top of page

‘రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌’ మూవీ రివ్యూ

Writer: ADMINADMIN


కథ: డి.రాఘవన్‌ (ప్రదీప్‌ రంగనాథన్‌) పన్నెండో తరగతి 96 శాతం మార్కులతో పాసైన కుర్రాడు. ఐతే ఇంటర్‌ పూర్తయ్యాక తాను ఇష్టపడే అమ్మాయికి ప్రపోజ్‌ చేస్తే.. మూడు సబ్జెక్టులు వేరే కుర్రాడే తనకు ఇష్టమని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో బుద్ధిగా చదువుకునే వాళ్ల కంటే అల్లరిగా ఉండే వాళ్లే అమ్మాయిలకు నచ్చుతారని భావించి ఇంజినీరింగ్‌ లో పూర్తిగా తన వ్యవహార శైలిని మార్చేసి పోకిరిగా మారతాడు రాఘవన్‌. తన పేరును కూడా ‘డ్రాగన్‌’ అని మార్చుకుంటాడు. కాలేజీలో తన ఫాలోయింగ్‌ పెరుగుతుంది. గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా దొరుకుతుంది. కానీ ఇంజినీరింగ్‌ పూర్తయ్యేసరికి అన్ని సబ్జెక్టులూ పెండిరగులో పెట్టుకుని ఒక ఫెయిల్యూర్‌ గా మిగులుతాడు రాఘవన్‌. కొంత కాలానికి జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ప్రేమించిన అమ్మాయీ దూరమవుతుంది. ఈ స్థితిలో జీవితంలో నిలదొక్కుకోవడానికి రాఘవన్‌ ఏం చేశాడు.. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. వాటిని ఎలా అధిగమించాడు.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న ఒక సమస్య నేపథ్యంలో సినిమా తీసి మెప్పించడం అంటే తేలికైన విషయం కాదు. సమస్యను వివరంగా చెబుతూ పోతే.. సినిమాకొచ్చి రిలాక్స్‌ అవుదామనుకుంటే ఇదేం బాదుడు అంటారు ప్రేక్షకులు. అలా అని వినోదపు మోతాదు ఎక్కువ అయిపోతే ‘సమస్య’ డైల్యూట్‌ అయిపోతుంది. ఈ రెంటినీ బ్యాలెన్స్‌ చేస్తూ కథాకథనాలను రక్తి కట్టించడం పెద్ద టాస్కే. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ ‘ఓ మై కడవులే’ (తెలుగులో ఓరి దేవుడా) చిత్రంతో రచయితగా-దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన అశ్వత్‌ మారిముత్తు.. ‘రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌’లో ఈ టాస్కును విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ కథకు మూలం.. హీరో ఫేక్‌ డిగ్రీతో మోసం చేసి ఉద్యోగం సంపాదించడం. దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇందులో చాలా ఎఫెక్టివ్‌ గా చూపించాడు దర్శకుడు. కానీ దాని మీద లెక్చర్లు ఉండవు. సుదీర్ఘమైన సన్నివేశాలూ ఉండవు. అయినా విషయం బలంగా ప్రేక్షకుల హృదయాలకు తాకుతుంది. అలా అని ఇది కేవలం సందేశాలివ్వడానికి చేసిన సినిమా కాదు. యూత్‌ కోరుకునే వినోదానికి ఇందులో ఢోకా లేదు. ఒక యూత్‌ ఫుల్‌ సినిమా లాగే సాగుతూ.. ఎంటర్టైన్మెంట్‌ తో అలరిస్తూనే సందేశాన్ని కూడా బలంగా చెప్పిన చిత్రమిది.

