top of page

రాజీవ్‌పై దివాలాకోరు వాదనలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 22
  • 2 min read
ree

మాజీ ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ వర్ధంతిని కాంగ్రెస్‌ శ్రేణులే మర్చిపోయినట్లున్నాయి. ఎక్కడా పెద్దగా జరిగిన దాఖలాల్లేవు. ఆయనకెవరూ నివాళులర్పించక పోయినా ఫర్వాలేదు గానీ.. ఆయన వల్ల పొందిన మేలును విస్మరించి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దయ వల్లే తమ ఉనికిని నిలుపుకోగలిగామనే దివాలాకోరు వ్యాఖ్యలను కొందరు నాయకులు చేస్తుండటం విచారకరం. అంతకంటే దుర్మార్గం మరేదీ ఉండదు. వైఎస్‌ రాజకీయ ఎదుగుదలకు ఒకరకంగా రాజీవ్‌గాంధీయే కారణం. 32 ఏళ్ల పిన్న వయసులో తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని రాజశేఖర్‌ రెడ్డే ఊహించలేని తరుణంలో.. రాజీవ్‌గాంధీ చొరవ తీసుకుని తన తల్లి, అప్పటి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీని ఒప్పించి రాజశేఖర్‌ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచే వైఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మంచి ఎలివేషన్‌ వచ్చింది. అదే ఆయన ముఖ్యమంత్రి పదవి పొందేందుకు పునాదిలా ఉపయోగపడిరది. ఇందిర, రాజీవ్‌ల అకాల మరణం తర్వాత వైఎస్‌ రాజ కీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. పీవీ నరసింహారావు జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యాక రాష్ట్ర రాజకీయ మ్యాపులో దాదాపు వైఎస్‌ లేకుండా చేశారు. ఆ కారణంగానే ఆనాడు పీవీ సభలో వేదికపైకి చెప్పులు విసిరిన ఘటన చోటు చేసుకుంది. కర్రెద్దుల కమలకుమారి, కమలుద్దీన్‌ అహ్మద్‌, చింతా మోహన్‌, పీవీ రంగనాయుడు.. ఇంకా ఎవరెవరో మన రాష్ట్రం నుంచి పీవీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నా వైఎస్‌కు మాత్రం రిక్తహస్తమే ఎదురైంది. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకోకపోగా వైఎస్‌ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జలగం వెంగళరావుకు అప్పగించారు. ఆ తర్వాత చెన్నారెడ్డి రావడం, రంగా దారుణ హత్య, 1989లో కాంగ్రెస్‌ గెలుపు వంటి వరుస ఘటనలు జరి గాయి. 1994లో మళ్లీ కాంగ్రెస్‌ ఓడిపోయి పీవీ దిగిపోయిన తర్వాత కొద్దిరోజులు సీతారామ్‌ కేసరి నాయకత్వం వహించినప్పటికీ తిరిగి సోనియాగాంధీ పగ్గాలు చేపట్టి 18 రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది. ఆ క్రమంలోనే 1998లో వైఎస్‌ మళ్లీ పీసీసీ అధ్యక్షుడిగా సోనియా ద్వారా నియమితులయ్యారు. అప్పుడు కూడా కాంగ్రెస్‌ గెలవలేదు. అయితే చంద్రబాబు మార్కు పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్‌ మినహా వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల 2004లో కాంగ్రెస్‌ గెలిచింది. దానికి ముందు 1996, 1998 పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 22 చొప్పున పార్లమెంటు సీట్లను రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ గెలుచుకోవడం విశేషం. ఇందులో వైఎస్‌ కృషి, ప్రమేయం పెద్దగా లేదు. సంప్రదాయంగా కాంగ్రెస్‌ వైపు ఉన్న దళితులు, మైనారిటీలు, కాపులు ఇతర బలహీన వర్గాల ఓట్లే దీనికి కారణం. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయంలో వైఎస్‌ పాత్రను తక్కువ చేయ లేం గానీ.. మొత్తంగా అతనే గెలిపించారనడం అతిశయోక్తే. నాడు కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టింది. సోనియా నాయకత్వంలోనే కాంగ్రెస్‌ రెండుసార్లు కేంద్రంలో అధి కారంలోకి వచ్చింది. వాస్తవాలు ఇలా ఉంటే జగన్‌ను కష్టాల పాలు చేయడం వల్ల కాంగ్రెస్‌ అస్తి త్వాన్ని కోల్పోయిందనటం దారుణం. ఆంధ్రలోనే కాంగ్రెస్‌ అస్తిత్వం కోల్పోయింది. పక్కనున్న తెలం గాణలో ఆ పార్టీయే అధికారంలో ఉంది. జగన్‌ను గుర్తించకపోవడం వల్ల కాంగ్రెస్‌ అస్తిత్వం కోల్పో యిందనడం ఆత్మవంచనే. ఉమ్మడి ఏపీ విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుం దని తెలిసినా సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నందునే ఇక్కడి ప్రజలు ఆమె కుటుంబంపై ఆగ్రహించారు. ఈ కారణంతోనే కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా జగన్‌ బలం పుంజుకు న్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులను తనవైపు మలచుకోవాలని, తన తండ్రి అకాలమరణం తాలూకు సానుభూతి మొత్తం తనకే దక్కాలనే రాజకీయ వ్యూహంతో ఒక్కో అడుగూ వేసుకుంటూ వెళ్లారు. అయినా కూడా 2014లో అధికారం సాధించలేదు. చంద్రబాబు భీకర పాలన వల్ల 2019 లో జగన్‌కు రికార్డు మెజారిటీ లభించింది. తిరిగి అంతే స్థాయిలో ఆయన తిరిగి చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించేంత వరకు నిద్రపోకుండా నిర్విరామ కృషి చేశారు. నిజాలు ఇలా ఉంటే రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించే నెపంతో మన దుర్భావనలన్నీ ఆ కుటుంబం మీదకి నెట్టేస్తామంటే ఎలా? సోనియాగాంధీ లేకుంటే పార్టీలో ఈ గుర్తింపు ఉండదని తను బతికున్నప్పుడు వైఎస్‌ ఎన్నో సార్లు అన్నారు. మాటల్లో, చేసే వ్యాఖ్యల్లో న్యాయం ఉండాలి. రాజీవ్‌ను చిన్నచూపు చూసిన, ఆయన వర్ధంతిని విస్మరించిన వారందరి తరఫున మనఃపూర్వక నివాళి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page