top of page

రొయ్యమీసాలు తిప్పుతున్న మత్స్యశాఖ

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు

  • సీఏఏ నిబంధనలకు విరుద్ధంగా సాగు

  • నాలా లేకున్నా చెరువులకు అనుమతులు

  • శాఖలో అధికారులు కమీషన్లు కోసం కుమ్ములాటలు




(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దగనగళ్లపేట, పుక్కళ్లపేట మత్స్యకార గ్రామాలను తనలో కలుపుకోవడానికి ప్రతి ఏడాది వరదల సమయంలో స్థానికులను నాగావళి భయపెడతూ ఉంటుంది. దీనికి బలం చేరూర్చేలా అక్రమ రొయ్యలు చెరువులు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నాయని స్థానికులు విన్నవిస్తున్నా అధికారులు లెక్కచేయడం లేదు. సీఏఏ నిబంధనలకు విరుద్ధంగా చెరువులను తవ్వి రొయ్యలు సాగు చేస్తున్నారని స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాటిని అడ్డుకుంటున్నా మత్స్యశాఖ అధికారులకు పట్టడంలేదు. న్యాయ స్థానంలో అక్రమంగా సాగుచేస్తున్న రొయ్యల చెరువులపై స్థానికులు వేసిన వ్యాజ్యం పెండిరగ్‌లో ఉన్నా సీఏఏ జాయింట్‌ కమిటీ వాటిని రెన్యువల్‌ చేసేశారు. రెన్యువల్‌ చేసే అధికారం సీఏఏ జాయింట్‌ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావుకు ఉంది. కమిటీలో సభ్యులుగా వ్యవహరించే ఎఫ్‌డీవో గంగాధర రావుతో పాటు మిగతా సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎటువంటి వివాదం లేదని నివేదిక ఇచ్చి రెన్యువల్‌ కోసం సిఫార్సు చేయాలి. సిఫార్సు చేసిన తర్వాత దాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు రెన్యువల్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంది. రెన్యువల్‌ ఇచ్చిన మోపసుబందరు సర్వే నెంబర్‌ 115లోని 5.25 ఎకరాల రొయ్యల చెరువులపై హైకోర్టులో వివాదం నడుస్తోంది. హైకోర్టులో వివాదం నడుస్తున్నట్టు తెలిసినా మత్స్యశాఖ అధికారులు డబ్బులు తీసుకొని రెన్యువల్‌ ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే ఎదుట పంచాయితీ నడిచినట్టు తెలిసింది. దీనిపై డీడీ, ఎఫ్‌డీవో ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకున్నారు తప్ప రెన్యువల్‌ ఎలా చేస్తారని పీజీ పేట గ్రామస్తులు ప్రశ్నిస్తే.. ఎఫ్‌డీవో నివేదిక ప్రకారం సంతకం చేశానని డీడీ సమాధానం చెప్పారు. ఎఫ్‌డీవోను ప్రశ్నిస్తే.. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సిన బాధ్యత కన్వీనర్‌గా డీడీకి లేదా? అంటే సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఈ వ్యవహారంలో ఇద్దరూ దోషులేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ఖజానా నుంచి రూ.58 లక్షలు

పీజీ పేట సమీపంలో సముద్రంలో నాగావళి కలిసే ప్రాంతంలో లెక్కకు మించి చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్నారు. ఈ చెరువులన్నీ సీఏఏ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఎనిమిదేళ్లుగా స్థానికులు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, హైకోర్టులో పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు అక్రమార్కులతో అంటకాగుతున్నారు. న్యాయస్థానాలకు, ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తూ అక్రమాలకు వంతపాడుతున్నారు. రెండేళ్ల క్రితం గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి ఒక కమిటీ వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. స్థానికులతో మాట్లాడి వారినుంచి వివరణ తీసుకున్నారు. అంతకు ముందు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో 46 చెరువులను తొలగించినట్టు చూపించారు. అందుకోసం సుమారు రూ.58 లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేశారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అక్రమాలను తొలగించడానికి అక్రమంగా చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్న యాజమాన్యాల నుంచి ఆ మొత్తాన్ని వసూలుచేయాలి. అలా చేయకుండా 46 అక్రమంగా తవ్విన చెరువులను తొలగించడానికి అధికారులు ప్రభుత్వ డబ్బులను ఖర్చు చేశారు. మత్స్యశాఖ అధికారులు వారి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పెద్దగనగళ్లవానిపేట, పుక్కళ్లపేట పరిధిలో ఉన్న రొయ్యల చెరువులను నాలుగు కిటగిరిలుగా విడదీసి సీఏఏ నిబంధనలు విరుద్ధంగా అక్రమంగా తవ్వి సాగు చేస్తున్న రొయ్యల చెరువులకు అనుమతులు మంజూరు చేస్తున్నారు.

