అత్యవసరం పేరుతో నామినేషన్ దందా
టెండర్ ప్రక్రియ పూర్తికాకుండానే పనులు
అమరావతి పేరుతో తాడేపల్లిగూడెం కాంట్రాక్టర్ హల్‌చల్
అరకొరగా ఉన్న కార్పొరేషన్ ఆదాయం నుంచి చెల్లింపులు
ఇప్పటికే చెక్కు రూపంలో రూ.25 లక్షల చెల్లింపు

అత్యవసర పనులు అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి అత్యవసర సందర్భాలు కోకొల్లలు. అలాగే అత్యవసరంగా పనులు చేపట్టడమంటే వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు టెండర్ల ఖరారు వరకు వేచిచూడకుండా సహాయ, పునరావాస పనులు చేపట్టడం, అందుబాటులో ఉన్నవారికి ఒక్కో పని అప్పగించి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ కార్యక్రమాలు జరిపి వెంటనే బిల్లులు చెల్లించడం ఎక్కడైనా జరిగేదే. కానీ గోడలకు సున్నాలేయడం, రంగులద్దడం కూడా అత్యవసర పనేనట! టెండర్లు పిలవడం, ఖరారు చేయడం వంటి ప్రక్రియలతో సంబంధం లేకుండానే యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపడుతున్నారు. దీనికి ఆగస్టు 15 వేడుకలకు జిల్లా కేంద్రాన్ని ముస్తాబు చేయాలన్న సాకు చూపారు. పోనీ 15వ తేదీలోగా ఈ పని పూర్తికావాలేమో, అందుకే అర్జంటు వర్క్‌గా చూపించారనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే.. ఇప్పటికీ గోడ మీద బొమ్మలేసే కార్యక్రమం కొనసాగుతునే ఉంది. అదే సమయంలో ప్రభుత్వ పోర్టల్‌లో ఇందుకు సంబంధించిన ఈ`టెండర్ ఓపెన్ చేసే ఉంది. దీనికి గడువు తేదీ కూడా ఇంకా ఉంది. టెండర్ ప్రక్రియ పూర్తికాక ముందే ఈ పనులు జరుగుతున్నాయంటే ఒకటే గుర్తుకొస్తోంది. అదే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా... వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలనున్నా అన్ని రకాలు ఆకులో పడతాయనే విషయం. అమరావతి వర్గాలు అక్కడే ఒక కాంట్రాక్టర్‌ను సిద్ధం చేశాయి. ఆయనకే టెండర్లు, అగ్రిమెంట్లు లాంటి ప్రక్రియలు లేకుండా పనులు చేపట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నలుగురూ తిరిగేచోట నాలుగు గోడలు ముస్తాబవడం మంచిదే. అయితే అందుకు అనుసరించే పద్ధతి సముచితంగా ఉండాలి. అలా కాకుండా తాడేపల్లిగూడెం నుంచి ఒక కాంట్రాక్టర్‌ను పంపించి ఆయనతోనే ఈ పనులన్నీ చేయించుకోండంటూ తెర వెనుక నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఇక్కడ అధికారులు, నాయకులు అన్నింటినీ పక్కన పెట్టి ఉన్నఫళంగా సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎలా చెల్లించాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఈ పనులకు ఎటువంటి టెండరు వేయకుండా తాడేపల్లిగూడేనికి చెందిన సింగం త్రిమూర్తులు మిగిలిన కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్టు విమర్శలున్నాయి. అదే సమయంలో నగరంలోని గోడలకు ఆయన పెయింట్లు వేసుకుపోతున్నారు. ఏ ప్రక్రియా పూర్తికాక ముందే ఆర్ట్స్ కళాశాల రోడ్డులో రూ. 25 లక్షల పనులు చేసేశారు. ఇదేమని ప్రశ్నిస్తే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాల్సి వచ్చిందని మున్సిపల్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. అయితే నగరపాలక సంస్థ ఈ`టెండర్ పిలిచిన 10 పనుల్లో ఆర్ట్స్ కళాశాల లేకపోవడం వెనుక కారణాలేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులో గోడలకు పెయింటింగ్ వేయడంతో పాటు ఫుట్‌పాత్‌తోపాటు ప్రైవేట్ ఇళ్ల ప్రహరీలకు, పాన్‌షాపులకు రంగులు వేసి రూ.25 లక్షల బిల్లు పెట్టినట్టు తెలుస్తోంది. వీటిని అత్యవసర పనులుగా చూపించి నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి మంజూరు చేస్తున్నారు. ఈ బిల్లును సీఎఫ్‌ఎంస్ ద్వారా కాకుండా చెక్కు రూపంలో ఏకమొత్తానికి ఇచ్చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇందుకోసం బ్యాక్‌డేట్ వేసి చెక్కు ఇచ్చారని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు మించిన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించడానికి వీల్లేదు. దీంతో దీన్ని అత్యవసర పనిగా చూపించి త్రిమూర్తులుకు కట్టబెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
2023లోనే వేసినా..
