top of page

మోసాలే ఆయనగారి ఉద్యోగం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 4
  • 3 min read
  • నిరుద్యోగులు, తోటి ఉద్యోగులు, అమాయకులే సమిధలు

  • విధులకు హాజరుకాకుండానే అప్పనంగా జీతం డ్రా

  • ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల పరంపర

  • విచారణలు జరిగినా వెలుగుచూడని నివేదికలు

  • డిప్యూటీ సీఎం పవన్‌ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితులు


చిన్న చిన్న మొత్తాలను లంచాలుగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకుని జైల్లో పెట్టి, విధుల నుంచి సస్పెండ్‌ చేయిస్తుంటారు. ఇటువంటి అవినీతి కేసులు తరచూ నమోదవుతుంటాయి. లంచావతారాలను పట్టుకుని శిక్షించడంలో తప్పులేదు గానీ.. చిల్లర కాకుండా కుంభస్థలాలను కొట్టే, మోసాలే ప్రవృత్తిగా పెట్టుకుని ఒక ప్రభుత్వోద్యోగిపై దశాబ్దాలుగా ఈగ వాలనివ్వకుండా అధికార వ్యవస్థలోని కొందరు కాపాడుకుంటూ వస్తుండటమే విస్మయం, బాధ కలిగిస్తోంది. దీనిపై పలువురు బాధితులు తాజాగా జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో సదరు ఉద్యోగి ఘనకార్యాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అతగాడి పేరు మన్నం సతీష్‌. చేసేది ప్రభుత్వ ఉద్యోగం. కానీ ప్రవృత్తి మాత్రం మోసాలు. దశాబ్ధ కాలంగా ఇతగాడు నిరుద్యోగులను, తోటి ప్రభుత్వ ఉద్యోగులను, చిల్లర వ్యాపారులను మాయ చేయడమే కాకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఉద్యోగాలు వేయిస్తానని నిరుద్యోగులను, బదిలీలు చేయిస్తానని తోటి ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయిస్తానంటూ చిరు వ్యాపారులను నమ్మించి భారీగా డబ్బు దండుకోవడమే సతీష్‌కు నిత్యకృత్యం. ఆ డబ్బుతో ఖరీదైన కార్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడు. మరోవైపు మందస మండలం లోహరిబంద పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన విధులకు హాజరుకాకుండనే ప్రతి నెలా ఠంచనుగా జీతం డ్రా చేసుకుంటున్నాడు. ఈయనకు ఫేస్‌ రికగ్నిషన్‌ అవసరం లేదు. మండల అధికారుల సహకారంలో విధులకు హాజరైనట్లు మేనేజ్‌ చేసి అప్పనంగా జీతం అందుకుంటున్నాడు. వారంలో నాలుగు రోజులు శ్రీకాకుళం కోర్టులో వివిధ కేసుల వాయిదాలకు హాజరవుతుంటాడు.

ఉత్తుత్తి విచారణలు

సతీష్‌ చేతిలో మోసపోయిన బాధితులు న్యాయం కోసం జిల్లా ఉన్నతాధికారులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందించిన దాఖలాలు లేవు. సతీష్‌ ఆగడాలపై వారంతా గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేసి మూడేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నా అధికారులు మాత్రం విచారణలు చేయడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు. జెడ్పీ సీఈవో వద్ద మూడుసార్లు, దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ వద్ద ఒకసారి, శ్రీకాకుళం డీఎస్పీ వద్ద మరోసారి బాధితులు వ్యక్తిగతంగా విచారణకు హాజరై సతీష్‌ చేసిన మోసాలపై లిఖిత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ విచారణ నివేదికలు ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. కలెక్టర్‌ వద్దకూ వెళ్లలేదు. ఈ ఏడాది జనవరి 24న జెడ్పీ సీఈవో సతీష్‌ బాధితులపై ఒక్కొక్కరినీ వేర్వేరుగా విచారించి వారిచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలాలను జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)కి పంపించారు. వాటి ఆధారంగా డీపీవో పూర్తి నివేదిక రూపొందించి కలెక్టర్‌కు సమర్పించాలి. అయితే విచారణ జరిగి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ నివేదిక డీపీవో నుంచి కలెక్టర్‌కు వెళ్లలేదు. పంచాయతీ కార్యదర్శిగా ఉంటూ అనేక మోసాలకు పాల్పడిన సతీష్‌ను జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) కార్యాలయం ఏవో కాపాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

