ఇప్పటివరకు సూపర్‌హిట్.. ఈ రాత్రికే మొదలవుతుంది హీట్
నగరమంతా సందడే సందడి
అమాంతం పెరిగిపోయిన పాలకుల మైలేజీ
పోలీసులు ఓవరాక్షన్ చేయకపోతే దర్శనాలు సులభం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘70 ఏళ్లుగా అరసవల్లిలోనే నివాసముంటున్నాను. నా కళ్లతో ఎన్నో రథసప్తములు చూశాను. చిన్నప్పుడు రేగుపళ్లతో మా అమ్మ సూర్యభగవానుడికి నైవేధ్యం ఇచ్చిన దగ్గర్నుంచి నాకు రథసప్తమి తెలుసు. కానీ ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఊరంతా సంబరాలు చేసుకోవడం నేనెప్పుడూ చూడలేదు.’’
- అశ్వద్ధామ, అరసవల్లి
‘‘విమాన ప్రయాణం చాలాసార్లు చేశాను. తీర్థయాత్రలకు వెళ్లాలన్నా, విదేశాల్లో ఉన్న మా పిల్లల దగ్గరకు వెళ్లాలన్నా విమానం తప్ప మరో ఆప్షన్ లేదు. కానీ హెలికాఫ్టర్ ఎక్కడమనేది అందరికీ కుదిరే వ్యవహారం కాదు. కానీ రథసప్తమి ఉత్సవాల పుణ్యమాని హెలికాఫ్టర్‌లో నేనున్నన ఊరిని చూసుకోగలిగాను. ఈరోజుల్లో రూ.1800కు ఏమొస్తుందండీ?! ఏర్పాట్లు అదిరిపోయాయి.’’
-బలగ కమల, కాకివీధి
‘‘టౌన్‌లో ఆదరాబాదరాగా పనులు చేస్తుంటే ఇప్పుడెందుకొచ్చిన గోల అనుకున్నాను. రథసప్తమికి రోడ్లు ముస్తాబు కాకపోతే వచ్చిన నష్టమేమిటని భావించాను. కానీ ఇప్పుడు కళింగ రోడ్డు, పాలకొండ రోడ్డు స్వరూపమే మారిపోయింది. డివైడర్లు పెట్టి రోడ్డు టైట్ చేసేస్తారేమోనని భయపడ్డాను. కానీ కళింగ రోడ్డు చాలా అందంగా మారింది. దీనికి తోడు లైటింగ్ కొత్త శోభను తెచ్చిపెట్టింది.
- పసగాడ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్

ఊరంతా ఒకటే సందడి.. దేశంలో ఏ మూల ఉన్నా సంక్రాంతికి సొంతూరుకు చేరుకునే పెదపండుగలా మారిపోయింది రథసప్తమి. అరసవల్లి సూర్యనారాయణస్వామి జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్యమంత్రిని కోరినప్పుడు రథసప్తమి ఏంటి? రాష్ట్రపండగేంటి? అని నవ్వారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తించినంత మాత్రాన ఉత్సవాలైపోతాయా? అని పెదవి విరిచారు. కానీ రథసప్తమి అనే కాన్సెప్ట్‌ను ముందుపెట్టి నగరాన్ని ఎలా సుందరీకరించొచ్చో ఎమ్మెల్యే గొండు శంకర్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చూపించారు. ఇంతవరకు కళింగ రోడ్డు ఒకటుందంటూ ఎవరూ పెద్దగా గుర్తించలేదు. అటువంటి చోట సెంటర్ లైటింగ్ పెట్టి పసగాడ నారాయణ మిల్లు జంక్షన్ రూపురేఖలే మార్చేశారు. పనిలో పనిగా పాలకొండ రోడ్డులో కోనోకార్పస్ చెట్లు తొలగించి సెంటర్ లైటింగ్ ఎప్పటిలాగే ఏర్పాటుచేసి సుందరీకరణలో భాగంగా కొత్త మొక్కలు నాటారు. ఒక్క రథసప్తమి పుణ్యమాని పాలకొండ రోడ్డు, కళింగ రోడ్డు మెరుగయ్యాయి. పక్కనున్న విజయనగరంలో ఎక్కడపడితే అక్కడ చెరువుల చుట్టూ సుందరీకరించిన బోర్డులు కనిపిస్తుండగా, శ్రీకాకుళంలో మాత్రం అటువంటి హంగులు ఎక్కడా ఉండేవికావు. ఇప్పుడు మూడు రోజుల రథసప్తమి ఉత్సవాల పుణ్యమాని కొత్త శోభ సంతరించుకుంది. ఆదివారం నగరంలో జరిగిన శోభాయాత్రను చూసిన ప్రజలు అయ్యారే.. అని ముక్కున వేలేసుకున్నారు. మన సంస్కృతిని ప్రతిబింబించే శకటాలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, కర్రసాము చేస్తూ నగర రోడ్ల వెంబడి మంత్రి, ఎమ్మెల్యే నడుస్తుంటే జనం సంతోషంతో అభివాదం చేస్తున్న సన్నివేశాలే ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పడానికి