నగరాన్ని సుందరీకరించడానికి ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానం అవలంభిస్తుంది. గోడలకు రంగులు పూయడం ఇదే మొదటిసారి కాదు. నగరంలో 2018కి ముందు పార్కులకు రంగులు వేసేవారు. 2018 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రస్థాయిలో ఇక్కడే చేయడం వల్ల సుందరీకరణ ప్రక్రియ నగరమంతా విస్తరించింది. దీనికి రూ.కోట్లలోనే ఖర్చు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత పాత పెయింటింగుల స్థానంలో కొత్తవి వేయాలని ఈ`ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. 2022 ఆగస్టులో కాకినాడకు చెందిన ఎన్టీఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు ఈ`టెండర్ ద్వారా రూ.1.43 కోట్లకు ఈ పనులు అప్పగించారు. 2023 మార్చి వరకు సుమారు ఎనిమిది నెలల పాటు నగరంలోని 23 ప్రాంతాల్లో రంగులు, చిత్రాలు వేశారు. ఇప్పుడు అవే పెయింటింగులను చెరిపేసి మళ్లీ వేస్తున్నారు.
నామినేషన్ పేరుతో పనులు.. చెల్లింపులు
ఈ`టెండర్ బిడ్డింగ్‌కు సెప్టెంబర్ తొమ్మిదో తేదీ వరకు సమయం ఉంది. కానీ టెండర్ ప్రక్రియ పూర్తికాకుండానే కాంట్రాక్టర్ త్రిమూర్తులు అమరావతి పేరు చెప్పి నగరంలో గుర్తించిన పది ప్రాంతాల్లో పనులు ప్రారంభించేశారు. అయినా నగరపాలక సంస్థ అధికారులు ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రిమ్స్ గేట్‌కు పశ్చిమ దిశ ప్రహరీగోడకు రంగులు వేయడానికి రూ.8,38,242, మిల్లు జంక్షన్ నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు ఫుట్‌పాత్ పెయింటింగ్‌కు రూ.8,32,208, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ గోడలకు పెయింటింగ్స్‌కు రూ.8,28,274, ఏడురోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిర్ వరకు వాల్ పెయింటింగ్స్‌కు రూ.8,26,740 ఖర్చు చేయాలని నిర్ణయించారు. సూర్యమహల్ నుంచి మిల్లు జంక్షన్ వరకు రూ.8,24,337, ఆర్ అండ్ బీ నుంచి పీఎస్‌ఎన్‌ఎంహెచ్ స్కూల్ వరకు రూ. 8,23,986, పీఎస్‌ఆర్ కూడలి నుంచి కలెక్టర్ బంగ్లా రోడ్డు వరకు రూ.8,21,016, నగరపాలక సంస్థ కార్యాలయం ప్రహరీ గోడ పెయింటింగ్స్‌కు రూ.7,77,600, ఆదివారంపేట వద్ద వద్ద పనులకు రూ.6,67,116, సూర్యమహల్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఫుట్‌పాత్ పెయింటింగ్‌కు రూ.5,86,824 వెచ్చిస్తున్నారు. వీటిలో రెండు ఫుట్‌పాత్‌లకు రంగు వేయడానికే రూ.14 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటికీ ఈ`టెండర్ ద్వారా బిడ్స్ ఆహ్వానించారు. టెండర్లు దాఖలు చేస్తుందుకు అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నా వారిని రానీయకుండా త్రిమూర్తులు అమరావతి పెద్దల ద్వారా భయపెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపణలున్నాయి. నగరంలో గోడలకు రంగులు వేయడానికి గత ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం కూడా రూ.1.15 కోట్లు వెచ్చిస్తున్నా.. ఈసారి రూ.25 లక్షల పనులను అత్యవసరం పేరుతో టెండర్లు పిలకుండా బిల్లులు చెల్లించేయడమే విడ్డూరం. నగరపాలక సంస్థకు వస్తున్న అరకొర ఆదాయం నుంచే రంగుల హంగుల కోసం అత్యవసరం పేరుతో రూ.80 లక్షలు ఖర్చు చేయడం బాధాకరం. ఇలాంటి వ్యవహారాలే ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారుల మెడకు చుట్టుకుంటుంటాయి.
Comments