స్థానికులు బినామీలుగా సాగు

కోస్టల్‌ ఆక్వా అథార్టీ ప్రకారం పెద్దగనగళ్లవానిపేట, పుక్కళ్లపేటకు 500 మీటర్లు దూరంలో రొయ్యలు సాగు చెయ్యాలి. అలా కాకుండా కేవలం 70 మీటర్ల దూరంలోనే రొయ్యిలు చెరువులు సాగు చేస్తున్నారు. సాగుచేస్తూ వారంతా స్థానికులను బినామీలుగా పెట్టుకొని ఇతర ప్రాంతాలకు చెందినవారి అజమాయిషీలో నడుస్తున్నాయి. 2016 నుంచి ఈ ప్రాంతంలో రొయ్యల సాగు అక్రమంగా నిర్వహించడానికి స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోత్సాహమే కారణం. సముద్రానికి అతి సమీపంలో అన్‌ సర్వే ల్యాండ్‌లో 74 ఎకరాల్లో 48 చెరువులు ఉన్నాయి. వీటలో 46 హైకోర్టు ఆదేశాలతో తొలగించినట్టు చెబుతున్నా పూర్తిస్థాయిలో ధ్వంసం చేయలేదు. మరో ఇద్దరు రొయ్యల చెరువుల రైతులు హౖౖెకోర్టు ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లడంతో వాటి జోలికి వెళ్లలేదు. 7.19 ఎకరాల ప్రభుత్వ (పోరంబోకు) భూమిలో తవ్విన 7 రొయ్యల చెరువులు ఉన్నాయి. 12.15 ఎకరాల డి`పట్టా భూమిలో ఉన్న 9 రొయ్యల చెరువులు ఉన్నాయి. 39.86 ఎకరాల జిరాయితీ భూమిలో ఉన్న 28 చెరువులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌గా మార్చడానికి నాలా కట్టాలి. ప్రభుత్వ పోరంబోకు, డి`పట్టా భూమిలో అక్రమంగా తవ్విన చెరువులకు సీఏఏ అనుమతులు ఇచ్చేసి రొయ్యల వ్యాపారం చేయిస్తున్న ఘనత మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులదే.

కేటగిరీలుగా విభజించి

నాలుగు కేటగిరీలగా విభజించి రొయ్యలు సాగుచేస్తున్న చెరువులను కేటగిరి`ఎ లో సీఏఏ అనుమతులు ఉన్న 43 చెరువులు చేర్చారు. కేటగిరీ`బిలో మూడు నెలల కోసం రెన్యువల్‌ చేసిన 11 చెరువులను చేర్చారు. కేటగిరీ`సీలో అక్రమంగా రొయ్యలు సాగు చేస్తున్న రెండు చెరువులను చేర్చారు. కేటగిరీ`డీలో 46 చెరువులను నిబంధనలకు విరుద్ధంగా సముద్రంలో నాగావళి కలిసిన చోట అక్రమంగా రొయ్యలు సాగు చేస్తున్నారని 46 చెరువులను చూపించారు. వీటిని ధ్వంసం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రొయ్యల చెరువులన్నీ గ్రామానికి 500 మీటర్ల లోపే ఉన్నాయని అధికారికంగా మత్స్యశాఖ అధికారులు చూపిస్తున్నారు. అయితే వీటిని తవ్వినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్న తలెత్తుతుంది. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే తప్ప వాటిని అక్రమమని అధికారులు ప్రకటించకపోవడంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్‌జీటీ తీర్పు కోసం..

అధికారులు తొలగించినట్టు చెబుతున్న చెరువుల్లోనూ అనధికారికంగా రొయ్యల సాగు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్‌ సర్వే ల్యాండ్‌గా చూపిస్తున్న 57 ఎకరాల్లో కొత్తగా 34 రొయ్యలు చెరువులు ఉన్నా వాటి జోలికి అధికారులు వెళ్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే భూమిలో 17 ఎకరాల్లో 15 చెరువుల్లో దశాబ్ధ కాలంగా రొయ్యల సాగుచేస్తున్నారు. వీటి జోలికి అధికారులు వెళ్లడంలేదు. పెద్దగనగళ్లవానిపేట పరిధిలో చేపడుతున్న రొయ్యల సాగు అనధికారికంగా జరుగుతున్నా సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఈ చెరువుల నుంచే వచ్చే నీటిని నాగావళిలోకి విడిచిపెట్టడం వల్ల సమీప గ్రామాల్లో గ్రౌండ్‌ వాటర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు రావాల్సివుందని స్థానిక యువత చెబుతున్నారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలని అంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page