top of page

రాజ్యసభలో మణిపూర్‌ ముచ్చట్లు

Writer: ADMINADMIN
  • స్పందించవలసిందిగా లోక్‌సభలో నిరసనలు

  • రాజ్యసభలో స్పందించిన మోదీ

  • ఏడాది తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి

(దుప్పల రవికుమార్‌)

లోక్‌సభ సమావేశాలను బహుశా తొలిసారి దేశమంతా చాలా శ్రద్ధతో ఆలకిస్తుందనిపిస్తోంది. దిగువసభలో విపక్షాలు ముక్తకంఠంతో పాలకపక్షాన్ని మణిపూర్‌ అంశం మీద మాట్లాడమని నిలదీస్తున్నాయి. మణిపూర్‌ గురించి పెదవి విప్పకూడదని ఏడాదికాలంగా భీష్మించుకు కూర్చున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కిందటేడాది మే నెలలో రెండున్నర గంటలపాటు మణిపూర్‌ గురించి మాట్లాడారని మోదీ అనుకూల జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దురదృష్టం ఏమంటే ఆ రెండు గంటల నలభై నిమిషాల ఊకదంపుడు ప్రసంగంలో మణిపూర్‌ గురించి నిండా రెండు నిమిషాలు కూడా ప్రధాని మాట్లాడలేదు. సరిగ్గా ఏడాది తర్వాత లోక్‌సభలో ఇప్పుడు విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తే, ప్రధాని తిన్నగా వెళ్లి రాజ్యసభలో దాని గురించి మాట్లాడారు. అప్పుడు మణిపూర్‌పై ప్రభుత్వ ప్రతిస్పందన తెలుసుకోవడానికి ఏకంగా విపక్షాలు వీగిపోతామని తెలిసినా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించవలసి వచ్చింది. ఈసారి గట్టిగా డిమాండ్‌ చేయగానే ప్రభుత్వం స్పందించింది. ప్రతిపక్షం శక్తిమంతంగా ఉంటే అధికారంలో ఉన్నవారు తమ నియంతృత్వ ధోరణులను క్రమంగా వదిలించుకోగలరని ఈ దృష్టాంతం రుజువు చేస్తోంది. గత పద్నాలుగు నెలలుగా అట్టుడికిపోతున్న మణిపూర్‌ గురించి పెదవి విప్పని మోదీపై మొన్ననే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మొహువా మైత్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మణిపూర్‌ గురించి పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే మణిపూర్‌ రెండు ఎంపీ సీట్లు ఓడిపోయిందని గుర్తు చేశారు.

మొత్తానికి రాజ్యసభలో మంగళవారం ప్రధాని చేసిన ప్రసంగం దేశంలో ఎంతో చర్చకు దారితీసింది. ఈశాన్య రాష్ట్రాలపట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని వస్తున్న విమర్శలకు సమాధానంగా ప్రధాని ప్రసంగం నిలిచింది. మోదీ మాట్లాడుతూ గత సెషన్లో మణిపూర్‌ గురించి చాలా వివరంగా మాట్లాడానని, అయినప్పటికీ ఈరోజు మరింత గట్టిగా చెప్పదలచుకున్నానని ప్రకటించారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉందని, ఇందులో భాగంగా ఇప్పటివరకూ 11వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. అక్కడితో ఆగకుండా మణిపూర్‌ లాంటి చిన్న రాష్ట్రంలో 500 మందికి పైగా అరెస్టు చేసినట్టు తెలిపారు. మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. ఇప్పుడిక శాంతిమయ వాతావరణం సాధ్యమవుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయన్నారు. ఇప్పుడు మణిపూర్‌లో చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థలు తిరిగి పని చేస్తున్నాయని దేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగా పరీక్షలు నిర్వహించగలుగుతున్నామని, యువతరం వికాసంవైపు పయనిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్‌లో అన్ని వర్గాలతో చర్చలు జరుపుతూ శాంతి పునరుద్ధరించడానికి శాంతియుతంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇదివరకటి ప్రభుత్వాల హయాంలో ఇది జరగలేదని ఎద్దేవా చేశారు. హోం మంత్రి అక్కడ కొద్ది రోజులు బసచేసినట్టు ఆయన తెలిపారు.

అట్టుడికిపోతున్న మణిపూర్‌ ` మిన్నకున్న మోదీ

నిజానికి హోం మంత్రి అమిత్‌ షా పద్నాలుగు నెలల కిందట మేలో మొదటిసారి హింస చెలరేగినప్పుడు మణిపూర్‌ను సందర్శించిన తర్వాత మళ్లీ 11 నెలల తర్వాత మొన్నటి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మాత్రమే మణిపూర్‌ వెళ్లారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి నాలుగు రోజుల ముందు అంటే ఏప్రిల్‌ 15వ తేదీన బీజేపీ తరఫున ప్రచారానికి అమిత్‌ షా వెళ్లినపుడు ఇంఫాల్‌లో నిరసనకారులు రోడ్లను చుట్టుముట్టేసారు. ఫలితంగా మణిపూర్‌లో ఉన్న రెండు ఎంపీ సీట్లను బీజేపీ కోల్పోయింది. ప్రధాని రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలపడానికి ఉదాహరణగా మణిపూర్‌లో వరదలు వచ్చే సూచన వాతావరణ శాఖ చేసిందని, ముందు జాగ్రత్తగా రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అక్కడికి పంపించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌ హయాంలో మణిపూర్‌లో పదిసార్లు రాష్ట్రపతి పాలన విధించినట్టు గుర్తు చేసారు. తాము పెదవులు బిగబట్టి పరిస్థితులను చక్కదిద్దుతున్నామే గాని, అలాంటి దుందుడుకు పనులకు తమ ప్రభుత్వం పూనుకోలేదని రాజ్యసభలో సభ్యులకు గుర్తు చేశారు.

మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. 1993లో నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఈ ఉద్యమానికి రాష్ట్రంలోని తంగకుల్‌ నాగా జాతికి చెందిన టి ముయివా నాయకత్వం వహిస్తున్నాడు) వందకు పైగా కుకీ తెగ ప్రజలను కాల్చి చంపేసింది. తాము నివశిస్తున్న ప్రదేశం తమదంటే తమదని, ఆ భూములు తమకే చెందుతాయని జరుగుతున్న నిరంతర సంఘర్షణలో కుకీ, నాగా జాతుల ప్రజలు ఒకరినొకరు ఊచకోత కోసుకుంటున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు, పిల్లలతో సహా కొన్ని వందలమందిని పొట్టన పెట్టుకున్నారు. కుకీలు తమకు తరతరాలుగా వంశపారంపర్యంగా చెందుతుందన్న భూమిలో కొంతభాగం తమదేనని మణిపూర్‌ నాగాలు డిమాండ్‌ చేయడమే కాకుండా, ఆ ప్రాంతంతో గ్రేటర్‌ నాగాలింను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దాదాపు దశాబ్దకాలంగా అంతర్గతంగా రగులుతున్న జాతి ఘర్షణలు ఏడాది కిందట మళ్లీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు సమీపంలో ఉన్న చూరాచందర్‌పూర్‌ పట్టణంలో కుకీ తెగకూ మీతెయి సామాజిక వర్గానికీ మధ్య జరిగిన ఘర్షణ పెద్దఎత్తున అల్లర్లకు, హింసకు దారితీసాయి. ఈసారి ఘర్షణకు కారణం గిరిజన తెగకు చెందని మీతెయి ప్రజలు తమకు షెడ్యూల్డ్‌ తెగల రిజర్వేషన్‌ కావాలని పోరాడడమే.

ఘర్షణలకు కారణాలు బోలేడు ` లోపించించి చిత్తశుద్ధి

ఈ రెండు తెగలకు మధ్యనున్న సంక్లిష్ట సంబంధాలకు కూడా సంక్లిష్టమైన చరిత్ర ఉంది. పైగా మీతెయిలు ఇప్పుడు కాస్తా చదువుకోవడం వల్ల గ్రామీణ కుకీలను తమకు చెందనివారుగా, పరాయి ప్రజలుగా, మత్తుమందులు రవాణా చేసేవారిగా ఈసడిరచుకుంటున్నారు. ఇప్పటికే పట్టణవాసం వల్ల మితీయిలు రాజకీయంగా పలుకుబడి కలిగివున్నారు. కాని, ఈ కార్చిచ్చు ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించింది. ఎక్కడ దాడులు జరిగినా సోషల్‌ మీడియా వల్ల ఆ వార్తలు అన్నిచోట్లా గుప్పుమనడంతో వివిధ ప్రాంతాల్లో మరింతగా గొడవలు, అల్లర్లు చెలరేగుతున్నాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యం, జీవనం, విద్యలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో సమస్యలు రావడం ద్వారా భారతదేశ ప్రజల చర్చ అటువైపు మళ్లిద్దామని దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మన పొరుగుదేశాలు భావించడం వల్లనే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరకడం లేదని కొన్ని దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. ఇరు తెగల ప్రజలను సంప్రదించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించే వీలున్నప్పటికీ భారత ప్రభుత్వం ఆ పని చేయకుండా తాత్సారం చేయడానికి రాజకీయ కారణాలే ఎక్కువ. వాటిని అధిగమించగలిగినప్పుడే మణిపూర్‌ ప్రజలు ముళ్లకంప పైనుంచి దిగగలిగేది.

ఈ దేశ రాజకీయ నాయకులు ఈశాన్య రాష్ట్ర ప్రజలనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా చిన్నచూపు చూస్తున్నారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ప్రస్తావించుకుందాం. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో దాదాపు అన్ని రాష్ట్రాల ఎంపీలకు అవకాశమిచ్చారు. మణిపూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీకి అవకాశమిస్తామని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా మాటిచ్చారు. అయితే ఆ అవకాశం ఎప్పుడు వచ్చిందో తెలుసా.. అర్థరాత్రికి పది నిమిషాలు ముందు. దాదాపు ఖాళీగా ఉన్న సభనుద్దేశించి ఆ ఎంపీ మాట్లాడుతూ ఇంతే ప్రాధాన్యత తమ ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రభుత్వం ఇస్తోందన్న మాట అనేశారు. అందులో తప్పు లేదనే ఎవరికైనా అనిపిస్తుంది!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page