యుద్ధం మనలో మొదలైంది
- DV RAMANA

- Apr 24
- 3 min read

యుద్ధం ఆగింది అనుకుంటున్నారా? కాదు.. అది ఇప్పుడు మనలో మొదలైంది. ఈ యుద్ధం బాంబులది కాదు.. మన ఆత్మల మీద జరుగుతున్న దాడి.! రెండుగా ముక్కలైన ప్రపంచం... మర్చిపోయిన మానవత్వం! లోకం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందని అనుకోవడం మన భ్రమ. బాంబుల మోత ఆగితే శాంతి వచ్చినట్టు కాదు. అది ఒక భయంకరమైన విరామం మాత్రమే. గాయంపైన చర్మం మొలిచింది.. కానీ లోపల చీము ఇంకా కారుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది సరిహద్దుల మీద జరిగే యుద్ధం కాదు. ఇది మన గుండెల్లో... మన ఆలోచనల్లో... మన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్లలో రగులుతున్న చిచ్చు. ఈ పోరాటంలో దేశాలు గెలవాలని చూస్తున్నాయి. సిద్ధాంతాలు జెండా ఎగరేయాలని చూస్తున్నాయి. అధికారం కోసం ఆకలితో ఉన్న శక్తులు ఒకరినొకరు మింగేయాలని చూస్తున్నాయి. కానీ ఈ గందరగోళంలో ఓడిపోతున్నది మాత్రం ఒకే ఒక్కడు. వాడే ఈ ప్రపంచానికి అక్కర్లేని సామాన్య మనిషి (కామన్ మేన్). వాడి ఆకలి... వాడి ఆవేదన... వాడి ప్రాణం ఎవరికీ పట్టడం లేదు. ఇరాన్ నుంచి మొదలుపెడదాం. మహ్సా అమిని. 22 ఏళ్ల వయసు. ఆ వయసులో కళ్ల నిండా కలలు ఉండాలి. మనసు నిండా ఆశలు ఉండాలి. కానీ ఆమెకి మిగిలింది చీకటి కొట్టు... ఆపైన మరణం. ఎందుకు? తల మీద ఆ గుడ్డ కొంచెం పక్కకు జరిగిందని. ఒక చిన్న వస్త్రం ఒక నిండు ప్రాణం కంటే విలువైనదైపోయిన చోట దేవుడు కూడా మౌనంగానే ఉండిపోతాడు. అక్కడ చట్టం ప్రాణాన్ని కాపాడటం మర్చిపోయింది. అధికారాన్ని కాపాడుకోవడమే ధర్మం అనుకుంది. మొరాలిటీ పోలీస్ పేరుతో మనుషుల ప్రాణాలను తోడేస్తున్నారు. ‘జాన్.. జిందగీ.. ఆజాదీ’.. మహిళలు.. జీవితం.. స్వేచ్ఛ. ఇవి అక్షరాలు కావు. అణిచివేయబడిన ఒక తరం తాలుకా ఆఖరి ఆక్రందన. తుపాకులు పట్టుకున్న వ్యవస్థ ముందు.. ఉత్తి చేతులతో నిలబడిన సామాన్యుల గుండె ధైర్యం ఇది. ప్రభుత్వం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని రోడ్ల మీద రక్తం పారిస్తోంది. సొంత బిడ్డలనే మింగేస్తున్న వ్యవస్థలని మనం ఏమని పిలవాలి? ఒక అమ్మాయి మరణం దేశం మొత్తాన్ని చితిలా మార్చేసింది. అక్కడ జరుగుతున్నది ఒక అంతర్గత యుద్ధం. అది మనుషుల మీద కాదు... మనిషి ఆత్మ మీద జరుగుతున్న దాడి. ప్రజలను బానిసలుగా మార్చి దేశం గొప్పదని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? జాతీయ సార్వభౌమత్వం అనేది మనుషుల ప్రాణాల కంటే ఎక్కువైపోయిందా? మరోవైపు చూస్తే అమెరికా. ప్రపంచానికి పెద్దన్న లాంటి సైనిక శక్తి. అక్కడ యుద్ధం అంటే ఒక ఆవేదన కాదు. అది ఒక అమ్ముడుపోయే వస్తువు. అదొక ఇండస్ట్రీ. ఆయుధాలు తయారవ్వాలి. అవి బాంబులై పేలాలి. అప్పుడే కొన్ని కంపెనీల గల్లాపెట్టెలు నిండుతాయి. అక్కడ నాయకులు మారుతుంటారు. ప్రసంగాలు మారుతుంటాయి. కానీ ఆ రక్తపు వాసన వచ్చే యుద్ధ దారి మాత్రం మారదు. అగ్రరాజ్యాల నాయకత్వ పోకడల వల్ల పరిస్థితులు ఇంకా భీభత్సంగా మారుతాయని జనం భయపడుతున్నారు. కెనడా మనదే అంటారు. గ్రీన్‌ల్యాండ్ కావాలంటారు. పనామా కాలువను లాగేసుకుంటాం అంటారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పచ్చి ఆధిపత్య ధోరణా? ఒక దేశం పక్క దేశం మీద కన్ను వేయడం.. తన అవసరాల కోసం వేరే దేశాల్లో అశాంతిని నింపడం.. ఇదంతా భద్రత పేరుతో జరుగుతున్న మరో వంచన. ఇక్కడ సిద్ధాంతాలు మాట్లాడుతారు. మానవ హక్కుల గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఆ తెర వెనుక ఉండేది మాత్రం కేవలం డాలర్ల లెక్కలే. శాంతి కంటే యుద్ధమే వాళ్లకి ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. అందుకే అక్కడ బాంబులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఎక్కడో ఒకచోట మంటలు రేగాలి. అప్పుడే వాళ్ల ఆయుధాలు అమ్ముడుపోతాయి. ప్రపంచం ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి వికటాట్టహాసం చేస్తోంది. ఒకవైపు అమెరికా చేసే యుద్ధ రాజకీయాన్ని సమర్థించే మేధావులు. మరోవైపు ఇరాన్ లాంటి చోట్ల జరిగే అరాచకాలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునే శక్తులు. చిత్రం ఏమిటంటే.. ఎవరి పక్షాన నిలబడినా మనిషి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇరాన్ ప్రజలకి స్వేచ్ఛ కావాలి. అది నిజమే. కానీ అది అమెరికా వేసే బాంబుల ద్వారా రావాలా? లేక వారి సొంత పోరాటం ద్వారా రావాలా? అమెరికాలో ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఓటు వేస్తారు. కానీ వారి పన్నుల డబ్బుతో వేరే దేశాల్లో పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతుంటే ఆ ప్రజాస్వామ్యానికి అర్థం ఉందా? స్వీడన్ లాంటి దేశాల్లో ఉండే స్వేచ్ఛ టెహ్రాన్ వీధుల్లో ఎందుకు లేదు? అక్కడ మనిషికి విలువ ఉంది. ఇక్కడ కేవలం కుర్చీకి విలువ ఉంది. మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం. ఒకరిని తిడతాం... ఒకరిని పొగుడుతాం. మనలో కూడా ఆ యుద్ధ భావం విషంలా పెరిగిపోయింది. ఎదుటివాడు మన ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటే వాడు శత్రువు అయిపోతున్నాడు. అంటే యుద్ధం బాంబులతోనే కాదు.. మన మాటలతో.. మన చూపులతో కూడా మొదలైపోయింది. విషయాలను అవి ఉన్నట్టుగా చూడటం ఇప్పుడు ఒక పెద్ద సాహసం. ఎందుకంటే ప్రతి నిజాన్ని ఒక రంగు పూసి మనకి అమ్ముతున్నారు. మనం ఒక వైపు నిలబడాలని ఈ లోకం ఒత్తిడి చేస్తోంది. కానీ నిజం ఎప్పుడూ ఆ రెండు వైపుల మధ్యలో ఎక్కడో ప్రాణాలు విడుస్తూ ఉంటుంది. సార్వభౌమత్వం పేరుతో ప్రజలను చంపే ప్రభుత్వాలు ఒకవైపు... శాంతి పేరుతో యుద్ధాన్ని ప్రేరేపించే దేశాలు మరోవైపు. ఈ రెంటి మధ్యలో సాధారణ పౌరుడు తన జీవితాన్ని వెతుక్కుంటున్నాడు. అధికార గర్వం అనేది ఒక జబ్బు. దేశ గౌరవం పేరుతో సామాన్యుడి గొంతు కోసే ఏ వ్యవస్థ అయినా మృత్యువుతో సమానం. అలాగే శాంతి కంటే యుద్ధం వల్ల లాభం వస్తుందని నమ్మే శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. జెండాలు... సరిహద్దులు... మతాలు... వీటికంటే మనిషి ప్రాణం ముఖ్యం అని గుర్తించలేని వాడు మనిషే కాదు. మనం ఎంచుకోవాల్సింది ఒక దేశాన్ని కాదు. ఒక మనిషిని. ఒక పసి ప్రాణాన్ని. మనిషిని మనిషిగా చూడలేని ఏ సిద్ధాంతం అయినా అది చెత్తబుట్టలోకి వెళ్లాల్సిందే. యుద్ధాలు మేఘాల్లాంటివి. అవి వచ్చి వెళ్తుంటాయి. కానీ ఆ తర్వాత మిగిలేది మాత్రం తడి ఆరని కన్నీళ్లు... శవాల వాసన మాత్రమే. గోడలు కట్టుకోవడం చాలా సులభం. కానీ మనసుల మధ్య వంతెనలు కట్టడం చాలా కష్టం. ఆయుధాలు మాట్లాడే చోట ఆత్మలు మూగబోతాయి. ఆ మౌనం ఎంతో కాలం కొనసాగకూడదు. ఈ ప్రపంచం ఒక వింతైన మలుపులో ఉంది. మనం గెలవాల్సింది దేశాల మీద కాదు. మనలోని ద్వేషం మీద. రేపటి పొద్దున ఒక 22 ఏళ్ల అమ్మాయి ఏ భయం లేకుండా వీధిలో నడవగలిగిన రోజు... ఒక దేశం ఇంకొక దేశాన్ని చూసి తుపాకీ ఎత్తని రోజు... అప్పుడు మాత్రమే మనం నిజమైన శాంతి గురించి మాట్లాడుకోవాలి. అప్పటివరకు మనం చేస్తున్నవన్నీ కేవలం శవాల మీద పేలాలు ఏరుకోవడమే. యుద్ధం ముగిసిందని అనుకోకండి. అది ఇంకా జరుగుతూనే ఉంది. ప్రతి ప్రసంగంలో... ప్రతి నిర్ణయంలో అది కనిపిస్తూనే ఉంది. మనం మేల్కోకపోతే ఈ యుద్ధ మేఘాలు మనల్ని కూడా మింగేస్తాయి.






Comments