
భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తుంది అంటూనే, ఆరెస్సెస్ ఛీప్ మోహన్ భగవత్ ‘హిందూ సమాజం ఐక్యంగా ఉండాలి’ అని ఉద్బోధ చేస్తున్నారు. కుల, మత, భాషా, సాంస్కృతిక పరంగా వైవిధ్యభరితమైన దేశం మనది. ఇంత భిన్నత్వంలో అందరిని ఐక్యంచేసే ఏకాత్మకతే ‘భారతీయత’! కానీ, మోహన్ భగవత్ వ్యాఖ్యలు నేడు ఆ ఐక్యతకే విఘాతం కల్గిస్తున్నాయి. ‘మతమనేది వ్యక్తిగతం. దాన్ని వీధుల్లోకి, విమర్శల్లోకి తీసుకురాకండి.’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో గట్టిగా నిర్దేశించినా వాటిని ఇలాంటి నేతలు పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ ఛీప్ నోట తరచూ ఇలాంటి మాటలే దొర్లుతున్నాయి. ‘గడప లోపలే మతం, కులం గడప దాటితే మనమంతా హిందువులం’ అని వల్లెవేస్తూనే.. ‘భిన్నత్వంలో ఏకత్వం ఉందని విశ్వసిస్తున్నాము’ అనడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. ఇలా చెప్పడమంటే కుల, మత విద్వేషాన్ని చిమ్మడమే. మత స్వేచ్ఛ కలిగిన దేశాన మత విద్వేషం రెచ్చగొట్టటం, దేవుళ్లను ముందు పెట్టి ప్రజలను విభజించటం సహించరాదని 75 ఏళ్ల స్వాతం త్య్రం తర్వాత కూడా మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి రావటం అత్యంత విషాదం. గత పదేళ్లుగా మతం పేరుతో జరుగుతున్న అనేక సంఘటనలు మానవత్వానికి, మన రాజ్యాంగ విలువలకి పెద్ద సవాలుగా నిలుస్తు న్నాయి. హత్యలు, లైంగికదాడులు, దాడులు, దహనాలూ, సాంస్కృతిక పరమైన వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న చర్యలూ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. విద్వేష పూరిత వాతావరణాన్ని కొందరు ఎందుకు సృష్టిస్తున్నా రంటే కొన్ని అంశాల్లో ప్రజల దృష్టిని మరల్చేందుకు అని అన్నది నూటికి నూరు శాతం యదార్థం. అసలు విషయమంతా అందులోనే ఉంది. సమాజంలోని మనమంతా ఒక్కటే. మనకు కావాల్సింది సమతా ధర్మం. ఎవరు ఏ మతాన్ని విశ్వసిస్తారు. ఏ దేవుడ్ని పూజిస్తారన్నది వ్యక్తిగతం. అది ఇంటి లోపలే వుండాలి. గడప దాటితే మనమంతా భారతీయులం. ఎవరి స్వేచ్ఛవారిది. కాదనే హక్కు ఎవరికీ లేదు. అసలైన దేశభక్తి మనషులను మనుషులుగా ప్రేమించడంలో ఉంది. ‘అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలె నోయి’ అని వందేళ్ల కిందటే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. ఒకవైపు ప్రజలు ఆకలి, దారిద్య్రం, అనారోగ్యం, ఉపాధి లేమితో ఇక్కట్లు పడుతుంటే, పెరుగుతున్న ధర లతో జీవనం కష్టసాధ్యమవుతుంటే, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారగణం, వారి దృష్టి మరల్చి భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రజలను విభజిస్తున్నారు. ద్వేషం అనేది దేవునిలో ఉండదు. అధికార దాహంలో ఉంటుంది. తోటి మనుషుల హృదయాలను గాయ పరిచేవాడు, వారిని హతమార్చే రాక్షస హృదయుడు దేవుని భక్తుడు ఎలా కాగలుగుతాడు! ఈ పరివారపు మదినిండా విద్వేషమే కాని ప్రేమకు, భక్తికి తావే వుండదు. అన్యాయాలు, అమానవీయతలు కొనసాగు తూనే ఉంటాయి. సామాన్య ప్రజలు సమిధలవుతూనే ఉంటారు. ఈ 21వ శతాబ్దంలో మతం పేరుతో ఎక్కడికి పోతున్నాం మనం? దేశం లౌకిక, సౌభ్రాతృత్వ దేశంగా ఉండాలని దేశ రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. దేశ సమగ్రతను కాపాడుకోవాలని, భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న దేశాన్ని ప్రజాస్వామ్య విలువ లతో నిలుపుకోవాలని, అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇలాంటి నేతల చెవికి ఎప్పుడు ఎక్కుతాయో ఏమో. నిజమైన భక్తి భావన గలవారిలో మూఢత్వాలు, విద్వేషాలు, మత దురహం కారాలు కనపడవు. ఇంకా అనేక సందర్భాల్లో మతాలకతీతంగా పరస్పర సహాయ సహకారాలు అందించు కున్న ఘటనలే చాలా ఉన్నాయి. కాబట్టి గుర్తించాల్సిన అంశమేమంటే.. విశ్వాసాలను, భక్తిని, మతాన్ని ఆసరా చేసుకుని కొందరు ఆధిపత్య రాజకీయ ప్రయోజనాల కోసం వైరుధ్యాలను సృష్టించి, విద్వేషాలకు పాల్పడేవారు పెరుగుతున్నారు. నేడు మనదేశంలో ఇది అత్యంత ప్రమాదస్థాయికి చేరుకున్నది. ఇది ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక తెటతెల్లం చేసింది. 2024లో దేశంలో 1,165 విద్వేష ప్రసంగాలు ఇచ్చా రని, 2023 కంటే 74 శాతం అధికమని ఈ నివేదిక పేర్కొన్నది. ముస్లింల తర్వాత క్రైస్తవులు లక్ష్యంగానే ఈ విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఇండియా హేట్ ల్యాబ్ వెల్లడిరచింది. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఘననీయం అని స్పష్టం చేసింది. వీటి ఫలితాలు అత్యంత అమానవీయంగా ఉంటున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతీయసామాజిక విలువలను ధ్వంసం చేయపూనుకుంటున్నాయి. వైయక్తిక విశ్వాసాలను, భక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సమాజంలో ఉన్న ఐక్యమత్యాన్ని, సహనాన్ని విచ్ఛిన్నం చేయచూస్తున్న వారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. విద్వేషాలను నిలదీయాలి, నిలువరించాలి.
Comments