
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పోసాని కృష్ణమురళీ అరెస్ట్ ఊహించిందే. తనుమటుగు తాను సినిమా డైలాగులు రాసుకొని అడపాదడపా సినిమాల్లో నటిస్తూ బతికితే ఇంత సమస్య ఉండేదికాదు. మధ్యలో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ రథచక్రాల కింద చిక్కుకొని విలవిలలాడుతున్నారు. రాజకీయాలు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శిస్తున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. విమర్శలు విధానాల మీద చేయాలి. వ్యక్తుల్ని టార్గెట్ చేయకూడదు. కృష్ణమురళీ చేసిన పొరపాటు అదే. పవన్‌కల్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పోసాని కృష్ణమురళీ మాట్లాడిన తీరు ముక్కున వేలేసుకునేట్టు చేసింది. ఆ తర్వాత కూడా భార్య, తల్లి.. ఇలా ఇంట్లో మహిళలెవర్నీ వదలకుండా ఆయనొక ఫ్లోలో చేసిన ఆరోపణలే ఇప్పుడు ఆయన పీకల మీదకు తెచ్చింది. చంద్రబాబును, పవన్‌కల్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించారు. జగన్ ప్రభంజనంలో ఇవన్నీ కొట్టుకుపోతాయనుకున్నారు. ఆయన చేసిన విమర్శల వెనుక దాగివున్న నిజానిజాలు ఇక్కడ ప్రస్తావించనవసరం లేదు. రాచరికపు అంతరంగిక రహస్యాలు తెలుసుకోవడం సామాన్యుడికి మంచిదికాదు. వాటిని బయటపెట్టడం రాజ్యంలో ఉన్నవారికి అసలు మంచిదికాదు. ఆ విధంగా పోసాని వైకుంఠపాలీలో పాము పడగకు చిక్కారు. బయటపడే నిచ్చెన కనుచూపు మేర కనిపించడంలేదు. 2029లో జగన్ అధికారంలోకి వస్తేనే వీరందరికీ కాస్త ఊపిరి పీల్చుకునే టైముంటుంది. గతంలో ఇలానే కొంతమంది సినీనటులు ఎక్కువచేసి బలైపోయారు. 2019లో బాగా హడావుడి చేసిన శివాజీ 2020 తర్వాత విషయం అర్థమై మౌనంగా ఉన్నారు. 2024లో ఆయన రాజకీయాలు మాట్లాడలేదు. శివాజీకి జ్ఞానోదయమైంది. పవన్‌కల్యాణ్ ప్రతీ సినిమాలో ఉన్న ఆలీ పవన్‌ను విమర్శించి అవకాశాలు కోల్పోయాడు. ఇప్పుడు ఏ పార్టీలో లేను అని ప్రకటించినా అందరివాడు కాస్తా ఎవరికీ చెందనివాడైపోయాడు. థర్టీయియర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ జగన్ దయ వల్ల మంచి పదవే చేపట్టాడు. తన బలహీనతతో సీటుకు ఎసరు తెచ్చుకొని జగన్‌కు ఎదురుతిరిగాడు. నోటిదురదతో ఈమధ్య ఓ సినిమా ఫ్లాప్‌కు పరోక్షంగా కారణమయ్యాడు. సినిమా రంగం డబ్బుతో, గ్లామర్‌తో ముడిపడిన ప్రపంచం. పెద్ద వ్యాపారం. కళ్లూ, కాళ్లూ నేలమీద ఉండాలి. ఏమాత్రం అదుపుతప్పినా భవిష్యత్తు గల్లంతవుతుంది. వర్తమానం టెన్షన్ పెడుతుంది. విధానాల మీద విమర్శలు చేస్తే తర్వాత వారిని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. చంద్రబాబును గతంలో విమర్శించినవారు కూడా ఈరోజు ఆయనతో ఉన్నారు. వారు విమర్శల్లో ఎక్కడా హద్దులు దాటలేదు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కుటుంబాలను విమర్శించిన కృష్ణమురళీ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. జరగబోయే ముప్పును పోసాని ముందుగానే గుర్తించారు. అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాసేపు చంద్రబాబును పొగిడారు కూడా. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రాజకీయం పులిమీద స్వారీ లాంటిది. ఎప్పుడూ స్వారీ చేస్తునే ఉండాలి. సడెన్‌గా దిగిపోయి నువ్వూ నేను ఫ్రెండ్స్ అంటే పులి అంగీకరించదు. అమాంతం మింగేసి అస్తిపంజరాన్ని బయటకు ఊసేస్తుంది. కృష్ణమురళీ మళ్లీ పులిమీద స్వారీ చేస్తారా? అస్త్రసన్యాసం చేస్తారా? అన్నది కాలమే చెప్పాలి. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలే ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వీరి జోలికి వెళ్లరని అంతా భావించారు. కానీ లోకేష్ రెడ్‌బుక్‌లో కులాలు లేనట్టే ఉన్నాయి. వల్లభనేని వంశీని ఇప్పటికే లోపలేశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళీని ఆ పక్కనే చేర్చారు. భవిష్యత్తులో కొడాలి నాని. ఆ తర్వాత శ్రీరెడ్డి, రామ్‌గోపాల్ వర్మ. ఇలా ఏ ఒక్క అవకాశాన్ని అధికార పార్టీ వదులుకోదు. మంచిదే. ఇప్పటికైనా విమర్శల్లో కొంతైనా సంస్కారాన్ని ఆశించొచ్చు. కాకపోతే ఆ పని టీడీపీ నేతలు చేసినా ఇలాగే వ్యవహరిస్తే కొన్నాళ్లకు హుందా రాజకీయాలు మాట్లాడే నాయకులు మాత్రమే మైకుముందుకొస్తారు.
Comments