`ఉద్యమించిన విద్యార్థులను రజాకార్లతో పోల్చిన హసీనా
`బంగ్లా స్వాతంత్య్ర పోరాటవాదులపై అప్పట్లో వారి అరాచకం
`రిజర్వేషన్ల ఉద్యమం ముసుగులో మళ్లీ తెరపైకి
`మరోవైపు లండన్ నుంచి పావులు కదిపిన ఖలీదా తనయుడు
`పాక్ ఐఎస్‌ఐ, చైనాల సహకారంతో కుట్ర అమలు

ఒకప్పుడు తూర్పు పాకిస్థాన్ పేరుతో పాకిస్థాన్ దేశంలో భాగంగా ఉన్న ప్రాంతానికి భారత్ సాయంతో పోరాటం సాగించి స్వేచ్ఛ ప్రసాదించడం ద్వారా స్వతంత్ర బంగ్లాదేశ్ పితామహుడిగా ఖ్యాతిగాంచిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె.. ఏకధాటిగా 15 ఏళ్లుగా, మొత్తంగా చూస్తే ఇరవై ఏళ్లపాటు అంటే అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డు షేక్ హసీనా సొంతం. ఆ రికార్డులు, పేరు ప్రఖ్యాతులన్నీ ఒక్క ఉద్యమంతో కొట్టుకుపోయాయి. అత్యంత అవమానకరమైన రీతిలో పదవిని వీడి.. కట్టుబట్టలతో దేశం నుంచి పారిపోయి పొరుగుదేశం భారత్‌లో ఆశ్రయం పొందాల్సిన దుర్గతి పట్టించాయి. మరోవైపు రిజర్వేషన్ల పేరుతో ప్రారంభమైన ఉద్యమం రాజకీయ రూపు దాల్చి మొత్తం దేశాన్ని దహించివేస్తోంది. హసీనా ప్రభుత్వం కూలిపోయి సైన్యం రంగప్రవేశం చేసినా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నా అల్లర్లు, హింస, విధ్వంసాలు ఏమాత్రం ఆగకపోగా అల్లరిమూకలు పేట్రేగి మైనారిటీలైన హిందువులపైనా, చివరికి సొంతవర్గమైన ముస్లిం లపైనా దాడులకు తెగబడుతున్నారు. ఈ విపత్కర పరిణామాలకు హసీనా రాజకీయ ప్రత్యర్థుల అధికార దాహం.. దానికి దన్నుగా నిలిచిన చైనా, పాకిస్తాన్‌లే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల వివాదంపై ప్రధాని హోదాలో షేక్ హసీనా చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా విద్యార్థి, యువజన వర్గాల్లో విద్వేషాగ్ని రగల్చి.. మొత్తం దేశాన్ని తగులబెట్టే స్థితికి తీసుకొచ్చాయి.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
‘యువత ముసుగులో సంఘవిద్రోహ శక్తులు ఉద్యమం పేరుతో దేశంలో అరాచకం సృష్టిస్తున్నాయి’
‘రిజర్వేషన్లను బంగ్లాదేశ్ విముక్తి పోరాట యోధుల వారసులకు కాకుండా రజాకార్ల మనవలకు ఇస్తామా’..
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న సమయంలో దేశ ప్రధాని హోదాలో షేక్ హసీనా చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్యమకారులను తీవ్రంగా రెచ్చగొట్టాయి. రిజర్వేషన్ ఉద్యమం తీవ్రమై హింసాత్మకంగా మారడానికి దారితీశాయి. ముఖ్యంగా ఉద్యమిస్తున్న విద్యార్థి, యువజనులు రజాకార్లన్నట్లు మాట్లాడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మనదేశంలో రజాకార్లు అంటే నిజాం పాలనలో జరిగిన అరాచకాలే గుర్తుకొస్తాయి. తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో 1948 ప్రాంతంలో నిజాం ప్రభుత్వానికి చెందిన కాశీం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు చేసిన దురాగతాలకు అంతే లేదు. మతోన్మాదంతో రెచ్చిపోయిన ఈ మూకలు హత్యలు, మానభంగాలు, దోపిడీలతో విశృంఖలంగా వ్యవహరించారు. ఈ రజాకార్లతో బంగ్లాదేశ్‌కు సంబంధం ఏమిటి? హసీనా ఎందుకు ఉద్యమకారులను ఆ పదంతో సంబోధించారు? అన్న సంశయం కలగవచ్చు. దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్‌లోనూ ఒక రజాకార్ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ వ్యవస్థ ఇస్లాంలోని తమ వర్గీయులపైనే దాడులు జరిపి నెత్తుటేరులు పారించింది. ఈ పరిణామాలతో రజాకార్ అంటే అరచకాలే గుర్తుకొస్తాయి. అయితే పర్షియన్, ఉర్దూ భాషల్లో రజాకార్ అంటే స్వచ్ఛంద సహాయకుడు అని అర్థం. కానీ ఆ అర్థాన్ని రజాకార్లు మార్చేసి రజాకార్ అంటే అరాచకవాదులని అనుకునేలా చేశారు.
బంగ్లా స్వాతంత్య్ర పోరాటానికి వ్యతిరేకంగా..
తమ భూభాగంలోని వనరులను తమకు కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించడమే కాకుండా తమను పాక్ పాలకులు అణిచివేస్తున్నారన్న ఆగ్రహంతో పాకిస్తాన్‌తో విడిపోవాలని తూర్పు పాకిస్తాన్ వాసులు బంగ్లాదేశ్ విముక్తి పోరాటం పేరుతో 1971లో ఉద్యమించారు. దీన్ని ఎదుర్కొనేందుకు నాటి పాక్ పాలకులు ప్రయోగించిన అస్త్రం పేరే రజాకార్. బంగ్లావాసులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే ఇందులో సభ్యులుగా చేరారు. పాక్ సైన్యం అండతో 1971 మేలో జమాతే ఇస్లామీ సీనియర్ సభ్యుడు మౌలానా అబుల్ కలాం మొహమ్మద్ యూసుఫ్ రజాకార్ల సమితిని ఏర్పాటు చేశారు. బంగ్లా ఉద్యమానికి మద్దతు ఇచ్చినవారిపై దాడులు, సామూహిక హత్యలు, అత్యాచారాలకు రజాకార్ సమితి సభ్యులు తెగబడ్డారు. ప్రజలను ఊచకోత కోశారు. లక్షలాది మహిళల మానప్రాణాలను దోచుకున్నారు. ఫలితంగా ఆధునిక బంగ్లాదేశ్‌లో రజాకార్ అనే పదాన్ని ఒక నీచమైన అర్థంలో వాడటం ప్రారంభించారు. దూషించడానికి, పరువు తీయడానికి కూడా దీన్నే పర్యాయపదంగా వాడుతుంటారు. రజాకార్ల ముసుగులో స్వాతర్రత్య ఉద్యమ సమయంలో యుద్ధనేరాలకు, అరాచకాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు 2010లో షేక్ హసీనా ప్రభుత్వం అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. దాంతో నాటి అకృత్యాలకు కారకుడైన మహమ్మద్ యూసఫ్ 2013లో అరెస్టయ్యాడు. అయితే గుండె పోటుతో జైలులోనే మరణించాడు. కాగా 1971 విముక్తి పోరాటాన్ని అణచివేసేందుకు పాక్ సైన్యంతో కలిసి పనిచేసిన 10,789 మంది రజాకార్ల జాబితాను 2019లో హసీనా సర్కారు విడుదల చేసింది. పలువురు ప్రముఖులతోపాటు నిషేధిత జమాత్-ఇ-ఇస్లామీ పార్టీకి చెందిన చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. వారంతా హసీనాపై పగ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న తరుణంలో విద్యార్థులు చేపట్టిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం దారి తప్పి వారి చేతిలో ఆయుధంగా మారిందని ప్రచారం జరుగుతోంది.
ఖలీదా కుమారుడి కుట్ర
రిజర్వేషన్ల ఉద్యమం భయానకంగా మారడం వెనుక నాటి రజాకార్లతోపాటు మరో వ్యక్తి కుట్ర కూడా ఉన్నట్లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. అతనే తారిక్ రహ్మాన్. అతను మరెవరో కాదు.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి యాక్టింగ్ ఛైర్మన్. ఒకప్పుడు పలు ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన రహ్మాన్ లండన్ నుంచే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అమలు చేశాడని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిరచాయి. బంగ్లా మాజీ అధ్యక్షుడు జనరల్ జియా ఉర్ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల కుమారుడైన ఈయన చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి తల్లిదండ్రుల పరపతితో కీలకపాత్ర పోషించారు. 2009లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2018లో ఢాకాలో జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో తారిక్‌కు జీవిత ఖైదు పడిరది. దాంతో దేశం నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. అతన్ని పరారీలో ఉన్న నేరస్తుడిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2018లో ఖలీదా జియాను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా తారిక్ రెహ్మాన్‌ను నియమించారు. అప్పటి నుంచి షేక్ హసీనాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాడు. కొన్ని నెలలుగా జరుగుతున్న రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మలచడంలో ఈయన పాత్ర ఉందంటున్నారు. లండన్‌లో ఉంటున్న ఈయన అక్కడి నుంచే పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ సాయం తీసుకుని బంగ్లాదేశ్‌లో ఉద్యమిస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు పురిగొల్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హసీనా ప్రభుత్వాన్ని పడదోసి తన తల్లి ఖలీదా జియాను గద్దె దించడమే లక్ష్యంగా ఈ కుట్రకు వ్యూహరచన చేశారని ఇంటెలిజెన్స్ సమాచారం. తారీఖ్ రెహ్మాన్ సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ ఉన్న ఐఎస్‌ఐ అధికారులను కలిసి ప్లాన్ చేశాడు. ఆ ప్రకారం సోషల్ మీడియాలో పాకిస్థాన్ నుంచి యాంటీ బాంగ్లాదేశ్ పోస్ట్‌లు పెట్టించి ఆ దేశ యువతను రెచ్చగొట్టారు. హసీనా ప్రభుత్వంపై మొత్తం 500 ట్వీట్లు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిరచాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తొలి నుంచీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. దాంతో ఖలీదా జియాకు, ఆమె కుమారుడికి ఏం కావాలన్నా పాకిస్తాన్ చేసిపెడుతోంది. ఈ అల్లర్లలో పాక్‌తోపాటు చైనా కూడా కీలక పాత్ర పోషించింది. జమాత్ ఇ ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఐసీఎస్ (ఇస్లామీ ఛాత్ర శిబిర్) హసీనా ప్రవేశపెట్టిన కోటా బిల్లుపై రేగిన ఆందోళనలను ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చింది. ఈ సంస్థకు పాకిస్థాన్ నుంచి చైనాకు చెందిన కొన్ని సంస్థలు ఫండిరగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అల్లర్ల నేపథ్యంలోనే బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ సహబుద్దిన్ హసీనా ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో పాటు జైలులో ఉన్న ఖలీదా జియాను విడుదల చేయించడం ఈ కుట్ర నిజమేనని చెబుతోంది.
Kommentare