top of page

రాజకీయ స్వార్థమే ఎన్నికల ఇం‘ధనం’!

Writer: DV RAMANADV RAMANA
  • `డబ్బుతో మరకలు తుడిచేసుకునే కుయుక్తులు

  • `అవసరాన్ని బట్టి మారిపోతున్న రాజకీయ ప్రాథమ్యాలు

  • `ఐదేళ్లూ ఏం చేయకపోయినా డబ్బుతో నెగ్గవచ్చన్న ధీమా

  • `అధికారం కోసం ప్రశ్నించే అర్హత పోగొట్టుకుంటున్న పార్టీలు

ఎన్నికల రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి

`పసుపు`కుంకుమ అంటూ ఎన్నికల ముందు మహిళలకు రూ.10వేలు ఇవ్వగానే.. కాల్‌మనీ వంటి దారుణాన్ని, ప్రభుత్వ ఉద్యోగి వనజాక్షి మీద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేసిన దాడిని మర్చిపోయి మహిళలందరూ తెలుగుదేశానికే ఓటేస్తారనుకున్నారు. కానీ ఏమైంది? కేవలం సొమ్ము ఖాతాలో వేసినంత మాత్రాన లబ్ధిదారులందరూ ఓట్లేస్తారనుకోవడం పొరపాటే.

` ఈసారి అధికారంలోకి రాగానే వలంటీర్లకు నెలకు రూ.10వేలు ఇస్తామనగానే.. మగాళ్లు ఇంటిలో లేనప్పుడు వలంటీర్లు వెళ్లి తలుపులు తడతారు, వలంటీర్లది మూటలు మోసే ఉద్యోగం, వలంటీర్ల వల్లే అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోంది అంటూ తమపై నాలుగున్నరేళ్లుగా చేసిన నిందారోపణలను వలంటీర్లు మర్చిపోతారనుకున్నట్టున్నారు. ఏమవుతుందో చూద్దాం.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

` సరిగ్గా 15 ఏళ్ల క్రితం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ పార్టీ వ్యవహారాలన్నీ చూసుకున్న పరకాల ప్రభాకర్‌ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదే పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రజారాజ్యం ఒక విషవృక్షం అంటూ ఆరోపణలు చేశారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ పెట్టిన జనసేన పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు పోతిన మహేష్‌ పార్టీకి రాజీనామా చేశారు. మొదట్నుంచి కష్టపడిన నాయకులకు పార్టీలోని కొందరు వ్యక్తులు చేస్తున్న అన్యాయాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇద్దరూ పార్టీల వ్యవహార శైలి, టిక్కెట్ల కేటాయింపులో నాయకత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల నిరసన తెలిపారు. కానీ ఆ రోజు పరకాల రాజీనామాను, ఆయన చేసిన ఆరోపణలను పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చేసిన ఒక మీడియా ఈరోజు మహేష్‌ రాజీనామా వార్తకు, ఆయన చేసిన ఆరోపణలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కారణం.. 2009లో చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కనుక! అలా కాకుండా వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఎలా అయినా ముఖ్యమంత్రి కాకుండా చేసి చంద్రబాబునాయుడ్ని సీఎం చేయడానికి జతకట్టిన నాలుగు పార్టీల మహాకూటమిలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని చేర్చి ఉంటే.. కనీసం ఎన్నికల తర్వాత చంద్రబాబుకు మద్దతు ఇస్తానని ప్రకటించి ఉన్నా పరకాల రాజీనామాకు అంత ప్రచారం ఉండేదికాదు. కానీ చిరంజీవి మహాకూటమిలో చేరడానికి మొగ్గు చూపకుండా 294 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా అనుభవం ఉన్న నాయకుల్ని ఢీకొట్టేందుకు సిద్ధమవడంతో పరకాల రాజీనామా సరైనదే అనే భావనను ప్రజలకు కలిగేలా మీడియా వార్తలు వండివార్చింది. కానీ ఇప్పుడు జనసేనకు చెందిన ఒక సీనియర్‌ నాయకుడు పార్టీకి రాజీనామా చేసి ఆరు నెలల్లో జనసేనను టీడీపీలో విలీనం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసినా, ఆ వార్తను మాత్రం ఎక్కడో లోపలి పేజీకి పరిమితం చేసింది. ఎందుకంటే.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆ వర్గం మీడియా లక్ష్యసాధనకు జనసేన పార్టీ త్యాగాల మీద త్యాగాలు చేస్తూ సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది కాబట్టి.

