెద్దమొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మరోవైపు రామయపట్నం అంత అనుకూలంగా ఉండదని, ఈ రెండిరటితో పోలిస్తే మూలపేటలో భూసేకరణ తక్కువ వ్యయం కావడంతో పాటు జాతీయ రహదారి, ప్రధాన రైల్వేలైన్ సమీపంలోనే ఉండటం.. అలాగే పక్కనే ఒడిశా రాష్ట్రం కూడా ఉండటం వల్ల మూలపేట ప్రాంతమే పెట్రో రిఫైనరీ నిర్మాణానికి పూర్తి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
రాజకీయంగానూ అనుకూలతలు
ప్రతిపాదనలు తెరపైకి రావడంతో పాటు వాటిని సాకారం చేయాల్సిన రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇక రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఉన్న అచ్చెన్నాయుడు తన నియోజకవర్గంలోనే ఉన్న మూలపేట ప్రాంతంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వపరంగా కాగల కార్యాలను శీఘ్రం పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరంతా కలసికట్టుగా కృషి చేస్తే.. అన్నీ అనుకూలిస్తే మూలపేట.. తద్వారా శ్రీకాకుళం ముఖచిత్రం వెలిగిపోవడం ఖాయమన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. వలసల జిల్లా అన్న పేరును చెరిపేసుకుని ఉపాధి ఖిల్లాగా సిక్కోలు ఉన్నత స్థానానికి చేరుతుంది.
Comments