మోసాల్లోనూ గుజరాతే మోడల్
- DV RAMANA
- Nov 1, 2024
- 2 min read
Updated: Nov 2, 2024

దేశంలో ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పుకోవాల్సి వచ్చిన ప్రతీసారి గుజరాత్ మోడల్‌నే మన నాయకులు చెబుతుంటారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గుజరాత్ వెలిగిపో యిందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని చెప్పడానికి పర్యాయపదంగా గుజరాత్‌ను చెబుతుంటారు. ఇక్కడ ఏమేరకు అభివృద్ధి జరిగిందనేది పక్కనపెడితే.. ఈమధ్య గుజరాత్ మోసాలకు మోడల్‌గా నిలుస్తుంది. ఫేక్ కరెన్సీ సంఘటనలు దేశంలో చాలా జరిగాయి. కానీ, గుజ రాత్‌లో జరిగింది మాత్రం హైలైట్. ఒకడు బంగారం షాప్‌కి వెళ్లి రెండు కిలోలు బంగారం కొన్నాడు. కోటి అరవై లక్షల నోట్ల కట్టలు ఇచ్చాడు. షాపోడు వాటిని కౌంటింగ్ మెషీన్లలో పెట్టి కౌంట్ చేసుకుని ఓకే చెప్పాడు, వీడు బంగారంతో వెళ్లిపోయాడు. తర్వాత షాపతనికి తెలిసిందేటంటే.. ఆ నోట్లకట్టల్లో పైన, కింద ఒరిజినల్ నోట్లు, లోపల మాత్రం నకిలీ నోట్లు ఉన్నాయి. నకిలీ అంటే ఎలా? కలర్ తేడానో, ప్రింటింగ్ తేడానో కాదు.. వాటిలో గాంధీ బొమ్మ స్థానంలో అనుపమ్ ఖేర్ ఓ సినిమాలో గాంధీ వేషం వేసిన బొమ్మ ప్రింట్ అయ్యింది. పాపం ఆ షాపోడి పరిస్థితేంటో చెప్పనక్కర్లేదు. గాంధీ నగర్‌లో మోరిస్ స్యామ్యూల్ అనేవాడు ఫేక్ కోర్టు, అంటే నకిలీ న్యాయస్థానం స్టార్ట్ చేసేశాడు. స్వయం ఉపాధి స్కీమ్ కింద సొంతంగా ఆఫీస్ తెరిచి, దానికి ముందు ‘షెషన్స్ కోర్ట్’ అని బోర్డ్ పెట్టాడు. జడ్జ్ కోట్ వేసుకుని, జడ్జ్ సీట్‌లో కూర్చుని ‘ముద్దాయిని ప్రవేశపెట్టండి’ అనగానే, పోలీసులు, లాయర్లు, బాధితులు అందరూ ‘మాకు న్యాయం చేయండి’, ‘మాకు న్యాయం చేయండి’ అంటూ ఇతని చుట్టూ మూగారు. ఇతను విచ్చలవిడిగా న్యాయం చేస్తూ పోయాడు. ఈ తతంగం ఐదేళ్లు అప్రతిహతం గా సాగింది. ఈ ప్రాసెస్‌లో మనోడు బాగానే ఆస్తులు, స్థలాలు, పొలాలు వెనకేసుకున్నాడు. వీని అభివృద్ధి చూసి కళ్లుకుట్టిన ఒరిజినల్ జడ్జిలు కంప్లైంట్ చేయడంతో వీడు చేసే న్యాయానికి అన్యాయం జరిగింది. గుజరాత్‌లోని బికనీర్-మోర్బీ హైవేపై ఓ టోల్‌ప్లాజా ఉంది. ఆ టోల్‌ప్లాజా వాహనదారుల నుంచి అధిక టోల్ వసూల్ చేయడాన్ని చూసి, ఆ పక్క గ్రామంలోని ధర్మేంద్ర సింగ్ జాలా అనే వ్యక్తి ‘ఆపండి ఈ అన్యాయం’ అని నినదించాడు. ఎవరూ ఆపకపోవడంతో, ఆ టోల్‌ప్లాజాకి సమాంతరంగా 600 మీటర్ల దూరంలో మరో టోల్‌ప్లాజా నిర్మించి, బారికేడ్స్‌లో వెహికల్స్ వెళ్లేంత ఓపెనింగ్ తెరిచి, మట్టి రోడ్డు వేసి, ఒరిజినల్ టోల్‌రేట్‌లో 80 శాతం డిస్కౌంట్ ఇచ్చాడు. ఇంకేముంది, వాహనాలన్నీ అటు వెళ్లడం మొదలైంది. ఈ తతంగం రెండేళ్లు గడిచాక గానీ టోల్ కంపెనీకి అసలు విషయం తెలీలేదు. ఇలా ఎలా జరిగింది అనే అనుమానం ఇంకా మిమ్మల్ని తొలుస్తుంటే.. దానికి హింట్, ఆ విలేజ్ సర్పంచ్ ఈ ధర్మేంద్ర సింగ్ భార్యే, వీరిద్దరు బీజేపీ నాయకులు. అదీ సంగతి. సందీప్ రాజ్‌పుత్ అనే మరో ట్యాలెంటెడ్ ఫెలో ఉన్నాడు. గుజరాత్‌లోని చోటా ఉదయ్‌పూర్ జిల్లా మోడేలీ తాలుకాలో, ఓ ప్రభుత్వ కార్యాలయం స్టార్ట్ చేసేశాడు. ఆదివాసీ సంక్షేమ పధకాల కింద ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.5 కోట్ల నిధుల్ని నొక్కేశాడు. కిరణ్ భాయ్ పటేల్ అనే మరో ప్రముఖుడు కాశ్మీర్ డీజీపీ ఆఫీస్‌కి వెళ్లి, తాను ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఓ స్పెషల్ ఆపరేషన్ కోసం కాశ్మీర్ వచ్చానని, తనకు ఫెసిలి టీస్ ఏర్పాటు చేయమని చెప్పాడు. అంతే, ఆ తర్వాత నాలుగు నెలలు అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస, జెడ్ ప్లస్ సెక్యూరిటీ, ఫుడ్డూ, బెడ్డూ మొత్తం ప్రభుత్వ లాంఛనాలతో ఎంజాయ్ చేశాడు. రాజ్‌కోట్ జిల్లా పిపాలియా గ్రామంలో కొందరు నిరుద్యోగ యువకులు ఓ ఫేక్ స్కూల్ స్టార్ట్ చేసి, ఆరేళ్ల పాటు మధ్యాహ్న భోజన నిధులు చక్కగా ఆరగించారు. సూరత్‌కి చెందిన హిమాన్షు రాయ్ కస్టమ్స్ ఆఫీసర్ అయ్యాడు. ఆరావలి జిల్లా బయడ్ తాలూకాకు చెందిన ప్రకాష్ నాయక్ డిప్యూటి కలెక్టర్ అయ్యాడు. హితేశ్వర్ సింగ్ మోరీ అనే బీజేపీ కార్పోరేటర్ సీబీఐ ఆఫీసర్ అయ్యాడు, భరత్ ఛాబ్‌డ్ ఐఏఎస్ అయ్యాడు, ప్రద్యుమన్ పటేల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, తరుణ్ భట్ సీఐడి ఆఫీసర్, లాకూష్ త్రివేది ఎస్‌ఐ, నిఖిల్ పటేల్ ఎస్‌ఐ, ఓం వీర్ సింగ్ ఈడీ, గుంజన్ కటారియా ఎన్‌ఐఏ, హిరాలీ కొరాడియా జిల్లా కలెక్టర్, నేహా పటేల్ డిప్యూటీ కలెక్టర్, పుఖ్రాజ్ రాయ్ సీబీఐ, విరాజ్ పటేల్ ఎస్‌ఐ.. అవసరాన్ని బట్టి ఇలా గుజరాత్‌లో ఫేక్ ఆఫీసర్లు పుట్టుకొస్తుంటారు. 2023 అక్టోబర్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30 మధ్య అమెరికాలోకి అక్రమంగా రావాలని ప్రయత్నించిన 90,415 ఇండియన్స్‌ని, అక్కడి బార్డర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసి, ఇండియాకు తిప్పిపంపారు. వీరిలో 50 శాతం మంది గుజరాతీలేనని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది. ఘుస్పేటియా (అక్రమచొరబాటులు) అనే పదం మోడి-అమిత్ షాలు ఎన్నికల ర్యాలీల్లో విరివిగా వాడుతుంటారు కదా, వీళ్లే ఆ ఘుస్పేటియాలు. ఇంత గొప్ప సమాచారం ఒకేచోట చేర్చింది మేం కాదు.. ఆ క్రెడిట్ ‘న్యూస్‌ల్యాండ్రీ’కి దక్కుతుంది.
Comments