డబ్బు కంటే ఓటే శక్తివంతమని చెప్పాలి

దేశంలోనే డబ్బు రాజకీయం జరిగేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే. మరీ ముఖ్యంగా ఆంధ్రాలోనే. మనకన్నా ఆర్థికంగా, జనాభా పరంగా ముందున్న ఏ రాష్ట్రంలోనూ రాజకీయం డబ్బుమయం కాలేదు. గతంలో కాంగ్రెస్‌ పాలనలో కానీ, తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో కానీ డబ్బుకన్నా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడది ఆంధ్రాలో పూర్తిగా పోయింది. నువ్వు పార్టీకి ఎంత చేశావు? సమాజానికి ఎంత చేశావు? అనేవి అనవసరం. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలవనేదే అవసరం. రాష్ట్రంలో ఏ సామాన్యుడికైనా రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం ఉందా? అలా లేనప్పుడు ఒక్క శాతం డబ్బున్నవారికి మిగతా జనాభా అంతా కేవలం డబ్బుకు అమ్ముడుపోయే ఓటర్లుగా కాక మనుషులుగా ఎందుకు కనపడతారు. ఇక కులాలను చూసి పార్టీలను సమర్థించేవారిని చూస్తే జాలేస్తుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో ఓటువేసే వర్గాలు అలానే మిగిలిపోయాయి. దీన్ని మార్చే శక్తి ఓటుకే ఉంది. ఈ రాష్ట్రంలో 40 శాతం మంది యువత కోరుకుంటే ఈ మార్పును తేగలదు. మమ్మల్ని కొనడం ఆపి, ఇప్పుడున్న వ్యవస్థలో అవకాశాలివ్వండని ప్రశ్నించాలి. రాజ్యం ధనవంతుల భోజ్యం కాదు. ఓటును డబ్బుతో కొనాలనుకున్న పార్టీలకు కళ్లు తెరిపించాలి.

ప్రశ్నించే అవకాశం కోల్పోయిన తెలుగు పార్టీలు

నిరుద్యోగ సమస్య, నిధుల విడుదలలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. ఈ రెండు అంశాలు జనంలోకి బాగా వెళ్లినా వీటికి బీజేపీ వద్ద సమాధానాలు లేవు. ఈ ఎన్నికల్లో మోదీ పార్టీని నిలదీసే అవకాశాన్ని తెలుగు రాష్ట్రాలు పోగొట్టుకున్నాయి. రాష్ట్రంలో పాలకపక్షమైన వైకాపాకు బీజేపీతో పొత్తు లేకపోయినా వర్కింగ్‌ రిలేషన్స్‌ బాగుండటం వల్ల ఆ పార్టీ ఎప్పటికీ బీజేపీని ప్రశ్నించలేదు. ఇక ఎన్డీయేలో చేరిపోవడం వల్ల బీజేపీ విధానాలపై నోరు మూసుకోవడం తప్ప తెలుగుదేశం, జనసేన పార్టీలకు గత్యంతరం లేదు. రాష్ట్రాల నుంచి వసూలయ్యే పన్నుల్లో నిబంధనల ప్రకారం 48 శాతం రాష్ట్రాలకే తిరిగి రావాల్సి ఉంది. ఆ ప్రకారం నిధులిస్తున్నారా? తక్కువ పన్ను కట్టే ఉత్తరాది రాష్ట్రాలకు మనం కడుతున్న సొమ్ము కట్టబెట్టడం లేదా? అని కేసీఆర్‌ నిలదీశారు. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ స్కాముల్లో కూరుకుపోవడం వల్ల ఆ పార్టీ నోరు పడిపోయింది. దేశవ్యాప్తంగా పలు ఏజెన్సీలు నిర్వహిస్తున్న సర్వేలు మోడీ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోవడం వల్ల అత్యధిక ప్రజల ఆదాయాలు పడిపోతూ ఉండటం వల్ల ధనిక, పేదల మధ్య అగాథం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బయటపెడుతున్నాయి. అందుకే దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రభుత్వాలు విజయవంతంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మొదటిసారిగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అమలుచేస్తోంది. అందుకే ఆ రాష్ట్రాల్లో గెలుస్తోంది. దక్షిణాదిన అటువంటి పథకాలు కొత్తవి కాకపోవడం వల్ల ఇక్కడ బీజేపీ ప్రభావం చూపలేకపోతోందని జర్నలిస్టు, రచయిత, సీ ఓటర్‌ డైరెక్టర్‌ సుతాను గురు చెప్పుకురావడం విశేషం.

