top of page

‘రాజు’గారు బ్యాంకును ‘బజారు’కీడ్చేశారు!

Writer: ADMINADMIN
  • బినామీ కంపెనీలకు రుణాలు, గృహరుణాలకు కమీషన్‌

  • `గార బ్రాంచ్‌లో తాకట్టు నగల మళ్లింపులోనూ ఆయనదే పాత్ర

  • `కిందిస్థాయి అధికారులను బలి చేసి తాను తప్పించుకునే ఎత్తుగడలు

  • `‘సత్యం’ కథనంతో టీఆర్‌ఎం రాజుపై వేటు.. రాత్రికి రాత్రి బదిలీ


దేశంలోనే ప్రధాన బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శ్రీకాకుళం రీజియన్‌ పరిధిలో జరుగుతున్న కుంభకోణాల ఉచ్చు బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌(ఆర్‌ఎం) టీఆర్‌ఎం రాజు చుట్టూ బిగుసుకుంటోంది. ఈ బ్యాంకుకు చెందిన పలు శాఖల్లో బయటపడిన అక్రమ రుణాల మంజూరు, తాకట్టు నగల మళ్లింపు వ్యవహారాల్లో ఆయనే సూత్రధారి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కిందిస్థాయి సిబ్బందిపైకి నెట్టేసి అతను మాత్రం తప్పించుకుంటున్నారని తెలిసింది. తాజాగా నరసన్నపేట బజారు బ్రాంచి పరిధిలో జరిగిన రూ. మూడు కోట్ల కుంభకోణాన్ని ‘సత్యం’ పత్రిక వెలుగులోకి తేవడంతో ఉన్న ఫళంగా ఆర్‌ఎం రాజుపై బదిలీ వేటు వేశారు. పరపతి పోతుందన్న భయంతో వివరాలు బయటకు వెల్లడిరచకుండా అంతర్గత విచారణ జరుపుతున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శ్రీకాకుళం రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజుపై బదిలీ వేటు పడిరది. ఆయనకు ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చినదీ ప్రస్తుతానికి తెలియడంలేదు. ఆయన స్థానంలో కొత్త రీజనల్‌ మేనేజర్‌గా బొబ్బిలి నుంచి అబ్దుల్‌ హసీబ్‌ వచ్చి బుధవారం ఉన్న ఫళంగా బాధ్యతలు స్వీకరించారు. రీజనల్‌ మేనేజర్‌గా టీఆర్‌ఎం రాజు పని చేసిన కాలంలో ఎస్‌బీఐ బ్రాంచిల్లో అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా రానివి చాలా ఉన్నాయి. వీటి గురించి ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి తెలిసినా బ్యాంకు రెప్యుటేషన్‌ (పరపతి) దెబ్బతింటుందన్న భయంతో వీటిని బయటపెట్టకుండా అంతర్గత విచారణ అని చెబుతూ లోలోన లొసుగులను సర్దుబాటు చేసేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గార ఎస్‌బీఐలో తాకట్టు బెంగారం మాయమైన కేసులో ఆ బ్రాంచి అసిస్టెంట్‌ మేనేజర్‌ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోగా.. పలువురు ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు అరెస్టయ్యారు. దీనంతటికి కారణం రీజనల్‌ మేనేజర్‌ రాజేనన్న ఆరోపణలు అప్పుడే వచ్చాయి. అయితే బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతోనూ సంబంధాలు నెరిపిన టీఆర్‌ఎం రాజు ఎన్ని కుంభకోణాలకు పాల్పడినా కింది స్థాయి ఉద్యోగులను బలి తీసుకొని ఆయన మాత్రం తప్పించుకునేవారు. కానీ నరసన్నపేట బజారు బ్రాంచ్‌లో జరిగిన రూ.3 కోట్ల రుణాల కుంభకోణం గురించి మంగళవారం ‘సత్యం’ ఫ్లాష్‌ చేయడంతో బ్యాంకు వర్గాల్లో పెద్ద కుదుపు మొదలైంది. ‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత బుధవారం ఉదయాన్నే మిగిలిన పత్రికలవారు బ్యాంకు వద్దకు వెళ్లి విచారిస్తే అంతర్గత ఆడిట్‌ జరుగుతోందని చెప్పి తప్పించుకున్నారు.

