top of page

యూనస్‌ బంగ్లాదేశ్‌ను గాడిలో పెడతారా?

Writer: ADMINADMIN
  • బంగ్లాదేశ్‌ ఆపద్ధర్మ ప్రధానిగా యూనస్‌

  • బ్రహ్మరధం పట్టిన యువతరం

  • గాడితప్పిన బంగ్లాను దారిలో పెట్టగలడని నమ్ముతున్న సామాన్య జనం


దుప్పల రవికుమార్‌

దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల పట్ల తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతున్న బంగ్లాదేశ్‌ ప్రజలు తమ తాత్కాలిక ప్రభుత్వానికి సారధిగా డాక్టర్‌ మహమ్మద్‌ యూనస్‌ను ఎన్నుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఇందులో ప్రధాన పాత్ర సోనార్‌ బంగ్లా ప్రజా సంఘాలదే. యూనస్‌ రాజకీయ విశ్వాసాలు, అభిప్రాయాలు, ప్రజాసమూహంలో ఆయనకున్న పలుకుబడి అతనికి ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని సైన్యం ప్రకటించినప్పుడు మన పొరుగుదేశం పాకిస్తాన్‌ మాదిరి ఎన్నికలయ్యేంత వరకు సైన్యం బంగ్లాను పరిపాలిస్తుందని ప్రపంచ దేశాలు భావించాయి. అకస్మాత్తుగా యూనస్‌ పేరు తెర మీదకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత పదిహేనేళ్లుగా రాజకీయ నిరంకుశత్వంతో విసిగి వేసారిపోయిన బంగ్లాదేశ్‌ ప్రజలకు మహమ్మద్‌ యూనస్‌ రూపంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టనిపించింది. సమాజంలో మహిళలకు కొత్తగా రెక్కలు తొడిగి, కొత్త ద్వారాలు తెరిపించిన యూనస్‌ పట్ల ఆ దేశానికి గొప్ప ఆశలున్నాయి. ఈ విపత్కర సమయంలో ఆ దేశంలో అతని కంటే గొప్ప వ్యక్తిని కూడా ఆ పదవిలో మరొకరిని ఊహించలేం.

మహమ్మద్‌ యూనస్‌ ఆర్థిక శాస్త్రంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు అయినప్పటికీ, ఒక ప్రొఫెసరుగా ఎవరూ ఆయనను గుర్తించరు. ఆయన గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడిగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం. లక్షలాదిగా మహిళలను విజయవంతమైన వ్యాపారస్తులుగా తీర్చిదిద్దిన ఒక గొప్ప సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ప్రజాసంఘాల నాయకుడిగా సుపరిచితుడు. రాజకీయ పార్టీల పట్ల ప్రజలు తీవ్ర విముఖత చూపిస్తున్నపుడు సహజంగానే అక్కడ పౌరసంఘాల మాట చెల్లుబాటు అయిందని మనం భావించాలి. ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకుల మద్దతు ఎక్కువగా ఆయనకు ఉంది. అక్కడి విద్యార్థులు ఇప్పుడు యావత్‌ ప్రపంచానికి ఒక కొత్త పాఠం చెప్పడానికి సిద్ధమయ్యారు. అయితే షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వారు నిర్వహించిన ప్రజాపోరాటంలో విపరీతమైన హింస చెలరేగడం కొంత బాధాకరం. వారు రక్తపాతానికి పాల్పడకుండా, ఆస్తుల విధ్వంసానికి దిగకుండా అహింసాత్మకంగా ఈ ఉద్యమం చేసి ఉండొచ్చును. కాని, అశాంతితో రగిలిపోతున్న యువతరం తప్పుదారి పట్టిందనే చెప్పాలి. కాని అవసరం వచ్చినపుడు మాత్రం తమ సమయస్ఫూర్తి చూపించారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహించే అవకాశం ఇవ్వమని యూనస్‌ పేరును సూచించింది యువకులే. విద్యార్థి సంఘాలు సూచించిన యూనస్‌ పేరును వెంటనే ఇతర ప్రజా సంఘాల నాయకులు బలపరిచారు. హింస, ప్రతిహింసలలో భాగంగా ప్రభుత్వాలు, పోలీసులు, సైన్యం తమ ప్రజలపైనే కాల్పులు జరపడానికి ఒక దశలో నిరాకరించాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన హసీనా వెంటనే దేశం విడిచిపెట్టి పోవాలని నిర్ణయించుకున్నారు. ప్రజాభీష్టాన్ని అధికారులు తెలుసుకున్నారు గాని, రాజకీయ పార్టీలు గుర్తించలేకపోయాయి.

