`పరారీలో ఉన్న బజారు బ్రాంచ్ మేనేజర్ లేఖ
`ఉన్నతాధికారవర్గాల్లో ఇప్పుడే దీనిపైనే చర్చ
`పాత ఆర్‌ఎం రాజు కుట్రలో బలిపశువులు
`బజారు బ్రాంచ్‌కు కొత్త బీఎం
‘అక్రమాలన్నీ ఆయనకు తెలుసు. రీజనల్ మేనేజర్ కార్యాలయం అప్రూవ్ చేసినవే ఈ రుణాలన్నీ. ఆయన చెబితేనే బినామీల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. కానీ నన్ను ఇందులో బలి చేసి, నాతో డబ్బులు కట్టించి తప్పుకోవాలని చూస్తున్నారు. ఇందులో అదృశ్య శక్తులు చాలా ఉన్నాయి’.. అంటూ నరసన్నపేట స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) బజారు బ్రాంచి మేనేజర్ శ్రీకర్ బ్యాంకు ఉన్నతాధికారులకు ఓ లేఖ రాసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ లేఖపైనే ఇప్పుడు బజార్ బ్రాంచ్ నుంచి ముంబైలోని బ్యాంకు హెడ్డాఫీస్ వరకు చర్చ జరుగుతోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నకిలీ రుణాల కుంభకోణం నేపథ్యంలో గత 15 రోజులుగా ఆచూకీ లేకుండాపోయిన బీఎం శ్రీకర్ స్థానంలో వీరఘట్టం నుంచి రామకృష్ణ అనే కొత్త మేనేజర్‌ను నరసన్నపేట బజారు బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బుధవారం ‘సత్యం’లో బజారు బ్రాంచిపై కథనం ప్రచురించిన తర్వాతే ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. మేనేజర్ లేకుండా బ్రాంచి ఎలా నడుస్తుందంటూ శనివారం రాత్రి కొత్త మేనేజర్‌కు పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. సోమవారం సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. బజారు బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణం వెలుగుచూసినా ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు బ్రాంచి మేనేజర్ శ్రీకర్‌తో రూ.65 లక్షల వరకు అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు కట్టించారు. దీంతో బ్యాంకులో బినామీల పేర్లతో స్వయంగా సిబ్బందే రుణాలు తీసుకున్నారని బ్యాంకు ఉన్నతాధికారులకు అర్థమైపోయింది. అయితే ఈ బ్రాంచి పరిధిలో ఎంతమేరకు నకిలీ రుణాలు బయటకు వెళ్లిపోయాయని తేల్చేందుకు ఆడిట్ చేస్తున్న అధికారులకు ఇప్పటికీ ఒక లెక్క చిక్కడంలేదు. గ్యారెంటీ కింద ఎటువంటి ఆస్తులు పెట్టకుండానే రూ.10లక్షల లోపు రుణాలు ఇచ్చే అధికారం బ్రాంచి మేనేజర్‌కు ఉంది. కానీ కోట్లలో రుణాలివ్వాలంటే ఆ మేరకు ఏదో ఒక ఆస్తిని గ్యారెంటీగా పెట్టుకొని ఇస్తారు. అయితే బ్యాంకులో కొన్ని రుణాలకు సంబంధించిన ఆస్తిపత్రాలు ఉన్నప్పటికీ రుణాన్ని మాత్రం సంబంధిత వ్యక్తులు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రతి నెలా వాయిదాలు వేర్వేరు చోట్ల నుంచి చెల్లించే వెసులుబాటు ఆన్‌లైన్ రూపంలో ఉండటం వల్ల అసలు ఈ రుణాలకు సంబంధించిన ఈఎంఐలను ఎవరు కడుతున్నారనేది తేలడంలేదు.
రాజుగారి చుట్టూ ఉచ్చు
ఈలోగా శ్రీకర్ ఈ కేసులో తనను మాత్రమే బలి చేయడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశారన్న అంశం ఇప్పుడు బ్యాంకు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముంబైలో ఉన్న కార్పొరేట్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు అందుకున్న పాత రీజనల్ మేనేజర్ రాజు అక్కడకు వెళ్లి తనకు ఈ ఉద్యోగం అవసరంలేదని, రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నట్టు భోగట్టా. అదే జరిగితే గార, నరసన్నపేట బజారు బ్రాంచిల్లో వెలుగుచూసిన కుంభకోణాల కేసుల్లో టీఆర్‌ఎం రాజు మీద క్రిమినల్ చర్యలు తప్పవు. గార బ్రాంచిలో కూడా టీఆర్‌ఎం రాజు సహకారంతోనే తాకట్టు నగలు మాయమయ్యాయి. దీనిపై మీడియా ఫోకస్ చేయడంతో తన ప్రమేయం లేదని ప్రకటించుకోవడానికి రాజు ఒంటరి మహిళ స్వప్నప్రియను బలి చేశారు. బంగారం తెచ్చి బ్యాంకులో అప్పజెప్పాలని ఒత్తిడి తేవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో టీఆర్‌ఎం రాజుకు మరింత వెసులుబాటు లభించింది. మొత్తం కేసును స్వప్నప్రియ మీదకు నెట్టేసి, పోలీసులను మేనేజ్ చేసి ఎంచక్కా రికవరీ చేసేశామని కాలరెగరేసే ప్రయత్నం చేశారు. నరసన్నపేట బజారు బ్రాంచి వ్యవహారం వెలుగుచూసిన తర్వాత కూడా ఇలాగే చేయాలని చూశారు. అయితే ఇక్కడ అలా కుదరకపోవడంతో ఇప్పుడు కథ బజారు బ్రాంచి నుంచి ముంబై వరకు చక్కర్లు కొడుతోంది. నరసన్నపేట బజారు బ్రాంచిలో బినామీల పేర్లతో రుణాలు తీసుకున్న టీఆర్‌ఎం రాజు అనుంగ సిబ్బంది ఆ సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా లేకపోవడం వల్ల కుంభకోణం వెలుగుచూసిన వెంటనే మొత్తం సొమ్ము కట్టలేకపోయారని భోగట్టా. అయితే నకిలీ రుణాల సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు? బ్యాంకు సొమ్ముతో కొన్న భూములు ఎవరి పేరిట ఉన్నాయి? అన్న విషయాలు మరో కథనంలో తెలుసుకుందాం.
Comments