రాముకు మరో గౌరవం.. నీతి ఆయోగ్‌లో స్థానం
- DV RAMANA
- Jul 17, 2024
- 3 min read
`జాతీయ సంస్థకు ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం
`ఇంతవరకు తెలుగు నేతలకు లభించని అరుదైన అవకాశం
`దేశ ప్రణాళికల రూపకల్పన, నిధుల పంపిణీలో కీలకపాత్ర
`శ్రీకాకుళం జిల్లాకు లభించిన మరో ఘనకీర్తి
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

చిన్న వయసులోనే కేంద్రమంత్రి పదవి చేపట్టిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు మరో కీలక పదవి వరించింది. జాతీయ ఆర్థిక విధానాలను నిర్దేశించే నీతి ఆయోగ్ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన నియమితులయ్యారు. అనుభవజ్ఞులైన మేధావులు, సీనియర్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఈ సంస్థకు ప్రత్యేక ఆహ్వానితుడిగా యువకుడైన రామ్మోహన్‌కు కేంద్రం చోటు కల్పించడం ఆయనకు ఢల్లీిలో లభిస్తున్న గుర్తింపు, గౌరవానికి నిదర్శనం. నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పటి నుంచి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి తప్ప ఇతర తెలుగు నాయకులకు ఇందులో చోటు లభించలేదు. ఇప్పుడు తొలిసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న రాము నీతి ఆయోగ్‌లో స్థానం పొందిన తొలి తెలుగు నేతగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తద్వారా శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడిరపజేశారు. ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొన్న దేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం వహించడమే కాకుండా మన రాష్ట్రానికి పథకాలు, నిధుల మంజూరు చేయించడంలో ప్రభావం చూపే అవకాశం, వెసులుబాటు లభిస్తాయని అంటున్నారు.
పాలకవర్గం పునర్వ్యవస్థీకరణ
సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి కేంద్రంలో మోదీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వమే మళ్లీ కొలువుదీరినా కేబినెట్‌లో పలువురు మంత్రులు మారారు. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పాలకమండలిని పునర్వ్యవస్థీకరించింది. దీనికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఉపాధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న సుమన్ భేరి కొనసాగుతారు. సభ్యులుగా వీకే సారస్వత్ (సైంటిస్ట్), రమేష్ చంద్ (వ్యవసాయ ఆర్థికవేత్త), వీకే పాల్ (చిన్నపిల్లల వైద్యనిపుణుడు), అరవింద్ వీరమణి (మేక్రో ఎకనమిస్ట్)లను నియమించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా గత పాలకవర్గంలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో పాటు కొత్తగా వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను నియమించారు. పాలకమండలి ప్రత్యేక ఆహానితులుగా రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పరిశ్రమలు ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రి జీతన్‌రామ్ మాంరీa, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్, గిరిజన సంక్షేమ మంత్రి జ్యూయల్ ఓరమ్, మహిళాశిశు సంక్షేమ మంత్రి అన్నపూర్ణాదేవి, ఆహార శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ నియమితులయ్యారు.
నీతి ఆయోగ్ అంటే ఏమిటి?
నీతి ఆయోగ్ సిఫార్సులు లేకుండా ఆర్థికపరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో నీతి ఆయోగ్ ప్రాముఖ్యత ఏమిటో ఈ వ్యాఖ్యలే వెల్లడిస్తున్నాయి. అంతెందుకు పార్లమెంటులోనే ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న అంశాన్ని పొందుపర్చినా.. నీతి ఆయోగ్ నిర్ణయం ప్రకారం ఇక దేశం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం తేల్చేసిందంటే నీతి ఆయోగ్ పాత్ర ఎంత నిర్ణయాత్మకమో అర్థం చేసుకోవచ్చు. నీతి ఆయోగ్ అంటే.. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా తెలుగులో చెప్పాలంటే.. భారత పరివర్తన జాతీయ సంస్థ అని అర్థం. గతంలో ఉన్న ప్రణాళిక సంఘం స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత దేశానికి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో పంచవర్ష ప్రణాళికలు రూపొందించి అమలు చేసేవారు. అయితే మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 2015 జనవరి ఒకటో తేదీన మోదీ సర్కారు ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు ప్రధానమంత్రి గౌరవ అధ్యక్షుడిగా ఉంటారు. ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈవో ఉంటారు. ఐదుగురు శాశ్వత సభ్యులు, ఇద్దరు స్వల్పకాల సభ్యులు(మేధావులు) ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. కేంద్ర కేబినెట్‌లోని నలుగురు సీనియర్ మంత్రులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా, మరికొందరు కేంద్రమంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు.
సలహాలు, సమన్వయం
మనది ఫెడరల్ వ్యవస్థ. దానికి అనుగుణంగా రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నదే దీని అర్థం. ఆ మేరకు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో సమన్వయం, సమతూకం పాటించేలా చూడటం, రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలు అందించడం నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యాలు. ఆర్థికాంశాలతో పాటు కీలకమైన జాతీయ, అంతర్జాతీయ అంశాల్లోనూ నీతి ఆయోగ్ సలహాలు ఇస్తుంటుంది. జాతీయ లక్ష్యాల సాధనలో రాష్ట్రాలకు చురుకైన పాత్ర, భాగస్వామ్యం కల్పిస్తుంది. ఆర్థిక వనరుల పంపకాల్లోనూ దిశానిర్దేశం చేస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రణాళికల రూపకల్పన, పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, వాటి అమలును పర్యవేక్షిస్తుంటుంది. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ ప్రయోజనాల పరిరక్షణ నీతి ఆయోగ్ ప్రధాన కర్తవ్యం. అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాల ద్వారా తగినంత లబ్ధి పొందలేకపోతున్న సామాజికవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి మరింత మెరుగైన కార్యక్రమాలను ప్రభుత్వాలకు సూచిస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం, భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగాన్ని పెంచడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. అంతటి కీలకమైన జాతీయ సంస్థకు కేంద్రమంత్రి హోదాలు కింజరాపు రాము ప్రత్యేక ఆహ్వానితుడిగా నామినేట్ కావడం మహత్తర అవకాశంగా చెప్పవచ్చు. యువకుల నవీన ఆలోచనలను అందిపుచ్చుకోవడం, యువశక్తిని దేశ ప్రణాళికల రూపకల్పనలో వినియోగించుకోవడమే లక్ష్యంగా కేంద్రం రాము, చిరాగ్ పాశ్వాన్ వంటి యువమంత్రులకు నీతి ఆయోగ్‌లో స్థానం కల్పించింది.
Comments