ముందునుంచీ యూనస్‌ది పోరు దారే!

కొన్నేళ్ల కిందట యూనస్‌ మూస పోకడల బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఎదురుతిరిగి ఉద్యమించారు. ఎంతో కష్టపడి పనిచేసే తన దేశపు ప్రజలు నిరంతరం పేదరికంలో మగ్గిపోవడం అతనికి నచ్చలేదు. వారికున్న అనేకానేక అప్పుల భారం వల్ల, ఎవరూ వారికి రుణం ఇచ్చేవారు కాదు. దీనివల్ల మరింత పేదరికం వారిని ఆవరించేది. దీనికి విరుగుడుగా తానే ఒక బ్యాంక్‌ స్థాపించాలనుకున్నాడు. తన గ్రామీణ బ్యాంకు స్థాపించక మునుపు, తాను కొంత సొమ్మును రుణంగా తీసుకుని గ్రామీణ ప్రాంత ప్రజలకు రుణాలిచ్చాడు. తర్వాత ఒక వ్యవసాయ బ్యాంకుతో కలిసి కొన్ని ప్రయోగాలు చేసాడు. ఈ క్రమంలో అతనికి ఒక విషయం స్పష్టమైంది. ప్రభుత్వాలు సూక్ష్మ రుణాలను బీద రైతులకు ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడవని ఆయన గ్రహించాడు. తాను స్వయంగా రుణాలిచ్చినా, వేరే వారితో ఒప్పందాలు కుదుర్చుకుని రుణాలు ఇప్పించినా ఏర్పడుతున్న పరిమితులను ఆయన గుర్తించాడు. విస్తృత పరిధిలో ప్రజలకు సూక్ష్మ రుణాలను అందించాలనే ఉద్దేశంతో, నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించుకుని గ్రామీణ బ్యాంకును స్థాపించాడు.

ప్రపంచమంతా ఎందుకూ కొరగారని నిర్లక్ష్యంగా చూసిన రైతాంగ మహిళలు ఈ గ్రామీణ బ్యాంకు రుణాల వల్ల, ఇంటిబయటకు కాలుపెట్టి, తమకు తోచిన వ్యాపారాలు చేసి, క్రమంగా రుణాలు తీర్చి, మరింత మెరుగైన రుణాలు తీసుకుని మరింతగా తమ వ్యాపారాలను విస్తరించగలిగారు. ఈ విధంగా సూక్ష్మ రుణాల విప్లవం తీసుకొచ్చిన గ్రామీణ బ్యాంక్‌ సేవలకుగాను దాని యజమాని మహమ్మద్‌ యూనస్‌కు 2006లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఈ తరహా సూక్ష్మరుణాల ప్రభావశీలత గురించి కొందరు చెడుగా వ్యాఖ్యానించినప్పటికీ, బంగ్లాదేశ్‌లో మహిళలను ఎంతగానో నాగరికం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సనాతన ముస్లిం మత పెద్దలు తమ ఇంటి ఆడపడుచులు ఇలా వ్యాపారాలంటూ వీధుల్లో తిరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ వాణిజ్య నమూనా మాత్రం అద్భుత విజయాలు సాధించింది. యూనస్‌ రూపొందించిన ఈ సామాజిక వ్యాపార సూత్రం మార్కెట్‌ శక్తులకు అనుకూలమని కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఎందుకంటే ఈయన వ్యాపారం ప్రారంభించాకనే, అమెరికా, ఇతర యూరప్‌ దేశాలు బంగ్లాదేశ్‌లోకి తమ ఉత్పత్తులను వెల్లువలా ప్రవేశపెట్టాయి. అయితే తమ దేశంలోకి అభివృద్ధి నిధుల కోసం అమెరికా వైపు చూడకుండా భారత్‌, చైనాలతో చాలా నైపుణ్యంతో సంబంధాలు నెరిపారు షేక్‌ హసీనా. ఇప్పుడు యూనస్‌ అమెరికా వైపు మరలా కొంత మొగ్గు చూపవచ్చని కొందరు సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.