‘ఓ మై కడవులే’ సూపర్‌ హిట్టయ్యాక పెద్ద స్టార్లు కూడా తనతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు ‘లవ్‌ టుడే’ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ ను ఏరికోరి ఈ చిత్రం కోసం హీరోగా ఎంచుకోవడానికి కారణమేంటో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇది ప్రదీప్‌ మాత్రమే చేయాల్సిన కథలా అనిపిస్తుంది. ‘లవ్‌ టుడే’ చూసి తన కోసమే ఈ కథ రాసుకున్నాడా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ సినిమాలో ఒక దశ వరకు ప్రదీప్‌ పాత్ర చూస్తే.. చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి అదే పాత్ర పట్ల ఆరాధన భావం కలుగుతుంది. ఈ పరిణామ క్రమాన్ని ప్రదీప్‌ తన పెర్ఫార్మెన్స్‌ ద్వారా తెర మీద చాలా బాగా చూపించాడు. ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ.. అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలను తెరపై చూసినపుడు ప్రేక్షకులకు చికాకు పెట్టడం సహజం. ఇలాంటి వ్యక్తిని తెరపై చూస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. కానీ అదే వ్యక్తిని చివరికి దగ్గరికి తీసుకుని హత్తుకోవాలని అనిపిస్తే.. ఆ పాత్రలో మార్పుని ఎంతో ప్రభావవంతంగా చూపించినట్లే. ‘రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌’లో విశేషం అదే.

ఇంటర్మీడియట్లో బుద్ధిగా ఉంటే అమ్మాయి ఇష్టపడలేదని.. ఇంజనీరింగ్‌ లో హీరో పోకిరిగా మారడం కొంచెం సిల్లీగా అనిపించినా.. ఈ కథలో ఆ విషయాన్ని కన్విన్సింగ్‌ గానే చూపించారు. హీరో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు ‘డ్రాగన్‌’ కొంచెం బోరింగ్‌ గానే అనిపిస్తుంది. కానీ తన జీవితం కొత్త దారిలోకి వెళ్ళాక కథలో ఊపు వస్తుంది. హీరో ఎదుగుదల కాస్త సినిమాటిగ్గా అనిపించినా అదేమంత ఇబ్బంది అనిపించదు. హీరో జీవితంలో అంతా మంచే జరుగుతూ ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోతుంటే ఇక ఈ కథలో చెప్పడానికి ఏముంది అనిపిస్తుంది. కానీ అక్కడే కథను దర్శకుడు భలే మలుపు తిప్పాడు. ఉద్యోగంలో మంచి స్థాయి అందుకుని పెళ్ళికి రెడీ అయిన హీరో మళ్ళీ కాలేజీకి వెళ్లి ఫెయిలైన సబ్జెక్టులన్ని క్లియర్‌ చెయ్యాల్సిన పరిస్థితి రావడం.. దీని చుట్టూ నడిపిన డ్రామా భలేగా అనిపిస్తుంది. ఇదంతా కొంత మేర నాని సినిమా పిల్ల జమీందార్‌ సినిమాను గుర్తుకు తెస్తుంది. కానీ దీని ప్రత్యేకత దీనిదే. చివరికి హీరో అనుకున్నది సాధిస్తాడు అన్నది అంచనా వేయగలిగిందే అయినా.. మంచి వినోదంతో ఈ ట్రాక్‌ నడిపించి ప్రేక్షకులను అలరించాడు దర్శకుడు. చివర్లో కథ పరంగా వచ్చే మలుపు ఆసక్తి రేకెత్తిస్తాయి. రెండు గంటలకు పైగా వినోదభరితంగా సాగే సినిమా.. చివర్లో ఎమోషనల్‌ రూట్‌ తీసుకుంటుంది. కామెడీని ఎంత బాగా పండిరచాడో.. ఎమోషనల్‌ సీన్లను కూడా అంతే ఎఫెక్టివ్‌ గా తీశాడు అశ్వత్‌. తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసి హీరో షేక్‌ అయిపోయే సీన్‌ ప్రేక్షకులను కూడా కదిలిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు చర్చించిన సమస్య ఆ దశలో ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. పతాక సన్నివేశాలు హృద్యంగా సాగుతాయి. ముగింపులో ‘లవ్‌ టుడే’ మూవీతో కనెక్షన్‌ పెట్టి ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు చిందింపజేస్తాడు దర్శకుడు. టేకాఫ్‌ వరకు ‘రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌’ కొంచెం ఇబ్బంది పెట్టినా.. ఆ తర్వాత మాత్రం ఇటు కామెడీ.. అటు ఎమోషన్లను సరిగ్గా బ్యాలెన్స్‌ చేస్తూ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. యువతకు బాగా నచ్చే ఈ చిత్రం.. మిగతా వారినీ సంతృప్తి పరుస్తుంది.

నటీనటులు: ‘లవ్‌ టుడే’ సినిమా మొదట్లో ప్రదీప్‌ రంగనాథన్‌ ను చూస్తే ఇతనేం హీరో అనిపిస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి తనకు ఫ్యాన్‌ అయిపోతాం. ‘రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌’లోనూ అంతే. మొదట్లో తన పాత్ర.. తన లుక్స్‌.. నటన కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ ఆ పాత్రలోని పరివర్తనను.. అందులో ప్రదీప్‌ నటనను చూశాక చివరికి మొత్తం అభిప్రాయం మారిపోతుంది. కొన్ని సీన్లలో ప్రదీప్‌ పెర్ఫామెన్స్‌ క్రేజీగా అనిపిస్తుంది. ముఖ్యంగా తాను పాసయ్యానని తెలిసినపుడు అతనిచ్చే హావభావాలు.. తన అరుపులకు థియేటర్‌ హోరెత్తిపోతుంది. ప్రదీప్‌ నటనలో కొంచెం ధనుష్‌ ఛాయలు కనిపిస్తాయి. అనుపమ పరమేశ్వరన్‌ తక్కువ స్క్రీన్‌ టైంతోనే తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ సినిమాకు ఆమె బలంగా నిలిచింది. కాయదు లోహర్‌ చూడ్డానికి బాగుంది. ఆమె తన గ్లామర్‌ తో ఆకట్టుకుంది. పెర్ఫామెన్స్‌ ఓకే. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో దర్శకుడు మిస్కిన్‌ బాగా చేశాడు. హీరో తండ్రిగా ‘ఖైదీ’ ఫేమ్‌ జార్జ్‌ మరియన్‌ నటన హృద్యంగా అనిపిస్తుంది. ఛోటా డ్రాగన్‌ పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.

సాంకేతిక వర్గం: ‘రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌’లో సాంకేతిక విభాగాలు మంచి పనితీరునే కనబరిచాయి. లియోన్‌ జేమ్స్‌ హుషారుగా సాగే పాటలు ఇచ్చాడు. చార్ట్‌ బస్టర్‌ సాంగ్స్‌ లేవు కానీ.. సినిమాలో పాటలు బాగానే సాగిపోతాయి. బ్రేకప్‌ సాంగ్‌ వినసొంపుగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఒకే. తెలుగు వాడైన నికేత్‌ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అశ్వత్‌ మారిముత్తు.. ‘ఓ మై కడవులే’ తర్వాత మరోసారి రచయితగా-దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. ‘ఓ మై కడవులే’ తరహాలో ఇందులో క్రేజీ కాన్సెప్ట్‌ ఏమీ కనిపించదు కానీ.. ఎక్కువమంది రిలేట్‌ అయ్యే ఒక సమస్యను తీసుకుని.. వినోదాత్మకంగా కథను చెప్పాడు. చాలా వరకు కామెడీగానే సినిమాను నడిపించి.. చివర్లో ఎమోషనల్‌ టచ్‌ కూడా ఇచ్చాడు. అశ్వత్‌ రాతకే కాక తీతకు మంచి మార్కులు పడతాయి.

చివరగా: రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌ మంచి సందేశం భలే వినోదం

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page