ప్రతిపక్షం అనైక్యతే.. బీజేపీ బలం

మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామనో, 2047 నాటికి వికసిత భారత్‌గా మలుస్తామనో బీజేపీ ప్రకటించడం సాధారణ ప్రజల దైనందిన జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. కాకపోతే ఇటువంటి అంశాలకు మోదీ ఎమోషన్లు (భావోద్వేగాలు) అద్ది ప్రజలను రంగుల కలల్లోకి నెట్టేస్తున్నారు. మోదీ పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నాలు చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా ప్రతికూల అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే పట్టుకుని వేలాడుతూ బీజేపీ మాత్రమే తమను గెలిపిస్తుందనే భ్రమలో ఉన్నారు. కాంగ్రెస్‌ తమకు ఏ రాష్ట్రంలోనూ ప్రత్యామ్నాయం కాదనే కోణంలోనే బీజేపీ ప్రాంతీయ రాజకీయాలు చేస్తుంది. స్థానిక పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎదగాలని ప్రయత్నిస్తున్నా అది ఫలించడంలేదు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ బలమైన పక్షంగా ఎదిగినా కాంగ్రెస్‌, సీపీఎంలను మట్టి కరిపించగలిగింది కానీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ను మాత్రం దెబ్బకొట్టలేకపోయింది. అందుకే తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కన్నా ప్రాంతీయంగా బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ జేడీఎస్‌ల ఉనికిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బలం పెంచుకున్నా సీట్లు గెలుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. ప్రతిపక్షాలు ఉమ్మడిగా వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేయకపోవడంతో బీజేపీకి ఎదురులేకుండా ఉంది. బీజేపీకి ఎదురెళితే కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందన్న భయం అవినీతిపరులైన రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది. జగన్‌తో ఉన్న వర్కింగ్‌ రిలేషన్స్‌తో చంద్రబాబును జైలుకు పంపి, బెదిరించి పొత్తు కుదిరేలా చేసుకున్న మోదీ, అమిత్‌ షాలు ఇక్కడ ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికే అడుగు పెట్టారని చెప్పుకోవాలి. తనను బీజేపీ పెద్దల అండతోనే జైలులో పెట్టారన్న విషయం చంద్రబాబుకు తెలిసినా ఎలక్షన్లు జరిపించడానికి వారి మద్దతు అవసరమని భావించి పొత్తు కుదుర్చుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి గతం కంటే తక్కువ సీట్లే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. కానీ మోడీ, ఈడీ, సీబీఐ వంటివి మాత్రం వారితోనే ఉండాయి కాబట్టి మెజారిటీ తగ్గినా బీజేపీదే రాజ్యాధికారం.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page