top of page

రామరాజ్యంలో రాముడి ఇంట్లోనే దొంగలు పడ్డారు..!

  • Guest Writer
  • Jun 24
  • 3 min read

అయోధ్యలో భక్తులు హుండీలో వేసిన డబ్బు, బంగారం, వెండి లెక్కల్లో గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్లకు దేవుడిపై భయం లేకపోవడం ఆశ్చర్యమా? కాదు. ఎందుకంటే దేవుడి భయాన్ని నమ్మేది సామాన్య భక్తుడు. ఆ భయాన్ని వ్యాపారంగా మార్చేది మాత్రం ఫక్తు మత వ్యవస్థ. అందుకే ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది.

దేవుడి ఇంట్లోనే దొంగతనం ఆగకపోతే, రామరాజ్యం అనే కల్పనలో నిజంగా హిందూ సమాజనికి ఒరిగింది ఏమిటి?!? మిగిలింది ఏమిటి? మతం అనేది ప్రజల ఆలోచనలను కట్టడి చేసే ఒక ఎవర్‌గ్రీన్ అస్త్రం అని మరొక్క సారి నిరూపణ జరగడం తప్ప..

చారిత్రక పునరుక్తి... నాటి రామదాసు.. నేటి అయోధ్య..

‘చరిత్ర ప్రాసబద్ధంగా ఉంటుంది’ అనేది మార్క్ ట్వైన్‌కు ఆపాదించబడిన ఒక ప్రసిద్ధ సూక్తి. దీని అర్థం, చరిత్ర యథాతథంగా పునరావృతం కానప్పటికీ, దాని ఇతివృత్తాలు, ఫలితాలలో తరచుగా అద్భుతమైన సారూప్యతలు ఉంటాయి.

కొన్ని శతాబ్దాల క్రితం భద్రాచలంలో ఒక ఘట్టం జరిగింది. కంచెర్ల గోపన్న అనే ఒక భక్తుడు తానొక భ్రమలో బతికాడు. ప్రజల సొమ్మును దేవుడి గుడి కోసం వాడాడు. జైల్లో నిర్బంధిస్తే రాముడిని నిలదీస్తూ పాటలు పాడాడు. ఆ ఆభరణాలు ఎవడబ్బా సొమ్మని? నీ మామ సొమ్మా? అని ప్రశ్నించాడు. అక్కడ ఒక అమాయక భక్తుడి ఆవేదన ఉంది. కానీ నేటి అయోధ్యలో జరుగుతున్నది సంపూర్ణంగా తద్విరుద్ధం. ఇక్కడి పాత్రలకు తెలుసు అక్కడ ఉన్నది ఒక ప్రాణం లేని విగ్రహం మాత్రమే అని. ఆ రాయిని చూపిస్తూ మనుషులను దోపిడీ చేస్తున్నారు. నాడు దేవుడి కోసం సొమ్ము వాడి జైలుకు వెళ్తే, నేడు దేవుడి సొమ్మును సొంతానికి వాడుకుని రాజభోగాలు అనుభవిస్తున్నారు. మనుషుల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని వ్యవస్థలను ఎలా నడుపుతారో చెప్పడానికి ఇదొక చారిత్రక సాక్ష్యం.

అయోధ్య గుడిలో అకౌంట్ల గోల్‌మాల్...

అయోధ్య మందిర మాజీ అకౌంట్స్ ఇన్‌ఛార్జ్ మహిపాల్ సింగ్ బయటపెట్టిన విషయాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. భక్తి మత్తులో ఊగుతున్న సమాజానికి ఇవి చకితపరిచే నిజాలు. హుండీ కానుకలు, విరాళాల లెక్కింపులో దారుణమైన దోపిడీ జరుగుతోందని ఆయన ఆధారాలతో సహా ఆరోపించారు.

లెక్కింపు సమయంలో అసలు లెక్క 12 లక్షల రూపాయలు వస్తే, రికార్డు పుస్తకాల్లో 9 నుంచి 10 లక్షలు మాత్రమే రాస్తున్నట్లు ఆయన స్వయంగా చూశారు. ఇలా దాదాపు 7 కోట్ల రూపాయల నిధులు గల్లంతయ్యాయని ఆయన ఆరోపణ. ఈ అవినీతిని అడ్డుకోవడానికి, ట్రస్టు పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. ఫలితంగా మరుసటి రోజే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అంతటితో ఆగకుండా, తమ దొంగతనాలు బయటపడకుండా ఉండటానికి కొన్ని నెలల సీసీటీవీ ఫుటేజీని ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల రికార్డుల నిర్వహణలో.. ఎలాంటి పారదర్శకత లేదు. అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.