సంకేతం. ఆదివారం ఉదయం నుంచి సిక్కోలు గగనతలంపై హెలికాఫ్టర్ చక్కర్లు, రోడ్లన్నీ వెలుగుజిలుగులతో కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా సమాజంలో అన్ని వర్గాలవారిని ఇందులో ఇన్‌వాల్వ్ చేయడం గొప్ప విషయం. క్రీడలు, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం.. ఇలా అన్ని రంగాల నుంచి ప్రదర్శనలు జరగడం, దానికి విశేష ఆదరణ లభించడం కొసమెరుపు. అలాగే అన్ని వర్గాల నుంచి రథసప్తమికి సహాయం తీసుకోవడం కూడా విశేషమే. రథసప్తమి అనగానే నీళ్లో, పాలో పోయడానికి ఎప్పుడూ కొందరు ముందుకొస్తుంటారు. కానీ ఈసారి అటువంటివారితో పాటు దూరంగా ఉన్నవారిని సైతం గుర్తించి వినియోగించుకోవడం రథసప్తమి వేడుకలకు సేవ చేసేవారి సంఖ్య పెరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రతీ కార్యక్రమం సూపర్‌హిట్టే. సరిగ్గా సోమవారం అర్థరాత్రి నుంచే అసలు హీటు మొదలవుతుంది. క్షీరాభిషేకానికి, నిజరూప దర్శనానికి జనాలు ఎగబడకుండా, తోపులాట లేకుండా సావదానంగా దర్శనం జరిగితేనే రథసప్తమి ఉత్సవాలు విజయవంతమైనట్టు. గతం మాదిరిగా కాకుండా ఈసారి వాహనాల పార్కింగ్ కోసం ఆలయానికి దగ్గరలోనే స్థలాన్ని కేటాయించడం మొదటి విజయం. గతంలో పాతబస్టాండు వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు బొమ్మ దగ్గరే నిలిపేసేవారు. ఆ తర్వాత 80 అడుగుల రోడ్డులో వీఐపీల వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చేవారు. ఈసారి వారు, వీరు అన్న భేదం లేకుండా అరసవల్లిలో ఉన్న గుండవారి కల్యాణ మండపం వరకు వాహనాలు వెళ్లే ఏర్పాట్లు చేశారు. వీఐపీ పాస్‌లు లేవని, డోనార్ పాస్‌లు కూడా ఇష్టారాజ్యంగా ఇవ్వడంలేదని ప్రకటించిన తర్వాత చాలామంది విమర్శిస్తున్నారు. గతంలో డోనార్‌ల పేరుతో ఆలయంలో ఉన్న అర్చక ముఠా చాలామందికి పాస్‌లు ఇచ్చేసేవారు. దీనివల్ల అసలు ఆలయానికి, స్వామివారికి డబ్బులిచ్చినవారు వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఉండేది. అరసవల్లి ఆలయంలో అసలు ఒరిజినల్ డోనార్లు ఎంతమందో లెక్కాపత్రం లేదు. అందుకే ఈసారి నేరుగా దాతలనే రమ్మన్నారు. దీంతో ఇప్పటి వరకు రథసప్తమి వేడుకకు దాతల పేరుతో గతంలో హల్‌చల్ చేసినవారు సగానికి పైగా తగ్గుతారని భోగట్టా. అరసవల్లి పాలకమండలి సభ్యులు, అరసవల్లి లోకల్ కోటా కింద ఆలయం కిక్కిరిసిపోయేది. ఈసారి అటువంటివి ఏమేరకు నిరోధిస్తున్నారో మంగళవారం నాటికి తెలుస్తుంది. కానీ రథసప్తమి అనగానే శ్రీకాకుళం నగరం, అరసవల్లి ఆలయం, భక్తుల క్యూలైన్లు పోలీసుల కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. వీరు భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వల్ల ప్రతీ రథసప్తమికి పెదవివిరుపు మాటలే వినిపించేవి. అలాగే క్యూలైన్‌లో కాకుండా తమ కుటుంబ సభ్యులను, వందిమాగదులను దర్శనానికి తీసుకువెళ్లడం పోలీసులకు ఆనవాయితీ. దీనివల్ల సాధారణ భక్తులు గగ్గోలు పెట్టేవారు. ఈసారి ఇటువంటి ఓవరాక్షన్లు లేకుండా స్థానిక సన్‌రైజ్ హోటల్‌లో మంత్రి, ఎమ్మెల్యే లైవ్ కవరేజీని, సీసీ టీవీల ఫుటేజ్‌ని పర్యవేక్షిస్తారని తెలుస్తుంది. ఎస్పీ కూడా స్ట్రిక్ట్ కావడంతో ఈసారి పోలీసులు సొంత లాభం కొంత మానుకుంటారని భావించాల్సి ఉంది.

సమిష్టి కృషితో అందంగా, ఆనందంగా,కోలాహలంగా, వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతాయి