top of page

రక్తహీన భారత్‌

Writer: DV RAMANADV RAMANA

గర్భిణులు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడే మన భావి భారతం ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. కానీ మన దేశంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. దేశంలో 15 నుంచి 49 ఏండ్ల లోపు గర్భిణుల్లో సగానికన్నా ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఇవేవో ప్రైవేటు సంస్థ లు చెప్పిన లెక్కలు కాదు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇటీవల ప్రకటించిన పచ్చినిజాలు. అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం మన దేశంలో గర్భం ధరించిన మహిళల స్థితి ఇలా ఉంది. అంతేకాదు రాష్ట్రాల వారీగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతాన్ని కూడా ఈ నివేదిక బయటపెట్టింది. వీటిలో గుజరాత్‌, త్రిపుర వంటి రాష్ట్రాలే అగ్రభాగాన ఉండటం గమనార్హం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం నుంచి రక్తహీనత సమస్యను తరిమేస్తామంటూ 2018లో ‘రక్తహీనత ముక్త్‌భారత్‌’ (రక్తహీనత రహిత భారతం) అనే విధానాన్ని ఎంతో గొప్పగా ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా ఫలితాల్లో పెద్దగా తేడాలు కనిపించడం లేదని తాజా సర్వేలే చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే 5 ప్రకారం కూడా మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికల్లో, గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని తేలింది. నిజానికి రక్తహీనత ముక్త్‌భారత్‌ అన్న సంకల్పంతో మొత్తం ఆరు లక్ష్యాలతో నివారణ మార్గాలను కేంద్రం సూచించింది. ఆ మేరకు ఆహార విధానం, వైద్య చికిత్స, ఐరన్‌ లోపాన్ని నివారించడం, తీవ్రమైన రక్తహీనత ఉన్న గర్భిణులను గుర్తించి వారికి తగిన చికిత్స అందించడం, దీని కోసం మెడికల్‌ ఆఫీసర్లకు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం వంటి విధానాలను ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చింది. కానీ ఇవేవీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇక తెలంగాణలోనూ మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని అనేక లెక్కల సారాంశం. 15 నుంచి 45 ఏండ్లుగల మహిళలు మన రాష్ట్రంలో 57.6 శాతం ఉండగా, వీరిలో అత్యధిక శాతం పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. నిజానికి 2014-15తో పోల్చితే 2018-19లో సమస్య మరింత పెరిగింది. దీన్ని బట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉందో, బీజేపీ తీసుకొచ్చిన రక్తహీనత ముక్త్‌భారత్‌ ఏ మేరకు పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గర్భిణి దశలో పోషకాహారం తీసుకోక పోవడం వల్ల తల్లీబిడ్డలపై దుష్ప్రభావం చూపుతోందని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. నాడీ సంబంధిత సమస్యలు, తక్కువ బరువు, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, మృతశిశువు జన్మించడం వంటి సమస్యలకు గర్భిణులు ఎదుర్కొంటున్న రక్తహీనతే ప్రధాన కారణం. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులకు పౌష్టికాహార సరుకులు అందడం గగనంగా మారిపోయిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రభుత్వాలు ఏండ్లుగా ఎన్ని విధానాలు తీసుకొచ్చినా రక్తహీనతను నివారించలేకపోతున్నాయి. పైగా నేడు మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా గర్భిణుల ఆరోగ్యం మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. దేశంలోని పెద్ద రాష్ట్రాల కేట గిరిలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 71.7 శాతం మంది రక్తహీనత బాధితులు నమోదయ్యారు. ఈ దుస్థితికి పౌష్టికాహార లోపమే ప్రధాన కారణమనేది నిపుణుల మాట. అలాగే ప్రసవ సమయంలో అధిక రక్తస్రావమైనప్పుడు రక్తహీనత ప్రాణాంతకంగా కూడా మారుతోంది. బాలింత మరణాలకు దాదాపు 70శాతం ఇదే ప్రధాన కారణం. వీటికి తోడు విటమిన్‌ బి12, ఫోలేట్‌, ఎ విటమిన్‌ లోపాలు, వాయు కాలుష్యం కూడా తోడై సమస్యను మరింత జఠిలం చేస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. కనుక పాలకులు సమస్య పరిష్కారం కోసం ఈ వైపుగా కూడా తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పరిష్కరించడం సాధ్యంకాదు. ఆరోగ్య భారతం నిర్మితమవ్వా లంటే గర్భిణులకు పౌష్టికాహారం అందుబాటులో ఉండాలి. రక్తహీనతకు గురికాకుండా వారు ఆరోగ్యం గా ఉండేలా చూడాలి. ఇది ప్రభుత్వాల కనీస బాధ్యత. దేశంలో మహిళల ఆరోగ్యాన్ని, భావిభారతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా గర్భిణుల్లో రక్తహీనత సమస్యను పరిష్కరించాలి. అభివృద్ధిని ప్రజల అవసరాలు తీర్చడంలో, వారి జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా చూడాలి. తాజా నివేదిక లను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో తక్షణ చర్యలు చేపట్టాలి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page