సగం మందికి అందని ఎరువులు
పనికిరాని సరుకు కొంటేనే యూరియా ఇస్తామని మెలిక
ప్రైవేటు డీలర్ల వద్ద భారీ రేట్లు
కేవలం 26 పీఏసీఎస్‌లకే విక్రయానికి అనుమతులు
జిల్లాలో 61,104 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ ప్రణాళికను రూపొందించారు. వీటిలో ఇప్పటి వరకు 30,848 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. 2023తో పోల్చుకుంటే ఎరువుల సరఫరా తగ్గినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 2023లో జిల్లాకు రబీ, ఖరీఫ్‌లో 89,802 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చూపిస్తుంది. ఎరువుల కొరతకు విదేశాల నుంచి 65 శాతం యూరియా దిగుమతి చేసుకోవడమే కారణమని చెబుతున్నారు. వాటి దిగుమతి చేసి రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేయడంలో కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. దీంతోపాటు ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఒక కారణమని తెలుస్తుంది.
యూరియా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా కూడా టాప్ ర్యాంకింగ్‌లోనే ఉంది. ఇక్కడ 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా తయారవుతోంది. 2019 లెక్కల ప్రకారం గ్లోబల్ యూరియా మార్కెట్‌లో ఇది పెద్ద షేరే. ఇక్కడ కేవలం ఇఫ్కో పెద్ద సంఖ్యలో యూరియాను ఉత్పత్తి చేస్తుంది. అయినా కూడా ఇది మన అవసరాలకు సరిపోవడంలేదు. ఖతార్, తైమూర్ వంటి సౌదీ అరేబియన్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి గత కొన్నేళ్లుగా ఏర్పడిరది. రెండేళ్లుగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఎడతెగని యుద్ధం జరుగుతుండటంతో దిగుమతి చేసుకునే వెసులుబాటు తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారిపోవడంతో ప్రతీ ఏడాది ఇక్కడ ఎరువుల వాడకం పెరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా యూరియా కొరత మాత్రం తీరడంలేదు.
రైతు సేవా కేంద్రాల్లో బస్తా యూరియా రూ.270 కాగా, ప్రైవేట్‌లో రూ. 350కు, డీఏపీ రైతు సేవా కేంద్రాల్లో రూ.1350 కాగా ప్రైవేట్‌లో రూ.1500కు విక్రయిస్తున్నారు. డీఏపీ, యూరియా కొనుగోలు చేసే రైతులకు అవసరం ఉన్నా, లేకపోయినా ఆయా కంపెనీల ఉత్పత్తులు గుళికలు, జింక్, సల్ఫేట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఎరువుల సరఫరా, కంపెనీల అక్రమాలపై నియంత్రణ బాధ్యత కేంద్రానిది. కేంద్రం అధీనంలో నడిచే క్రిబ్‌కో, ఇఫ్కో సంస్థల ఉత్పత్తులను రాష్ట్రాలకు, అక్కడి నుంచి డీలర్లకు అంటకడుతోందన్న విమర్శలు ఉన్నాయి.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఖరీఫ్ సీజన్ మధ్యమ దశలో ఉంది. ఇప్పటికీ రైతులకు ఎరువులు అందుబాటులో లేవు. ప్రైవేట్ డీలర్లను ఆశ్రయించి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఎరువుల సరఫరాను ప్రాధాన్యతగా తీసుకున్నా పర్యవేక్షణ లేకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడిరదని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ సాగు సమాయత్తంలో భాగంగా బఫర్ స్టాక్ ఉందని ప్రకటించినా, అందులో వాస్తవం లేదని తేలిపోయింది. ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో వైకాపా సభ్యులు ఎరువుల కొరతపై ప్రశ్నించగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎరువులు అందుబాటులో లేవని గోడు వెల్లబుచ్చుకున్నారు. 62వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు అవసరం కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రైవేట్, రైతుసేవా కేంద్రాల ద్వారా 32వేల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేయగలిగారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసిన తర్వాత ఎరువులు సరఫరా, ఇండెంట్ బాధ్యతను సచివాలయం ద్వారా పర్యవేక్షించేవారు. డీసీఎంఎస్‌కు ఎరువుల పంపిణీ బాధ్యతను అప్పగించారు. కో`ఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో నడిచే పీఏసీఎస్ మహిళా సమాఖ్యలను ఎరువులు విక్రయించే బాధ్యత నుంచి తప్పించారు. ఈ`క్రాప్‌ను అనుసరించి జిల్లాలోని 495 రైతుభరోసా కేంద్రాల్లో రైతులు నగదు చెల్లించి ఎరువులు కొనుగోలు చేసేవారు. అప్పుడు కూడా డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండేదికాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత ఆర్‌బీకే పేరును రైతు సేవా కేంద్రంగా మార్పు చేశారు. ఎరువుల కొరత మాత్రం అలాగే ఉంది.
రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల అమ్మకాలను క్రమంగా తగ్గించి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)లో అమ్మేందుకు చర్యలు చేపట్టింది. వాస్తవానికి పీఏసీఎస్‌లు ఎప్పుడో మూలకు చేరిపోయాయి. ఉన్నవాటిలో సగం సొసైటీలు నష్టాల్లో ఉన్నాయి. చాలా సంఘాలకు లైసెన్స్‌లు లేవు. ఎరువులు అమ్మాలంటే లైసెన్స్‌లతో పాటు కనీస క్వాలిఫికేషన్ కావాలన్న నిబంధన ఉంది. సదరు అర్హత కోసం పీఏసీఎస్ సిబ్బందిని శిక్షణ కోసం ఇతర రాష్ట్రాలకు పంపించారు. పీఏసీఎస్‌లకు లైసెన్స్‌లు, శిక్షణలు ముగిసేసరికి మరింత సమయం పడుతుంది. దీని మీద కొత్త ప్రభుత్వం కసరత్తు చేయకముందే ఖరీఫ్ సీజన్ మధ్యలోకి వచ్చేసింది.
కేంద్రం నుంచి ఎరువుల సరఫరాపై అంతగా అప్రమత్తత లేదని సమాచారం. గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం అప్పట్లో ఎరువులు అందకపోవడంపై నిరసన తెలిపింది కానీ, సమస్య ఎక్కడ ఉందన్నదానిపై దృష్టి సారించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే ఎరువులు అందించాల్సిన పరిస్థితి రావడంతో గందరగోళంగా మారింది. ఆర్‌ఎస్‌కేలకు సరఫరా అయిన ఎరువులు ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవారికే అందుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలో మొత్తం పీఏసీఎస్‌ల్లో కేవలం 26కు మాత్రమే ఎరువుల విక్రయానికి అవకాశం ఉంది.
రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు దొరక్కపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ డీలర్లు బస్తాకు రూ.50 నుంచి రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 4లక్షల ఎరకాల్లో ఖరీఫ్ సాగవుతుంది. సాగుకు తగ్గట్టుగా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగుకు అవసరమైన ఎరువులు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా యూరియాకు ఎక్కువ డిమాండ్ ఉంది. అక్కడక్కడ డీఏపీకి కొరత ఉంది. ఎరువుల కొరత తలెత్తడానికి ఎరువుల అమ్మకాల విధానంలో కూటమి ప్రభుత్వం మార్పు చేయడం ఒక కారణమైతే, ఫెర్టిలైజర్ కంపెనీల లాభాపేక్ష అంతకుమించిన పెద్ద కారణంగా చెబుతున్నారు. సహకార, ప్రభుత్వ రంగంలో ఎరువుల ఉత్పత్తి సంస్థలు, ప్రైవేటు ప్రొడక్షన్ కంపెనీలు తమ లాభాల కోసం అన్నదాతకు అవసరమైన ఎరువు కావాలంటే తాము తయారుచేసే మిగిలిన ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని లింక్ పెడుతున్నాయి. వ్యవసాయంలో ఎక్కువ మోతాదులో యూరియా, ఆ తర్వాత డీఏపీని రైతులు వినియోగిస్తున్నారు. యూరియా కంపెనీలు నానో యూరియా, నానో డీఏపీ, సిటి కంపోస్టు, ఇతర బయోప్రొడక్ట్స్‌ను బలవంతంగా అంటగడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉత్పత్తులను లింక్ పెట్టకపోతే కేవలం యూరియా, డీఏపీ మనుగడ కష్టమని కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో రైతులపై భారం పడుతుంది.
Kommentarer