సూట్‌కేస్‌ కంపెనీలకు రుణాలు

వాస్తవానికి ఈ బ్రాంచ్‌లో రూ.3 కోట్లకు పైగా సొమ్ము రుణాల పేరుతో మాయమై చాలా రోజులైంది. అయితే ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు ఎప్పటిలాగే కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఆ సొమ్ము కట్టించి తెలివిగా తప్పించుకోవాలని చూశారు. అయితే ఈ కుంభకోణంలో ఆయనే అసలు సూత్రధారిగా పేర్కొంటూ ‘సత్యం’ కథనం ప్రచురించడంతో ఉన్నతాధికారులు రాత్రికి రాత్రి ఆయన్ను తప్పించి ఆ స్థానంలో అబ్దుల్‌ హసీబ్‌ను నియమించారు. వాస్తవానికి రాజును సస్పెండ్‌ చేయాలి. ఎందుకంటే.. ఒక్క గార బ్రాంచ్‌ లేదంటే నరసన్నపేట బ్రాంచ్‌లో మాత్రమే ఇటువంటి కుంభకోణాలు జరగలేదు. తవ్వితే ఇటువంటివి మరిన్ని వెలుగులోకి వస్తాయి. ‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత అసలు నరసన్నపేట బజారు రోడ్డు బ్రాంచి నుంచి ఏయే రకాల రుణాలు మంజూరయ్యాయి.. వాటిలో ఎన్ని సవ్యమైనవి అన్న కోణంలో ఇప్పటికీ పరిశోధన సాగుతోంది. సూట్‌కేస్‌ కంపెనీల పేరుతో ఎంఎస్‌ఎంఈ రుణాలను కూడా బ్యాంకు నుంచి ఆర్‌ఎం నేతృత్వంలోనే కొందరు సిబ్బంది తీసుకున్నారని తెలుస్తోంది. లేని సంస్థల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయడం, వాటికి రుణం కావాలంటూ బినామీ పేర్లతో దరఖాస్తు చేసిన వెంటనే లక్షలాది రూపాయలు మంజూరు చేసేయడం వంటివి ఆర్‌ఎం హయాంలో అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. అసలు సంస్థే లేకుండా రుణాలు ఇవ్వడాన్నే సూట్‌కేస్‌ దందా అంటారు. ఈ విధంగా ఎన్ని లోన్లు ఇచ్చారు, ఎంత సొమ్ము పక్కదారి పట్టిందనే దానిపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది.

