మార్కెట్ ధరలకే ప్రభుత్వం అమ్మకాలు
డిమాండ్ తగ్గినా ధర తగ్గించని వ్యాపారులు
రైతుబజారు పేరుతో రేటు పెంచేస్తున్న హోల్‌సేలర్లు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రభుత్వమే నిత్యావసరాల ధరలను పెంచేందుకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో లభ్యమయ్యే పప్పు, వంటనూనె ధరలను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం హైప్ చేసి రైతుబజార్లో పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేసి విక్రయిస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొంటోంది. టీడీపీ హయాంలో 2016లో కందిపప్పు ధర బహిరంగ మార్కెట్‌లో రూ.100కు చేరింది. దీంతో ప్రభుత్వం హడావుడిగా రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి రూ.90కి అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.60కే లభించేది. ఎప్పుడైతే ప్రభుత్వం రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసి రూ.90కి విక్రయించడం ప్రారంభించారో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులంతా కిలో కందిపప్పు రూ.90కి ఫిక్స్ చేసేశారు. ఈ ఏడాది జూలై, ఆగస్టులో కందిపప్పు ధర బహిరంగ మార్కెట్‌లో రూ.180కి చేరిందని ప్రచారం కావడంతో కూటమి ప్రభుత్వం హడావుడిగా రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి కిలో కందిపప్పు రూ.160కి విక్రయించడం ప్రారంభించింది. అప్పటి వరకు సాధరణ రకం కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో రూ.140కు లభ్యమయ్యేది. ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటుచేసిన తర్వాత హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు సాధారణ రకం కందిపప్పును రూ.160కు పెంచి విక్రయించడం ప్రారంభించారు. మేలురకం కందిపప్పు అప్పుడూ, ఇప్పుడూ రూ.180కే విక్రయిస్తున్నారు. సాధారణ రకం కందిపప్పును కర్నూల్ నుంచి, మేలు రకం కందిపప్పును మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక కౌంటర్లు ఎత్తేయడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు విక్రయిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే పెంచారు
ఇప్పుడు వంటనూనెల ధరల విషయంలోనూ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేసేలా ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను అదుపు చేయడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నట్టు హడావుడి చేసి హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ధరలు నిర్ణయించి రైతుబజార్లు, మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడానికి ముందు వరకు పామాయిల్ ప్యాకెట్ రూ.90, సన్‌ఫ్లవర్ రూ.101కి అందుబాటులో ఉండేది. 12 శాతం సుంకం విధించిన తర్వాత పామాయిల్ రూ.105, సన్‌ప్లవర్ రూ.123కి విక్రయించారు. ప్రభుత్వం ఆయిల్ ట్రేడ్ వ్యాపారులతో సమావేశం నిర్వహించి పామాయిల్ రూ.110, సన్‌ఫ్ల్లవర్ రూ.124కు రైతుబజార్లో ప్రత్యేక విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో అప్పటి వరకు ఇదే ధరకు లభించే వంటనూనెలను ప్యాకెట్‌కు రూ.5 నుంచి రూ.10 పెంచి విక్రయించడం ప్రారంభించాయి. ప్రత్యేక కౌంటర్లు కొన్ని రోజుల్లో మూతపడిన తర్వాత బహిరంగ మార్కెట్‌లో లభ్యమయ్యే ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరిస్తుందన్న విమర్శలను మూటగట్టుకుంటుంది. సాధారణంగా మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా ధరలు పెరగడం, తగ్గడం ఉంటుంది. ఈ ఏడాది మినప పప్పుకు డిమాండ్ ఉందని ధరలు పెంచితే, వచ్చే సీజన్‌కు మినప పంట పెరిగి ధర తగ్గిపోతుంది. కానీ ప్రభుత్వమే ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేయడం వల్ల రేటు తగ్గినా కూడా తగ్గించడానికి వర్తకులు దిగిరావడంలేదు. ఇప్పుడంటే సుంకం విధించడం వల్ల నూనె ధరలు పెరిగాయి కానీ, పప్పుదినుసుల ధరలు మాత్రం వాతావరణానికి అనుకూలంగా మారుతుంటాయి. ప్రభుత్వం ముందే తొందరపడటం వల్ల అంతకు మించి అమ్మి వ్యాపారులు సొమ్ములు చేసుకుంటున్నారు.
留言