అప్పటి ఆర్.ఎం. చెప్పినట్లే ఆడిన పోలీసులు
గార ఎస్‌బీఐలో మరో క్యాష్ ఆఫీసర్ సస్పెండ్
ఏడాదిగా గోప్యంగా ఉంచిన అధికారులు
పది రోజుల క్రితం సస్పెన్షన్ ఎత్తేసిన వైనం
పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కనబడని పేరు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అందరికీ ఒకటేనని చెబుతున్నా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రం ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందని ఈమధ్య కాలం వరకు ఇక్కడ రీజనల్ మేనేజర్‌గా పని చేసిన టీఆర్‌ఎం రాజు నిరూపించారు. బ్యాంకు విధివిధానాలు, వడ్డీరేట్లు వంటి వ్యవహారాల్లో వేర్వేరు బ్యాంకులకు వేర్వేరు నిబంధనలు, వేర్వేరు సూత్రాలు ఉండొచ్చు. కానీ అదే బ్యాంకు ఉద్యోగులు నేరం చేస్తే అనుసరించాల్సిన పద్ధతి మాత్రం రాజ్యాంగంలో పేర్కొన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మేరకే జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ రీజనల్ మేనేజర్‌గా పని చేసిన రాజుకు తన బ్యాంకులో పైస్థాయిలో ఎవరి అండదండలున్నాయో తెలియదు గానీ, జిల్లాలో మాత్రం అప్పటి పోలీసు అధికారులను తప్పుదోవ పట్టించి ఒక్క ముక్కలో చెప్పాలంటే తానే ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి ఎవరి మీద చర్యలు తీసుకోవాలో, ఎవరిని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పంపాలో, ఏ పత్రికలో ఏ కథనం వండివార్చాలో, ఎవర్ని జైలుకు పంపాలో అన్నీ టీఆర్‌ఎం రాజే చేశారనడానికి మరో తాజా సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది.
గార ఎస్‌బీఐ బ్రాంచిలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగలు మాయమయ్యాయని, దీనిని అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసిన స్వప్నప్రియే తస్కరించిందంటూ అప్పుడు ఆర్‌ఎంగా పని చేసిన టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు గార ఎస్‌ఐగా ఉన్న కామేశ్వరరావు గాని, ఇంత పెద్ద వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించాల్సిన డీఎస్పీ గాని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సీఐ గాని ఇందులో జోక్యం చేసుకోకుండా నేరుగా పోలీస్ బాసే రంగంలోకి దిగి టీఆర్‌ఎం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటికే చనిపోయిన స్వప్నప్రియను మొదటి ముద్దాయిగా, ఆమె సోదరుడ్ని రెండో ముద్దాయిగా, నగలను ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టడానికి సహకరించిన తిరుమలరావును మరో ముద్దాయిగా చూపించి అప్పటికే పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌లో సహకరిస్తున్న స్వప్నప్రియ సోదరుడ్ని రిమాండ్‌కు పంపేశారు. తాజాగా ఇదే కేసులో లోకనాధం అనే క్యాషియర్‌ను ఏడాది క్రితం సస్పెండ్ చేసినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గార బ్రాంచిలో నగలు మాయమయ్యాయని, అందుకు స్వప్నప్రియే కారణమని ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎం రాజు మరి గార క్యాషియర్ లోకనాధంను ఎందుకు సస్పెండ్ చేశారు? ఏడాదిగా సస్పెన్షన్‌లో ఉన్న లోకనాధంపై పది రోజుల క్రితం సస్పెన్షన్‌ను ఎత్తివేసి స్థానిక రీజనల్ మేనేజర్ కార్యాలయంలో కూర్చోబెట్టారు. టీఆర్‌ఎం రాజు అప్పట్లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా లోకనాధం పేరు లేదు. కానీ గార బ్రాంచిలో ఘటన జరిగిన పది రోజుల తర్వాత ఆయన్ను సస్పెండ్ చేస్తూ బ్యాంకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో ఎక్కడా లోకనాధం పేరు అటు పోలీసుల విచారణలో గాని, ఇటు బ్యాంకు అధికారుల ఎంక్వైరీలో గాని లేకపోవడం కొసమెరుపు. గార బ్యాంకులో ఉండాల్సిన తాకట్టు నగలు మాయమైన కేసులో లోకనాధంను సస్పెండ్ చేస్తున్నామంటూ పేర్కొన్న బ్యాంకు అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లోకనాధం పేరు ఎందుకు చేర్చలేదన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గార ఎస్‌బీఐ కుంభకోణంలో లోకనాధం పాత్ర లేదు అని భావించే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని భావిస్తే ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేసినట్లు? ఏడాది పాటు ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు విధులకు దూరం పెట్టినట్టు? లేదూ లోకనాధం పాత్ర కూడా ఉందీ అంటే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అప్పటి ఆర్‌ఎం రాజు ఈ పేరు ఎందుకు ఇవ్వలేదు. దీనికి టీఆర్‌ఎం రాజు సమాధానం చెప్పినా ఫర్వాలేదు, లేదూ ఎస్‌బీఐ ఏజీఎం సమాధానమిచ్చినా ఫర్వాలేదు. ఎందుకంటే.. టీఆర్‌ఎం రాజు హయాంలో గార బ్రాంచిలో తాకట్టు నగల మాయంతో పాటు నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణం, శ్రీకాకుళం మెయిన్ బ్రాంచిలో కూడా అటువంటి లీలలే వెలుగుచూసినా కూడా రాజు మీద శాఖాపరమైన చర్యలకు ఇంతవరకు ఎస్‌బీఐ ముందుకు రాలేదు.
