యూపీ స్కూళ్లలో తెలుగుకు మంగళం!
- SATYAM DAILY
- May 23
- 1 min read
టీచర్ పోస్టులు ఎత్తివేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
మాతృభాషకు అన్యాయం చేస్తున్నారన్న ఆందోళన
జీవోను రద్దు చేయించాలని భాషోపాధ్యాయ సంఘం డిమాండ్
కేంద్రమంత్రి రాముకు, ఎమ్మెల్యే శంకర్‌కు వినతిపత్రాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తెలుగు భాషకు ప్రాధాన్యమిస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులే లేకుండా చేస్తోందని తెలుగు భాషాభిమానులతో పాటు రాష్ట్ర తెలుగు భాషోపాధ్యాయ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ (రేషనలైజేషన్) జీవోలో పొందుపర్చిన నిబంధనలు ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు లేని పరిస్థితి కల్పిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2001లో విస్తృతంగా ప్రాథమికోన్నత పాఠశాలలు నెలకొల్పినప్పుడు రూపొందించిన స్టాఫ్ పాటర్న్ ప్రకారం నేటి వరకు కొనసాగించడం ద్వారా సబ్జెక్ట్ టీచర్లకు కొరత లేకుండా మెరుగైన విద్యా ప్రమాణాలు సాధించామన్న విషయాన్ని విస్మరించిన పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు టీచర్ పోస్టును ఎత్తివేయడం తెలుగు భాషకు అన్యాయం చేయడమే అవుతుంది. ఈ నిర్ణయం వల్ల ఆరు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు తెలుగు బోధన ఎవరు చేస్తారో? అసలు ఎవరి సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్దేశత సామర్ధ్యాలు లేకుండా ఏ ఉపాధ్యాయుడు ఏ తరగతి విద్యార్థులకు బోధించకూడదు. అయితే విద్యార్థుల సంఖ్య ఆధారంగా తెలుగు పోస్టును ఎత్తివేయడం విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా ఉంది. 75 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత విద్యార్థులు ఉన్న చోట ఉన్నత పాఠశాల మంజూరు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 141 దాటితేనే తెలుగు టీచర్ పోస్టు మంజూరు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో తెలుగు బోధన నిలిచిపోతే ఆ తర్వాత తొమ్మిది, పది తరగతుల్లో విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో వెనుకబడతారన్న విషయాన్ని ఎలా విస్మరించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్హేతుకంగా ఉన్న ఈ రేషనలైజేషన్ జీవోలోని ఇటువంటి అంశాలను తొలగించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు టీచర్ పోస్టులను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చొరవ తీసుకోవాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కూన రంగనాయకులు, గొడబ మేరీ ప్రసాద్, చింతపల్లి జనార్ధనరావు, మజ్జి వెంకటరమణ, అరసవల్లి గణపతిరావు, రాడ గణపతిరావు, వడిగి రమణమూర్తి, గోర అమర్‌నాథ్, వై.విశ్వనాథం, రాణ సంధ్యారాణి, దున్న విజయలక్ష్మి తదితరులు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Comments