
అహంభావి అయితేనేం ప్రతిభావంతుడైన నటుడు మంచు భక్తవత్సలం నాయుడు ఉరఫ్ మోహన్ బాబు! ఎవరి గొప్పతనాన్నీ అంగీకరించే తత్త్వం కాదు అతనిది. ఆ కారణంగానే అందరిలోకీ తానే గొప్ప నటుడినని అనుకుంటాడు.వైవిధ్యం చూపగలిగిన నటుడు అనటంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరంలేదు. ఆంగిక వాచికాభినయాలలో ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రంలోని విజయరామరాజు పాత్ర ‘న భూతో న భవిష్యతి’ అనేటంత బాగా రక్తి కట్టించాడు. పెదరాయుడు,అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి, యముడు పాత్రలు, సర్దార్ పాపారాయుడులో తెల్లదొర పాత్రలోనూ, ‘ శ్రీనివాస కళ్యాణం’ లో బొక్కా లంబోదరం పాత్ర లోనూ ఆయన గొప్పగా రాణించాడు. ప్రతి పాత్ర నూ పరీక్షగా భావించి కృషిచేసే స్వభావం అతనిది. అయినా తనకు తగిన గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉంటాడతను. ఈయన స్వాతిశయపు మాటలపై అక్కినేని కూడా పలుమార్లు సెటైర్లు విసిరారు. చిరంజీవి తనంత వైవిధ్యం ప్రదర్శించగల నటుడుకాదని అతని నిశ్చితాభిప్రాయం. అందుకే సినీ పరిశ్రమ డైమండ్ జుబిలీ ఫంక్షన్ లో ఎవరో చిరంజీవిని లెజెండ్ అంటే తట్టుకోలేక లెజెండ్ ఎవరు? సెలబ్రిటీ ఎవరు? అంటూ నానా యాగీ చేశాడు. తగినంత గుర్తింపు రాలేదని అతను ఆత్మాశ్రయ ధోరణిలో పడిపోయాడు. అన్న ఎన్టీఆర్ తనకొక్కడికే అన్న అన్నట్లు, రజనీకాంత్ తన శిష్యుడన్నట్లు అతను మాట్లాడటం కూడా చాలామందికి నచ్చదు. ప్రతిభావంతుడైన నటుడే అయినా ఇలా ఎచ్చులు మాట్లాడి అందరికీ కంటు అయ్యాడు. షూటింగ్ స్పాట్ లో నటీమణుల్ని కొట్టటం, తిట్టటం సాటి నటీ నటుల్ని అవమానపరచినట్లు మాట్లాడటం, ఫ్లైట్ లో ఏర్ హోస్టెస్ పై చేయి చేసుకోవటం వంటి పనులన్నీ అతని అహంకార స్వభావానికి తార్కాణాలు. రాజకీయంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం తరచు రంగులు మార్చటం ఈయన నైజం. చంద్రబాబు వంటి ప్రతిభావంతుడైన విజనరీ ప్రజాభిమానం పొందటం చూసి కూడా ఆయన తట్టుకోలేడు. అందుకే తరచు చంద్రబాబుకి పొగబెట్టే కార్యక్రమాలే చేసేందుకు ఇష్టపడతాడు. ఇంకా చెప్పాలంటే ఈయన మంచీ - చెడూ చాలా ఉంది. ‘ నా బిడ్డలను దీవించండి’ అంటూ ఏ మాత్రం ప్రతిభావంతులు కాని తన ముగ్గురు పిల్లల్నీ తెలుగు ప్రజల నెత్తిన రుద్దటం మాత్రం ఎంత కడుక్కున్నా పోయే తప్పిదం కాదు. అహంకారంలో ఆ ముగ్గురూ తండ్రికేమాత్రం తీసిపోరు. పరస్పరం కీచులాడుకుంటూ, తరచు వార్తలకెక్కుతున్న మంచు కుటుంబం ఎంత మాత్రం మంచి కుటుంబం కాదని అర్థం అవుతూనే ఉంది. చిత్ర నిర్మాత గా నటీనటులను అదుపులో ఉంచటానికి ప్రయోగించిన క్రమశిక్షణ దండం కుటుంబం విషయంలో ఏమైందని ఎవరికైనా అనిపిస్తుంది మరి. ఇదీ సంగతి.
మీ..రవీంద్రనాథ్.
Comentarios