గార బ్రాంచిలో బంగారు నగలు మాయమైన తర్వాత అందుకు అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న స్వప్నప్రియే కారణమని టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ బ్యాంకు లాకర్ ఓపెన్ చేయాలంటే ఇద్దరు క్యాష్ ఆఫీసర్ల వద్ద తాళం ఉంటుందని, కేవలం స్వప్నప్రియ వద్ద ఉన్న తాళంతో తెరిస్తే లాకర్ ఓపెన్ కాదని, మరో క్యాష్ ఆఫీసర్‌గా ఉన్న సురేష్ ప్రమేయం కూడా ఇందులో ఉంటుందనే అనుమానం ‘సత్యం’ తన కథనం ద్వారా వ్యక్తం చేసిన తర్వాత సురేష్ తనపై దాడి జరిగిందనే నాటకాన్ని రెండు రోజులు రక్తికట్టించి, ఆ తర్వాత అట్నుంచి అటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం కోసం విజయవాడ పరారయ్యారు. దీంతో గత్యంతరం లేక సురేష్ అంటుబాటులో లేకపోవడంతో పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో సురేష్ పేరును చేర్చారు. కానీ టీఆర్‌ఎం రాజు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఎక్కడా సురేష్ ప్రస్తావన అప్పట్లో లేదు. ఇప్పుడు కూడా సురేష్ లేదా స్వప్నప్రియ సెలవు పెట్టిన రోజుల్లో లోకనాధం అనే క్యాషియర్ క్యాష్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. గార బ్యాంకు లాకర్‌లో ఉండాల్సిన నగలు మాయమైనప్పుడు లోకనాధం కూడా క్యాష్ ఆఫీసర్‌గా ఉన్నారని, అలా 73 సందర్భాల్లో ఆయన క్యాష్ ఆఫీసర్‌గా వ్యవహరించారని, అదే సమయంలో ఓ రోజు మూడు బంగారు బ్యాగులు మిస్సయ్యాయని బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన 10 రోజుల్లోనే లోకనాధంను సస్పెండ్ చేశారు. పది రోజుల క్రితమే ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. ఇంత జరిగినా ఎక్కడా ఈ విషయాన్ని స్టేట్‌బ్యాంకు అధికారులు ఇప్పటికీ పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వప్నప్రియ కేసును పునర్విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వప్నప్రియ తల్లి ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో స్వయంగా చంద్రబాబునాయుడే ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలని జిల్లా పోలీసులకు ఆదేశించారు. ఈమేరకు గత నాలుగు నెలలుగా ఇందుకు సంబంధించిన పూర్వపరాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే అప్పటి ఆర్‌ఎం రాజును, ఆడిటర్లను, లీగల్ ఆఫీసర్లను కూడా పోలీసులు విచారించారు. కానీ ఎక్కడా ఇదే కేసులో లోకనాధంను సస్పెండ్ చేసినట్లు గాని, ఆయన కొద్ది రోజులు క్యాష్ ఆఫీసర్‌గా వ్యవహరించారని గాని చెప్పకపోవడం చూస్తే ఎస్‌బీఐకి ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా ఉందా అన్న అనుమానం కలగకమానదు. ఇంతవరకు స్వప్నప్రియే బంగారాన్ని మాయం చేసిందని చెప్పుకొచ్చిన ఎస్‌బీఐ ఆర్‌ఎం రాజు ఆ తర్వాత సురేష్‌తో పాటు మరికొందరి పేర్లు చేర్చాల్సిన అగత్యం ఏర్పడిరది. ఇప్పుడు లోకనాధం అనే కొత్త కేరక్టర్ ఎంటరవడంతో కథ మరో మలుపు తీసుకుంది.
Comments