జనవాణిలో ఫిర్యాదు

సతీష్‌ మోసాలపై జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో కొందరు బాధితులు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నిర్వహిస్తున్న జనవాణిని ఆశ్రయించారు. ఈ నెల ఒకటో తేదీన మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జనవాణిలో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసి సతీష్‌ను కాపాడేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదుకు, ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన అంశాలకు పొంతన లేకపోవడం వల్ల ఏడాది గడిచినా సీసీ నెంబర్‌ రాలేదని బాధితులు ఆరోపించారు. సతీష్‌కు తాము ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించిన తేదీలను మార్చి, మొత్తాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సతీష్‌పై బాధితులు భాగ్యరాజు, గౌరీశంకర్‌ తదితరులు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా రసీదు ఇవ్వకపోగా, ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆరోపించారు. ఈశ్వరమ్మ అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో ఆమె ప్రైవేట్‌ కేసు వేసినట్టు బాధితులు తెలిపారు. దాంతో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినా ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక ఏఎస్‌ఐని సతీష్‌ మోసగించిన కేసులో మాత్రమే పోలీసులు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ కేసులోనే సతీష్‌ కోర్టుకు హాజరవుతున్నట్టు తెలిసింది. ఏఎస్‌ఐ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం వేయిస్తానని చెప్పి పెద్దమొత్తంలో డబ్బులు గుంజినట్టు తెలిసింది. దీనిపై వారు చీటింగ్‌ కేసు నమోదు చేయడంతో విడతలవారీగా డబ్బులు వెనక్కి ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఆగని మోసాలు

ఫిర్యాదులు, విచారణలు ఒకవైపు సాగుతుండగానే, తన పని తనదే అన్నట్లు సతీష్‌ మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడు. శ్రీకాకుళం గుజరాతీపేటకు చెందిన పాన్‌షాపు యజమాని ఈశ్వరరావు నుంచి రూ.2 లక్షలు కాజేసినట్టు తెలిసింది. పెద్దపాడు రోడ్డులో ఉన్న ఒక బ్యాంకు మేనేజర్‌ తన స్నేహితుడని, ఆయన ద్వారా తక్కువ వడ్డీకి బ్యాంకు రుణం ఇప్పిస్తానని చెప్పి విడతలవారీగా డబ్బులు ఖాతాలో జమ చేయించుకున్నట్టు తెలిసింది. మార్చి 31 నాటికి బ్యాంకు రుణం మంజూరవుతుందని చెప్పి తనను మోసం చేసినట్టు గుర్తించిన సదరు చిరువ్యాపారి సతీష్‌ను నిలదీయగా మాయమాటలు చెప్పి మరికొంత మొత్తం ఇస్తే రుణం మంజూరైపోతుందని నమ్మబలికినట్టు తెలిసింది. ఆ మాటలు నమ్మని సదరు బాధితుడు సతీష్‌ వినియోగిస్తున్న కారును పట్టుకెళ్లిపోయినట్టు తెలిసింది. ఇలా అనేక మందిని మోసం చేస్తున్న సతీష్‌ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల లోహరిబంద సచివాలయానికే చెందిన డిజిటల్‌ అసిస్టెంట్‌ ప్రజలు చెల్లించిన సేవా రుసుములు రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించకుండా కాజేశాడు. దీనిపై మందస ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెండైన ఈ ఉద్యోగితోనే పంచాయతీ కార్యదర్శి సతీష్‌ మార్చి నెలలో పెన్షన్లు పంపిణీ చేయించాడు. పంచాయతీ కార్యదర్శి సతీష్‌ సహకారంతోనే సదరు సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన సేవా రుసుములను సొంతానికి వాడుకున్నట్టు మందస ఎంపీడీవో కలెక్టర్‌కు నివేదించడం గమనార్హం. అయినా డిజిటల్‌ అసిస్టెంట్‌ను మాత్రమే సస్పెండ్‌ చేసి పంచాయతీ కార్యదర్శి సతీష్‌ను కాపాడారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page