రక్షణ ఎగుమతుల నుదుట ‘సింధూరం’
- DV RAMANA
- May 20
- 2 min read

భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన తాజా ఘర్షణలు.. తత్ఫలితంగా జరిగిన దాడులు, ప్రతిదాడుల ప్రభావం మిగతా అంశాలపై ఎలా ఉన్నా.. భారత్‌కు మాత్రం ఒకరకంగా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. గతంలో ఆయుధాల దిగుమతులపైనే ఆధారపడిన భారతదేశం కొన్నేళ్లుగా ఆ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రక్షణ పరికరాల పరిశోధన, తయారీలో అనూహ్యమైందని ప్రగతి సాధించింది. పాక్‌పై భారత్ జరిపిన తాజా దాడులే దీన్ని నిరూపిస్తున్నాయి. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌తోపాటు పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసి తొమ్మిది శిబిరాలను నాశనం చేస్తే.. దానికి ప్రతీకారంగా పాక్ సైన్యం భారత సరిహద్దుల్లోని పౌర ఆవాసాలు, సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి పాల్పడిరది. అయితే భారత్ తన ఆయుధ సంపత్తితో వాటిని గాల్లోనే నాశనం చేయడంతోపాటు పాక్ భూభాగంలోని 11 ఎయిర్ బేస్‌లు, పలు నగరాలపై దాడులు చేసి తీత్ర నష్టం కలగజేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ, చైనాల తయారీ డ్రోన్‌లు, క్షిపణులను భారత్ గాలిలోనే కూల్చివేయడం అంతర్జాతీయంగా భారత ఆయుధ శక్తిపై మొదటిసారి ఆసక్తి, ఆశ్చర్యం రేకెత్తించింది. భారత్ ప్రధానంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ 400 వ్యవస్థను ఉపయోగించినా.. దాంతోపాటు భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులను తొలిసారి ఆపరేషన్ సింధూర్‌లో ప్రయోగించడం, అవి అద్భుతంగా పనిచేయడం విశేషం. ప్రధానంగా అమెరికాతోనే పోటీ పడుతున్న చైనీస్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులను మన బ్రహ్మోస్, ఆకాశ్ వ్యవస్థలు తుత్తునీయలు చేయడం ప్రపంచ ఆయుధ వ్యాపార రంగాన్ని భారత ఆయుధాల వైపు చూసేలా చేసింది. మన రక్షణ ఉత్పత్తులకు అమాంతంగా డిమాండ్ పెంచేసింది. అత్యంత భారీగా ఖర్చు చేసి అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాల నుంచి ఆయుధాలు కొనే శక్తి లేని అనేక చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు భారత ఆయుధాల వైపు ఆశగా చూస్తు న్నాయి. తమ రక్షణ బడ్జెట్‌కు అందుబాటులోనే ఉన్న భారత ఆయుధాల కొనుగోలుకు ఆసక్తి చూపు తున్నాయి. ఫలితంగా మన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి దిగుమతి బడ్జెట్‌పై భారం తగ్గించే అవకాశం ఏర్పడిరది. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఏకంగా 17 దేశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ వీటి కోసం భారత్‌తో 375 మిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకుంది. ఇందులో మొదటి దశ ఆయుధాలను కూడా ఫిలిప్పిన్స్ అందు కుంది. దాంతోపాటు మలేషియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బల్గేరియా, మరికొన్ని మధ్యప్రాచ్య దేశాలు బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుకు ఆసక్తి చూపుతూ ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి. దీంతోపాటు భారత్ అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, యాంటీ డ్రోన్ వ్యవస్థ (డీ4), ఇటీవల జరిపిన పరీక్షల్లో అద్భుత ఫలితం చూపిన నాగాస్త్రం వంటి ఆధునాతన ఆయుధ సంపత్తి కూడా ప్రపంచ ఆయుధ మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి. వీటి కొనుగోలుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా మనదేశం మన అవసరాలకు సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటూనే.. ఇతర దేశాలకు అమ్మేందుకు వీలుగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఫలితంగా ఇటీవలి కాలంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు క్రమంగా పెరుగుతూ మన రక్షణ బడ్జెట్‌పై భారం తగ్గిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.23,622 కోట్లకు చేరి చరిత్ర సృష్టించాయి. 2023-24లో రూ.21,083 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా.. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో 12.04 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అదే ఒక దశాబ్దం వెనక్కి వెళితే.. 2013-14లో మన దేశ రక్షణ ఎగుమతులు రూ.686 కోట్లు మాత్రమే. ప్రస్తుతం భారత్ 80 కి పైగా దేశాలకు రక్షణ ఉత్ప త్తులను ఎగుమతి చేస్తోంది. 2029 నాటికి రూ.50 వేల కోట్లకు ఎగుమతులు పెంచడం ప్రభుత్వ లక్ష్యం. ఆపరేషన్ సిందూర్ భారత ఆయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసి ఆ లక్ష్యాన్ని చాలా ముందుగానే, అతి సులభంగా సాధించేందుకు మార్గం సుగమం చేసిందని నిపుణులు చెబుతున్నారు. సైనిక పరికరాలు, ఆయుధాలు, విడిభాగాలు, మందుగుండు సామగ్రి తదితర విభాగాల్లో భారత్ విజయవంతమైన ఎగుమతిదారుగా మారుతుండటం గర్వకారణమైన ముందడుగు.
Comments