పానకంలో పుడకలా ఈ సందులో దూరడానికి చైనా ప్రయత్నిస్తోంది. విద్యార్థులు కోపంతో బయటికి పొగబెట్టి పంపేసిన షేక్‌ హసీనాకు ఆశ్రయమిచ్చి ఆదుకుని భారత్‌ ఈ చదరంగంలో మొదటి పావును తప్పుగా కదిపింది. నిజానికి బంగ్లాదేశ్‌ చైనావైపు చూడడం పాశ్యాత్చ ప్రపంచానికి మింగుడుపడదు. అయినా భారత్‌ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. యూనస్‌ రాజకీయ మొగ్గు ఈ విషయంలో తాత్కాలిక ప్రభుత్వానికి మరింత ఆసరానిస్తుంది. అమెరికన్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, అప్పుడే ఏర్పడిన బంగ్లాదేశ్‌కు ఆయన తన యవ్వనంలో వచ్చారు. కొత్తగా ఏర్పడిన దేశాన్ని పునర్నిర్మిస్తున్న షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ పట్ల గొప్ప ఆరాధనతో ఆయన దేశానికి వచ్చారు. అయినప్పటికీ అవామీ లీగ్‌, బంగ్లాదేశ్‌ జాతీయ పార్టీలు రెండిరటికీ సమాన దూరంలో ఉండిపోయారు. కాని తర్వాత కాలంలో అవామీ లీగ్‌ పార్టీ హయాంలో షేక్‌ హసీనా అతన్ని రాజకీయంగా అష్టదిగ్బంధనం చేసిందనే చెప్పాలి. పన్నులు ఎగ్గొట్టాడని, అవినీతి ఆరోపణలతోనూ వెంటాడి వేధించింది.

అవామీలీగ్‌ అంతమైనట్టేనా?

అంతేకాదు, షేక్‌ హసీనా చేసిన ప్రజాస్వామ్యహననం తర్వాతి ఎన్నికల్లో కూడా నిరాటంకంగా సాగింది. దాదాపుగా 2014, 2018, 2024లలో జరిగిన ఎన్నికలలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలను కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా చేసింది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ప్రతిపక్షానికి దాదాపు చోటు లేకుండా చేసింది. ఈ విధమైన దారుణమైన నియంతృత్వం మూలంగానే తన పతనానికి తానే బీజాక్షరాలు రాసుకున్నట్టయింది. తన మరణశాసనాన్ని తానే లిఖించుకుంది. మొత్తంగా హసీనా ప్రభుత్వం అవినీతిమయం కావడంతో దానిని కాపాడేవారే లేకపోయారు. మొత్తంగా ఆ దేశంలో ప్రజాస్వామం మేడిపండు చందంగా తయారయ్యాక, 1971 స్వాతంత్య్ర పోరాట యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం ఒక బోలు ప్రమాణంగా మిగిలింది. దీనిమీద ప్రజలెవరికీ పెద్దగా విశ్వాసం కుదరకపోయింది. నిరుద్యోగం తాండవిస్తోన్న వేళ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తాననడం వాళ్లను వెక్కిరించినట్లయింది. దాంతో అన్ని రకాల రిజర్వేషన్లు పోవాలని విద్యార్థులు కోరుకునే స్థితికి చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం రంగంలోకి దిగింది. నిరసనలను నియంత్రించాలని చేసిన ప్రయత్నంలో సుమారు 500 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అసువులు బాసారు. కొన్ని వారాలపాటు బంగ్లాదేశ్‌ అట్టుడికిపోయినట్టు అతలాకుతలం అయిన తర్వాత షేక్‌ హసీనా దేశం విడిచిపెట్టి పారిపోయారు. ఆమె తండ్రి హత్యకు గురైనాక ఆ దేశంలో ఘన నివాళి అర్పించారు. కాని, దానికి పూర్తి వ్యతిరేకంగా హసీనాను అక్కడి ప్రజలే తరిమేశారు.

అవామీ లీగ్‌, బంగ్లాదేశ్‌ జాతీయ పార్టీలకు భిన్నంగా మూడో రాజకీయ పార్టీ అవతరించే అవకాశం ఆ దేశంలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు యూనస్‌కు కొంత రాజకీయ ఆసక్తి ఉండేది కాని, దాడి చేయడం ద్వారా షేక్‌ హసీనా అతడిని పూర్తిగా అణిచేసింది. ఇప్పుడు ఆయన ఆసక్తి మళ్లీ రూపుదాల్చవచ్చు. గడిచిన కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాల పట్ల భారత దేశంలో డెమోక్రాట్లు విభిన్నంగా స్పందించడాన్ని యూనస్‌ వ్యతిరేకించారు. బంగ్లాదేశ్‌ పట్ల ఎలాంటి అనుమానాలు పెట్టుకున్నా అది మన దేశానికి ఎలాంటి మేలు చేయదని హెచ్చరించారు. ఇంతవరకూ గడిచిన పదేళ్లలో మన ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో పరిణతి ప్రదర్శించిందే లేదు. ఇప్పుడు యూనస్‌ వ్యాఖ్యలకు ఎలా సమాధానమిస్తారో చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page