మొబైల్ స్పేర్స్‌లో గుత్తాధిపత్యం
రిపేర్ షాపులు తామే పెడతామంటూ వార్నింగ్‌లు
అసోసియేషన్ నిబంధనలు పాటించమంటూ హూంకరింపులు
హోల్‌సేలర్లు, మెకానిక్‌లకు మధ్య యుద్ధం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈస్టిండియా కంపెనీ పేరుతో భారతదేశంలో అడుగుపెట్టి, ఆ తర్వాత మనలో మనకు చిచ్చుపెట్టి విభజించు ` పాలించు పేరుతో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటీషర్ల కోసం మనం చదువుకున్నాం. ఇప్పుడు మన జిల్లాలో కూడా వ్యాపారం పేరుతో వచ్చిన రాజస్థానీలు ప్రధానమైన వ్యాపారాల్లో పాగా వేయడమే కాకుండా స్థానికంగా ఉన్న చిరువ్యాపారుల మధ్య విభజించు`విక్రయించు పేరుతో దందా చేస్తున్నారు. గత రెండు నెలలుగా మొబైల్ ఫోన్ స్పేర్స్ హోల్‌సేల్‌గా విక్రయించే రాజస్థానీ వ్యాపారులకు, స్థానికంగా ఉన్న మొబైల్ టెక్నీషియన్లకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. చివరకు ఒకరిని మరొకరు బాయ్‌కట్ చేసుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ముంబయి నుంచి విజయవాడ మీదుగా మొబైల్ యాక్సరీస్, స్పేర్స్ తీసుకువచ్చే రాజస్థానీ వ్యాపారులు కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడ వ్యాపారం ప్రారంభించారు. ముంబయిలో కూడా ఈ రాష్ట్రానికే చెందిన తయారీదారులు, సూపర్ హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉండటంతో వీరికి విరివిగా క్రెడిట్ దొరికేది. దీంతో రాజస్థాన్ నుంచి శ్రీకాకుళానికి మకాం మార్చి గత కొన్నేళ్లు ఏకచత్రాధిపత్యంగా వ్యాపారం చేస్తున్నారు. వీరి దగ్గర్నుంచి జిల్లాలో 1000 మంది మొబైల్ మెకానిక్ షాపుల వారు స్పేర్లు కొనుగోలు చేస్తూవస్తున్నారు. జిల్లా మొబైల్ మెకానిక్ యూనియన్ నిబంధనల ప్రకారం కేవలం గుర్తింపు కార్డులు ఉన్న షాపుల యాజమాన్యాలకు మాత్రమే హోల్‌సేల్ వ్యాపారులుగా వ్యవహరిస్తున్నవారు స్పేర్లు, యాక్సెసరీస్ విక్రయించాలని, రిటైల్‌గా వర్తకం చేసుకునేవారు రిటైల్ ధరకు వాటిని అమ్మాలని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. అయితే కొద్ది నెలల క్రితం దీనిని రాజస్థాన్ హోల్‌సేల్ వ్యాపారులు మీరారు. జిల్లాలో 1000 మంది గుర్తింపు ఉన్న మొబైల్ మెకానిక్ షాపులకు మాత్రమే కాకుండా నేరుగా హోల్‌సేల్ షాప్ కస్టమర్ వెళ్లినా కూడా ఒకటీ అరా సామాన్లు మొబైల్ షాపులకు విక్రయించిన ధరకే ఇచ్చేస్తున్నారు. దీంతో గత కొన్నాళ్లుగా వేలాది రూపాయల సరుకును ఈ రాజస్థానీ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి, అవి అమ్ముడుపోక ఇప్పుడు మొబైల్ మెకానిక్ అసోసియేషన్ రోడ్డెక్కింది. తమ వద్ద రూ.100కు అమ్మే స్క్రీన్‌గార్డ్‌తో పాటు అనేక మొబైల్ పార్ట్‌లను రాజస్థానీ వర్తకులు రిటైల్‌గా కూడా అమ్మడం వల్ల తమ వ్యాపారాలు పూర్తిగా కుదేలైపోయాయని, కొన్ని యాక్సెసరీస్ మోడల్స్ ఔట్‌డేటెడ్ కావడం వల్ల వాటిని చెత్తలో పడేయాల్సి వస్తోందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నోసార్లు హోల్‌సేల్ వర్తకులకు నిబంధనలు మీరారని అపరాధ రుసుము కూడా మొబైల్ మెకానిక్‌ల యూనియన్ విధించింది. దీంతో జిల్లాలో ఉన్న ఏడు రాజస్థానీ మొబైల్ హోల్‌సేలర్లు ఏకంగా జిల్లాలోని 1000 మంది మొబైల్ మెకానిక్‌లను కరివేపాకులా తీసిపారేశారు. తాము దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు ఫండిరగ్ ఇస్తున్నామని, తమతో పెట్టుకుంటే వ్యాపారాలు చేయలేరంటూ ఏకంగా రిటైల్ షాపుల పక్కనే మొబైల్ రిపేర్ సెంటర్లను కూడా తెరవడానికి సిద్ధపడిపోయింది. నగరంలో ఉన్న ఏడుగురు హోల్‌సేలర్లు జిల్లా మొత్తం మొబైల్ రిపేర్ సెంటర్లను తెరిచి తమ వద్ద ఉన్న సరుకును మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం రాజాంకు చెందిన ఒక వర్తకుడి వద్ద జిల్లా మొత్తం మొబైల్ మెకానిక్‌లు స్పేర్లు, యాక్సెసరీస్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాజస్థానీలు ఇస్తున్న రేటుకు, రాజాంలో ప్రస్తుతం సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్న రేటుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఇన్నాళ్లూ రాజస్థానీ హోల్‌సేలర్లు తమను అడ్డంగా దోచుకున్నారని గ్రహించిన మొబైల్ మెకానిక్‌లు ముంబయిలో అమ్మిన రేటు మీద రూ.20 లేదా రూ.30 అదనంగా వేసి తమకు విక్రయించే విధంగా రాజాం వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో స్థానిక రాజస్థానీలు జిల్లాలో మెకానిక్‌లకు ఎటువంటి సహకారం అందించకూడదని నిర్ణయించుకున్నారు. మొబైల్‌లు విప్లవం మొలకెత్తిన రోజుల్లో ఈ స్పేర్లు, యాక్సెసరీస్‌ను ఉత్తరభారతదేశానికి చెందిన కొందరు ముస్లింలు దక్షిణ భారతదేశంలో చేపట్టేవారు. ఎప్పుడైతే ఈ రంగంలోకి రాజస్థానీలు వచ్చారో, అప్పుడు వీటి ధరలు తగ్గిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఇవి మరింత చవగ్గా దొరుకుతున్నా ఇంకా పాత రేట్లకే విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మార్వాడీలు, గుజరాతీలు అంటే పానీపూరీ బండి, పావుబాజీ బండి మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ జిల్లాలో చడీచప్పుడు లేకుండా అనేక వ్యాపారాల్లో వీరు గుత్తాధిపత్యం సాధించారు. బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్‌లో ఇప్పుడు వీరిదే అగ్రభాగం. మొబైల్ యాక్సెసరీస్‌లో వీరి తర్వాతే ఎవరైనా. టూవీలర్ స్పేర్స్‌లో వీరే ముందున్నారు. ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్‌లో కూడా జిల్లా వ్యాపారులను వీరు ఎప్పుడో తొక్కుకుంటూపోయారు. మూడేళ్ల క్రితం జిల్లాలో మొబైల్ స్పేర్లు అమ్మడానికి వచ్చిన ఒక వ్యాపారి ఈ అతి తక్కువ కాలంలోనే స్థానిక రామకృష్ణ థియేటర్ సందులో మూడు కోట్ల విలువైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికే మొబైల్ మెకానిక్ యూనియన్ అనేకమార్లు సమావేశమైంది. కానీ ఇందులో రాజస్థానీ వ్యాపారులు మాత్రం పాల్గోలేదు. హోల్‌సేల్ ధరలను కేవలం షాపులకే ఇవ్వాలని, మిగిలిన వారికి రిటైల్‌గా అమ్మాలన్న ప్రతిపాదనను వారసలు అంగీకరించడంలేదు. ఇప్పుడు సెల్ రిపేర్‌షాప్ కూడా వీరే పెట్టేస్తే జిల్లాలో అనేకులు ఉపాధి కోల్పోతారని, వేలకు వేలు అద్దెలు చెల్లిస్తున్న స్థానికులు రోడ్డున పడిపోతారని చెబుతున్నా రాజస్థానీలు మాత్రం తమ దారికి రాకపోతే వ్యాపారాలు చేయనీయమని ప్రతిజ్ఞ పూడినట్లు చెబుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం శిక్షణ, రుణాలు కూడా ఇస్తోంది. ఇప్పుడు వీరంతా పనులు లేకుండాపోతామన్న ఆందోళనతో ఒకవైపు యూనియన్‌తో ఉంటూనే, మరోవైపు రాజస్థానీలు చెప్పినదానికి ఊకొడుతున్నారట.
Comments