బెడిసికొట్టిన మేనేజర్‌ను ఇరికించే యత్నం

నరసన్నపేట బ్రాంచిలో సుమారు రూ.3 కోట్లు సొమ్ము పక్కదారి పట్టడంతో దాన్ని బ్రాంచి మేనేజర్‌తో కట్టించేద్దామని ఆర్‌ఎం రాజు భావించారు. కానీ తనకు ఏమాత్రం సంబంధం లేదని, ఇలా ఇరికించే స్వప్నప్రియ ప్రాణాలు తీసేశారని, తనను కూడా అలానే చేయాలని చూస్తున్నారంటూ బ్రాంచి మేనేజర్‌ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో టీఆర్‌ఎం రాజే రూ.1.3 కోట్లు బ్యాంకుకు కట్టించేసినట్లు గుర్తించారు. కుంభకోణం వెలుగుచూసిన ప్రతిచోటా ఇదే పరిస్థితి. గార బ్రాంచిలో బంగారం మాయమైన కేసులో శాఖాపరంగా మొదట తెలిసింది టీఆర్‌ఎం రాజుకే. కాకపోతే ఆయన ఈ మొత్తం సొమ్మును స్వప్నప్రియతో కట్టించాలనే ఎత్తుగడతో చాలారోజులు ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమె కుటుంబ సభ్యులను కూడా ఇన్‌వాల్వ్‌ చేసి, భయపెట్టి సొమ్ము కట్టించేయాలని చూశారు. కానీ తాను తినని అంత మొత్తానికి సొమ్ము చెల్లించలేక స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. బంగారం మాయమవడానికి, స్వప్నప్రియ చనిపోవడానికి మధ్యలో సొమ్ము చెల్లింపునకు వారి కుటుంబ సభ్యులను వాడుకొని, చివరికి వారి మీదే తిరిగి ఆర్‌ఎం కేసు బిగించేశారు. కానీ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి టీఆర్‌ఎం రాజే. గార బ్రాంచి బంగారం మాయం కేసులో ఏ`2 గా ఉన్న లోలలాక్షి ఫైనాన్స్‌ యజమాని తిరుమలరావు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం అప్పుడు గార బ్రాంచిలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు ఖాతాలో కొన్ని ప్రైవేటు బ్యాంకుల నుంచి కుదువ పెట్టిన బంగారానికి సంబంధించిన నగదు రూ.1.50 కోట్లు జమైంది. కానీ టీఆర్‌ఎం రాజు మాత్రం శ్రీనివాసరావు మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదు సరికదా.. ఆయన్ను అక్కడి నుంచి తీసుకువచ్చి నరసన్నపేట బజారువీధి బ్రాంచికి బదిలీ చేశారు. ఇప్పుడు అక్కడ కూడా రాజు అండదండలతో రూ.3 కోట్లను రుణాల పేరుతో మింగేశారు. అందులో రూ.1.30 కోట్లు తిరిగి కట్టడంతో కుంభకోణం ఆమేరకే జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

గృహరుణాల కమీషన్‌లోనూ అక్రమాలు

బ్యాంకును అడ్డుపెట్టుకొని టీఆర్‌ఎం రాజు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రీజియన్‌ పరిధిలో హౌసింగ్‌ లోన్లు పెద్ద ఎత్తున మంజూరయ్యాయి. బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రైవేటు ఏజెన్సీలు, లేదా వ్యక్తుల ద్వారా ఎవరైనా ఎస్‌బీఐలో ఇంటి నిర్మాణానికి రుణం తీసుకుంటే రెండు శాతం కమీషన్‌ సంబంధిత ఏజెన్సీకి / వ్యక్తికి బ్యాంకు చెల్లిస్తుంది. కానీ ఉద్యోగులు, కాస్త పలుకుబడి ఉన్నవారు నేరుగా బ్యాంకు అధికారులను అప్రోచ్‌ అయి లోన్‌ మంజూరు చేయించుకుంటారు. ఇటువంటి రుణాలను కూడా ఏజెన్సీ ఖాతాలో వేసేసి రెండు శాతం కమీషన్‌ను ఆర్‌ఎం అండ్‌ కో పంచుకుంది. జిల్లాలో దాదాపు రూ.50 కోట్ల వరకు హౌసింగ్‌ రుణాలు ఉంటాయి. వాటన్నింటికి చెందిన కమీషన్‌ను ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లో వేయడం, మళ్లీ వారి నుంచి తీసుకోవడం ద్వారా ఆర్‌ఎం, ఆయన అడుగులకు మడుగులొత్తేవారు బ్యాంకు సొమ్మును గట్టిగానే దోచేశారు.

గార ఎస్‌బీఐలో తాకట్టు బంగారం ఏమైంది? అసలు సూత్రధారులెవరు? వంచనకు గురైందెవరు? టీఆర్‌ఎం రాజును ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చినవారెవరు? వంటి కథనాలతో మళ్లీ కలుద్దాం!.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page