రెండు హృదయాల మూగరోధన!
- Guest Writer
- May 20
- 2 min read

ఈ అభిప్రాయాలు కేవలం అంటే కేవలం నావే.. ఈ మధ్య కాలంలో మనం తరచుగా సినిమా ప్రియులు వినేమాట స్టొరీ హీరో కి న్యారేట్ చేసాము 6 గంటలు, పది గంటలు పట్టింది.హీరో గారు ఈ స్టొరీ విని మనం పక్కా ఈ సినిమా చేస్తున్నాం అని... అసలు ఈ సినిమా కథని హీరోకి , హీరోయిన్‌కి ఏమని చెప్పి ఒప్పించారు? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలేదు..
అసలు ఇప్పుడు ఈ స్టొరీ చెబితే ఎందరు హీరోలు ఒప్పుకుంటారో? అతి మాములు స్టొరీ.. సినిమా పరిబాషలో మాట్లాడితే ఒక చిన్న లైన్...
కాని ఇక్కడ దర్శకుడు మణిరత్నం గారు మరి..
అటు చూస్తే ఆ టైంలో పీక్ స్టేజ్‌లో మోహన్ గారు,రేవతి గారు, కార్తీక్ గారు..
ఎలా కలపాలి ఈ చిన్న లైన్ ఉన్న సినిమాని అంత పెద్ద హీరోలతో, రేవతి లాంటి నటితో. దాన్ని కలిపే అద్భుతమైన మంత్రం ఇళయరాజా సంగీతం.
అక్కడ మొదలైంది మౌనరాగం.. అవును..
మౌనరాగం.. అది హృదయంలోంచి రావాలి.. మనసుని తాకుతూ అలా గుండెలనిండా హాయిని నింపుతూ మన జ్ఞాపకాల పొరల్లోకి జారిపోయి నిక్షిప్తమైపోవాలి..
వేణువు అదే మురళిని చూసే వుంటారు. కాని రసాస్వాదన చేసివారికి దానిలో గాలిని ఊది ఏ రంద్రం మూసి ఏ రంద్రం వదిలితే ఏ రాగం వచ్చి మన మోముపై చిరునవ్వుని చేరుకుంటూ మనసుకి హాయిగా అనిపిస్తుందో అదే తరహా..
ఇక కాస్త సినిమా వైపుకి వెళ్తే ఏం లేదు అక్కడ రెండు హృదయాలు పడే మూగవేదన ఈ మౌనరాగం.. అర్ధం చేసుకున్నవారికి చేసుకున్నంత..
30 సంవత్సరాల క్రితమే సూటితనం, మొండితనం కలగలిసి ఉన్న ఒక చదువుకుంటున్న అమ్మాయి జీవితం లోకి సడెన్ పెళ్లి అనే ప్రస్తావన రావటం ,ఎందుకు చేసుకోవాలి,ఎందుకు చేసుకోకుండా ఉండవచ్చు అని తర్జన భర్జనలు చివరికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ తో ఒకరి కి భార్యగా మారటం..
ఇక్కడే అసలు ట్విస్ట్..తన లైఫ్ లో ఇంతకుముందే ఒక ఇడియట్ లాంటి వ్యక్తి మెరుపు వేగం తో రావటం .అంతే వేగం తో మాయమైపోవటం.దానివల్ల అంత మొండిగావున్న ఆమె ఇంకా మొండితనం తో మారటం .ఆమెని మార్చుకుందాం అని ఆమె భర్త పడే ఇబ్బంది కాని ఆమెకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తను చూసుకోవటం..ఇలా అన్నీ సన్నివేశాలు ఒకదానికొకటి అల్లుకుపోయు ఉంటాయి.ఇలా అన్నీ లింక్ బై లింక్ గా అన్ని సన్నివేశాలు వస్తున్నా మనసుకు హత్తుకునేట్లు రావటానికి రెండు బలమైన మాధ్యమాలుండనే ఉన్నాయి.
ఒకటి ఇళయరాజా నేపథ్య సంగీతం..
మరోటి పిసీశ్రీరాం చాయాగ్రహణం..
సినిమా చూస్తున్నంత సేపు మీరు అదే లొకేషన్ లో వున్నట్టు మైమరచిపోతారు..మౌనరాగం అంటూనే గుండెల్ని పీల్చిపిప్పి చేసే సంగీతం. కళ్ళకు హాయిగొలిపే అద్భుతమైన ఛాయాగ్రహణం ..
చెలీ రావా వరాలీవా,మల్లె పూల చల్లగాలి మంట రేపే సందె వేళలో ఈ రెండు పాటలు ఇంకా కొన్ని తరాలవరకూ వింటూనే వుంటారు.
రేవతి గారి కళ్ళతో చేసిన అభినయం, మోహన్‌గారి సెటిల్డ్ యాక్టింగ్, ఎవరు ఎంతవరకు నటన చెయ్యాలో కొలిసి మరీ 100% ఇచ్చేసిన సినిమా.
(సన్నివేశాలు రాయటం మొదలుపెడితే ఏ సన్నివేశాన్ని వదలినా నా తప్పు అవుతుంది అందుకు హాస్పిటల్ సన్నివేశం గురించి కాని, కాలేజ్ సీన్స్‌లో ఐలవ్‌యు కాని, తను దొంగతనం చేసింది అంతకుముందు ఆక్సిడెంట్ చేసిన వారికి హెల్ప్ చేద్దాం అని తెలిసినప్పుడు, చుట్టూ నాలుగు గోడల గురించి మాట్లాడే సన్నివేశం కాని, పైనుండి నీళ్ళు పోసే సన్నివేశం కాని, రేవతి నాన్నగారు ఆమె పెళ్ళికి ఒప్పుకుంది అని తెలిసినప్పుడు. దగ్గరకు రామ్మా నిజంగా ఇష్టం వుండే ఒప్పుకున్నావా అని అడిగే సన్నివేశం గురించి కాని లాస్ట్‌లో పేపర్స్ చింపేసి అవే అక్షింతలుగా ఎగిరే. ఇలా ఎన్ని చెప్పాలి)
చివరగా పైన ఇడియట్ లాంటి వ్యక్తి అన్నాను గుర్తుందా, అతనే కార్తీక్..
ఇతని పాత్ర పరిచయం అయినప్పటినుండి వుండే 15 నిముషాలు సీన్స్ యిప్పటికీ చూస్తూనే వున్నాం..( ఇడియట్ , ఇత్యాది సినిమాలకు మాతృక లాగా ఈ పదిహేను నిమిషాల కార్తీక్ క్యారెక్టర్..)
ఈ సినిమా చూసి నిజంగా అలాంటి ఇడియట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని భావించేవాళ్ళూ కూడా నాకు తెలుసు..
భర్తకి ఇబ్బంది కలిగితే భార్య పడే ఇబ్బంది, భార్యకి ఇబ్బంది కలిగితే భర్త పడే ఇబ్బంది చూసి ఇలాంటి భర్త మాకు దొరికితే మహాభాగ్యం అనుకున్న వాళ్ళూ నాకు తెలుసు..
బాలూ ఇక్బాల్
Comments