top of page

రిమ్స్‌కు కరెంటు కష్టాలు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 11
  • 1 min read
  • అరకొర ఎలక్ట్రీషియన్ పోస్టులతో ఇబ్బందులు

  • పేరుకు నాలుగు జనరేటర్లున్నా.. తరచూ మొరాయింపు

  • సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపని అధికారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఈ శీర్షిక చూసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(రిమ్స్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందేమోనని అనుకోనక్కర్లేదు. కానీ అటువంటి సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే పరిష్కరించే విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. దీనికి కారణం సుమారు వెయ్యి పడÅ£లున్న ఈ పెద్దాస్పత్రిలో ఒక్కరంటే ఒక్కరే రెగ్యులర్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు. మరో ఐదుగురు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తుండగా.. వీరిలోనూ ఒకరు అంబులెన్స్ డ్రైవర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఆస్పత్రిలో ఉన్న నాలుగు జనరేటర్లలో ఒకటి చెడిపోయి మూలన చేరగా.. ఒకదాని ఆటోమేటిక్ స్టార్టర్ మొరాయిస్తున్న పరిస్థితి. ఈ ఇబ్బందులను పరిష్కరిచడంలో అధికారులు మాత్రం నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న ఆరుగురు ఎలక్ట్రీషియన్లు చెరో ఇద్దరు చొప్పున మూడు షిప్టుల్లో పని చేస్తున్నారు. వీరిలో ఒకరు వీక్లీ ఆఫ్ లేదా సెలవు తీసుకుంటే ఇక ఆ షిఫ్టులో ఒక్కరితోనే నెట్టుకు రావాల్సిన దుస్థితి. అధికారులను అడిగితే ఎలక్ట్రీషియన్ల కొరత ఉన్నమాట వాస్తవమేనని, అదనపు నియామకాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామంటున్నారే తప్ప ఎప్పటికీ భర్తీ చేస్తారో చెప్పలేకపోతున్నారు. దీంతో కరెంటు పోతే జనరేటర్లు ఆన్ చేయడానికి ఎంఎన్‌వోలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఇక రిపేర్లు వస్తే వెంటవెంటనే చేయలేని పరిస్థితి ఉంది.

ఇక ఆస్పత్రిలో రెండు 250 కేవీ, మరో రెండు 320 కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్లు ఉన్నాయి. వీటిలో ఒకటి మరమ్మతులకు గురై నాలుగు నెలలుగా పని చేయడంలేదు. మరొకదాని ఆటోమేటిక్ ఆన్ స్విచ్ పని చేయకపోవడంతో మాన్యువల్‌గా స్టార్ట్ చేయాల్సి వస్తోంది. మిగతా రెండు పూర్తిస్థాయిలో విద్యుత్ అందించలేకపోతున్నాయని తెలిసింది. వీటికి రిపేర్లు చేయించడంలోనూ అధికారులు శ్రద్ధ చూపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే వెంటనే జనరేటర్లు ఆన్ చేయలేని పరిస్థితుల్లో రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక రాత్రిపూట అయితే అంథకారం అలుముకుంటుంది. దీనివల్ల అత్యవసర చికిత్సలు, ఆపరేషన్లకు అంతరాయం వాటిల్లే ప్రమాదం కూడా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగి తరచూ అంతరాయాలు ఏర్పడుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆస్పత్రిలో సగటున ఉండే 700 మంది ఇన్ పేషంట్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతానికైతే ఆపరేషన్లు చేసే సమయాల్లో సంబంధిత వైద్యులు ఎలక్ట్రీషియన్‌ను ముందే అప్రమత్తం చేస్తున్నారు. ఆ మేరకు ఆపరేషన్లు జరిగే సమయాల్లో సదరు ఎలక్ట్రీషియన్ జనరేటర్ వద్దే ఉండాల్సి వస్తున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జనరేటర్లకు మరమ్మతులు చేయించడంతో పాటు ఎలక్ట్రీషియన్ల నియామకానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page