top of page

యుద్ధం ముగిసింది.. ఉత్కంఠ మిగిలింది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 16
  • 3 min read

అగ్రరాజ్యాధినేత ట్రంప్ చేసిన శాంతి ప్రకటనతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఇక అంతా కుదురుకుంటుందని, అన్ని వ్యవస్థలూ మళ్లీ గాడిలో పడతాయని ఆశపడుతున్నది. అయితే అప్పుడే అయిపోలేదు.. ఇంకా మిగిలే ఉంది.. అన్నట్లు అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ అది చాలాసార్లు ఉల్లంఘనకు గురైనట్లే ఇప్పుడు ప్రకటించిన 60 రోజుల ట్రయల్ కాలంలో కూడా అదే జరిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. తాజా ఒప్పందంతో తమకు సంబంధం లేదని ఇరాన్‌పై అమెరికా దాడులకు కారణమైన ఇజ్రాయెల్ ప్రకటించడం, పూటకోమాట అన్నట్లున్న ట్రంప్ వ్యవహార సరళి చూస్తే.. వచ్చే అరవై రోజుల కాలంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు నాలుగు నెలల యుద్ధం చేసి ఇరాన్‌నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అమెరికా చివరికి ఏం సాధించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాంతి ఒప్పందంలో ప్రతిపాదించిన అంశాల్లో చాలావరకు ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తుండగా.. ఈ యుద్ధం కారణంగా వందల బిలియన్ డాలర్ల చేతిచమురు వదిలించుకోవడం, దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి నెట్టడం తప్ప అమెరికా సాధించిందేమీ లేదని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్‌కు అమెరికా అనేక రాయితీలు, పలు రంగాల్లో సహకారం అందించేందుకు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన ‘మెహర’ వార్తా సంస్థ ప్రకారం 14 అంశాల ముసాయిదా శాంతి ఒప్పందంలో యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి 300 బిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ. 25 లక్షల కోట్లు) భారీ ఆర్థిక ప్యాకేజీ అందిస్తాయి. అలాగే అమెరికా విధించిన ఫ్రీజింగ్ కారణంగా విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల నిధులను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ఇరాన్ ఇంధన విక్రయాలపై కొన్ని దశాబ్దాలుగా ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుంది. అంతర్జాతీయ సముద్ర రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ తిరిగి తెరవాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా రానున్న 30 రోజుల్లో ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగిస్తారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణ, నిధుల విడుదలపై తుది నిర్ణయాలకు సంబంధించి కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 60 రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనే తుది ఒప్పందం ఆధారపడి ఉంటుంది. యుద్ధం ఆపాలంటే.. గతంలో ఫ్రీజ్ చేసిన తమ దేశానికి చెందిన 24 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల అంశం తేల్చాలని ఇరాన్ పట్టుబట్టింది. ఆ మేరకు ఒప్పందానికి ముందే 12 బిలియన్ డాలర్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఇరాన్ మీడియా ప్రచారం చేస్తుంటే అమెరికా మాత్రం ‘ముందు మీరు ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేయండి.. ఆ తర్వాత నిధులు ఇస్తాం’ అని కండిషన్లు పెడుతున్నది. వంద రోజులకుపైగా సాగిన ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అన్నది పక్కన పెడితే చమురు కంపెనీలు మాత్రం కొన్ని నెలల పాటు పండగ చేసుకున్నాయి. సాధారణ ప్రజలు మాత్రం పెట్రోల్, గ్యాస్ ధరలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు కుదుటపడుతున్నాయనే వార్తలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. కొన్ని వారాలుగా రాకెట్‌లా ఎగిరిన అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఇప్పుడు మెల్లగా దిగివస్తున్నాయి. అయితే అసలు సినిమా ఇంకా పూర్తికాలేదు.. ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఎందుకంటే.. 107 రోజుల యుద్ధం కారణంగా ఏకంగా 112 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.10.60 లక్షల కోట్ల మేరకు నష్టపోయిందని బ్రౌన్ యÖనివర్సిటీకి చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాకర్ అంచనా వేసింది. అదే సమయంలో అమెరికా దేశస్తులపై ఇంధన ధరల పెరుగుదల వల్ల 58.6 డాలర్ల భారం పడింది. అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ అమెరికన్ కాంగ్రెస్‌కు సమర్పించిన వివరాల ప్రకారం యుద్ధం మొదటి ఆరురోజుల్లోనే 11.3 బిలియన్ డాలర్లు చేశారు. ఆ తర్వాత నుంచి రోజుకు సగటున ఒక బిలియన్ డాలర్లు చొప్పున ఖర్చయినట్లు పేర్కొంది. అదే సమయంలో యుద్ధకాలంలో ప్రతి అమెరికన్ కుటుంబంపై సగటున 447.52 డాలర్ల అదనపు భారం పడింది. అయితే దాడులకు ముందు సైనిక పరికరాలు, సిబ్బందిని సమకూర్చుకోవడానికి చేసిన ఖర్చులను ఈ లెక్కల్లో చేర్చలేదు. అందువల్ల ఆ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా తాజాగా ముసాయిదా ఒప్పందంలో ప్రతిపాదించిన ఆర్థిక ప్యాకేజీలకు అమెరికా అంగీకరిస్తే దాని ఖర్చుల భారం తడిసిమోపెడవుతుందన్న ఆందోళన ఆ దేశ ప్రజల్లో వ్యక్తమవుతోంది. దాంతో రానున్న 60 రోజుల్లో ఒప్పందం కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై జరిగే చర్చల్లో ఇదే కీలకం కానుంది. ఫ్రీజ్ చేసిన ఇరాన్‌కు చెందిన నిధులను ఎలా విడుదల చేయాలి. ఆంక్షలు ఎంతవరకు సడలించాలి? వంద రోజుల విధ్వంసం తర్వాత ఇరాన్ పునర్నిర్మాణానికి ఎంత అవసరమవుతుంది.. అందులో ఎంత మేరకు సహాయంగా అమెరికా చెల్లించాలి. ఎంతకాలం ఈ ప్యాకేజీ కొనసాగించాలి అన్న అంశాలపై చర్చలు సాగే తీరుపైనే ఒప్పందం పరిస్థితి ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏమాత్రం తేడాలు వచ్చినా ఒప్పందం పరిస్థితి అంతేసంగతులు. ఇక అన్ని షరతులకు అంగీకారం కుదిరి తుది ఒప్పందం అమల్లోకి వచ్చి.. యుద్ధం ముగిసినా అందులోని ఆర్థికాంశాలు, ఇతర ఒప్పందాలు అమలు జరిగే తీరుపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఇరుపక్షాల్లో ఎవరికి అసంతృప్తి కలిగినా మళ్లీ యుద్ధభేరి మోగవచ్చు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page