ట్రస్టు అధికారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, తీవ్రమైన ప్రజా ఒత్తిడి కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ దర్యాప్తు వేయక తప్పలేదు. ఆలయ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా ప్రాథమికంగా తమ నగదు లెక్కింపు సిబ్బంది తప్పు చేశారని ఒప్పుకున్నారు. ఒక సర్వాంతర్యామి అని ప్రచారం చేసుకునే దేవుడు తన సొంత గదిలో జరుగుతున్న దొంగతనాన్ని కూడా ఆపలేకపోవడం ఒక పెద్ద వ్యంగ్యం..

రాజకీయ చదరంగం.. రథయాత్ర నుంచి ప్రతిఘటన దాకా

ఈ దేవుడి బొమ్మ వెనుక ఒక పెద్ద రాజకీయ చదరంగం నడిచింది. 1980లలో రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్న ఒక పార్టీ, ఈ రాతి విగ్రహ ఉద్యమాన్ని వాడుకుని దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. రథయాత్రల పేరుతో దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టారు. మనుషుల మధ్య గోడలు కట్టారు. సెంటిమెంట్లను ఓట్లుగా మార్చుకున్నారు. దశాబ్దాల న్యాయ పోరాటాల తర్వాత 2019లో కోర్టు తీర్పు రావడం, 2024లో భారీ హంగులతో ప్రాణప్రతిష్ఠ చేయడం అంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగింది.

కానీ ప్రకృతి నియమం, మానవ చైతన్యం ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏ అయోధ్యనైతే రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారో, అదే అయోధ్య ప్రజలు 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. ప్రజలకు కావాల్సింది దేవుళ్లు, గుడులు కాదు.. కూడు, గుడ్డ, ఉపాధి అని నిరూపించారు. మతపరమైన భ్రమలు తొలగిపోవడానికి ఎంతో సమయం పట్టదనడానికి అయోధ్య ఎన్నికల ఫలితాలే ఒక సజీవ సాక్ష్యం. మందిర నిర్మాణం వల్ల అయోధ్య పర్యాటక కేంద్రంగా మారి ఉండవచ్చు, వ్యాపారాలు జరిగి ఉండవచ్చు. కానీ ఆ ఆధ్యాత్మికత వ్యాపారంలో నైతికత లేదు.

దేవుడిపై భయం ఎక్కడ?

ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటే, ఆ దోపిడీదారులకు దేవుడంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు లేని దేవుడికి భయపడాల్సిన అవసరం దొంగలకు ఏముంటుంది? దేవుడు శిక్షిస్తాడు, నరకానికి పంపుతాడు అనే భయాలు సామాన్య ప్రజలను లోబరుచుకోవడానికే అని ఈ మతాధికారులకు బాగా తెలుసు. అందుకే గుడి సంపదను నిస్సిగ్గుగా నమిలి మింగేస్తున్నారు.

నాడు రామదాసును రక్షించడానికి రాముడు రాలేదు, అది ఒక కల్పిత గాథ మాత్రమే. మరి ఈనాడు దొంగల చెరలో చిక్కుకున్న బాలరాముడిని కాపాడటానికి ఏ శక్తీ రాదు. ఎందుకంటే ఆ విగ్రహానికి చలనం లేదు. అయోధ్య లాంటి అతి పెద్ద కేంద్రంలోనే ఇలాంటి దోపిడీ సాగుతుంటే, దేశంలోని మిగిలిన వేలాది గుడుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. భక్తి అనేది ఒక అంధకారం. ఆ చీకట్లోనే ఇలాంటి మత గురువులు, దోపిడీదారులు సులభంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు.

దేవుడు అనేవాడు ఒక సృష్టికర్త కాదు. మనిషి తన సొంత అవసరాల కోసం సృష్టించుకున్న ఒక బొమ్మ మాత్రమే. చట్టాలు, కోర్టులు, దర్యాప్తు కమిటీలు ఈ మోసాలను తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. కానీ శాశ్వత పరిష్కారం మనుషుల ఆలోచనా విధానంలో మార్పు రావడం వల్లనే సాధ్యమవుతుంది. మతం అనే అంధవిశ్వాసం నుంచి సమాజం బయటకు వచ్చినప్పుడే అసలైన మానవత్వం వికసిస్తుంది. నైతికత, నిజాయితీ అనేవి దేవుడి భయం వల్ల రావు, హేతుబద్ధమైన ఆలోచన వల్ల వస్తాయి. రాతి విగ్రహాల చుట్టూ తిరగడం ఆపి, తోటి మనుషులను ప్రేమించడం నేర్చుకున్నప్పుడే సమాజంలో ఇలాంటి దోపిడీలు అంతమవుతాయి. అంతవరకు ఈ మతపరమైన నాటకాలు, రాజకీయ కుంభకోణాలు సాగుతూనే ఉంటాయి.

- నంబూరి చంద్రశేఖర్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page