
సినిమాపరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాబ్ తరలిరావటానికి ప్రయత్నాలు జరుగుతున్న తొలిదశలో ‘‘భారత్‌బంద్’’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ‘‘బూర్గుల రామకృష్ణారావు భవనం’’ పరిసరాలలో జరుగుతుంది. అప్పటికి ఇప్పటిలా రద్దీ ఉండేదికాదు. సినిమాలో బంద్‌కి వ్యతిరేకంగా హీరో రెహమాన్(రఘు),సూర్య, జీడిగుంటశ్రీధర్ మరికొందరు జనాలను చైతన్యపరిచే సన్నివేశాలవి.
ఓ 150మంది జూనియర్ ఆర్టిస్టులనుకూడా ప్లకార్డ్‌లతో సిద్ధం చేశాము. అంతలో లోకల్‌మేనేజర్ వచ్చి డైరెక్టర్ గారితో ‘‘ ఇంకాసేపట్లో ప్రో రిజర్వేషన్స్, యాంటీ రిజర్వేషన్స్ ఉద్యమమాలు చేస్తున్న స్టూడెంట్స్ చెరొకవైపునుండి ఊరేగింపుగా ఇటువైపే వస్తున్నారట సర్’’ అనిచెప్పటంతో షూట్ ఆపేసి అందరూ ఓ చోట (ప్రస్తుత లుంబినీపార్క్ ఎదురుగ్గా) నిలుచున్నాం. ఓ 5 నిమిషాల్లో దూరం నుండి విద్యార్ధుల నినాదాలు వినిపించటం మొదలైంది. సినిమాని ప్రేమించే దర్శకుడికెప్పుడూ చిత్రీకరణ సమయంలో సర్వేంద్రియాలూ ‘‘సినిమా’’కోసమే పనిచేస్తాయి. కోడిరామకృష్ణగారికి ఓ ఆలోచన వచ్చింది. నిజమైన భావోద్వేగాలతో వస్తున్న విద్యార్థులలో వీళ్ళు కూడా కలిసివొస్తూ నినాదాలిస్తే... అది మన సన్నివేశానికి సరిగ్గా సరిపోతుంది. సహజంగానూ వస్తుంది... అనుకున్నారు.. అంతే... కెమేరామెన్ కోడిలక్ష్మన్‌గారు తన కెమేరా జూం లెన్స్ వేసి సిద్ధం చేశారు. ఉద్యమకారులు మలుపు తిరిగి వొస్తుండగానే దర్శకుడి సూచనతో హీరో బ్యాచ్ అందరూ సర్రున దూసుకుపోయి విద్యార్ధుల ముందు వరుసలో కలిసిపోయారు. అప్పటికి పాపులర్ నటులుకాకపోవటంతో విద్యార్ధులెవ్వరూ గుర్తుపట్టలేదు. కెమేరా హీరో బ్యాచ్‌కి జూం చేసింది.
షాట్ అద్భుతంగా సహజంగా వొస్తుందని సంబరపడుతున్నంతలో... ఓ వైపునుండి ఓ పోలీస్‌జీప్,ఓ పెద్దవ్యాన్ సర్రున దూసుకొచ్చి ఆగాయి అచ్చు సినిమాలలోలాగానే. లాఠీలతో దిగిన పోలీసులు రెహెమాన్‌నీ మిగతా నటులనీ జుట్టుపట్టుకుని కొందరినీ,చొక్కాలు పట్టుకుని కొందరినీ తిడుతూ, మేం యాక్టర్స్ అండి అనిచెబుతున్నా లాక్కెళ్ళి వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా అందరం అటువైపు పరిగెట్టాము. కోడిరామకృష్ణ గారిని గుర్తుపట్టిన పోలీసులు మీరెందుకొచ్చారిక్కడికి వెళ్ళిపోండి అంటూ తోసేశారు. వాళ్ళు మావాళ్ళు అంటున్నా వినిపించుకోకుండా వ్యాన్లోకి తోసేసి తీసుకెళ్ళిపోయారు. అయితే మమ్మల్నందరినీకూడా అరెస్ట్ చెయ్యండి అంటూ డైరెక్టర్ గారు మరో వ్యాన్ ఎక్కటంతో అందరమూ ఎక్కి పోలీసు జులుంకి వ్యతిరేకంగా నినాదాలిచ్చాము. మరో పది నిమిషాల్లో సినిమా యూనిట్ మొత్తం పోలీస్‌స్టేషన్‌లోవుంది. ఆ రోడ్లుమీద షూటింగ్‌కి మాకు పర్మిషన్ ఉంది. నటులమీద ఎలా చెయ్యిచేసుకుంటారు అంటూ డైరెక్టర్‌గారు, కె.ఆదిత్య (రచయిత,దర్శకుడు) గారు ఓ పక్క, శాంతిభద్రతల సమస్య అని పోలీసులు ఓపక్క .... వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. మా జూనియర్ ఆర్టిస్ట్‌లందరూ పోలీస్‌స్టేషన్ బైట బైఠాయించి నినాదాలివ్వటంతో నివ్వెరపోయారు పోలీసులు. వార్త ఎన్.టి.రామారావు (అప్పుడు ప్రతిపక్ష నాయకులు) గారి వరకూ చేరిపోయి వారి సెక్రెటరీ స్పందించటం, డి.రామానాయుడుగారు, ప్రతాప్ అర్ట్స్ కె.రాఘవగారు, భానుచందర్, వినోద్‌కుమార్, అశోక్‌కుమార్ ఇంకా ఎందరో వచ్చారు. పెద్దలు అందరినీ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఆవేశానికి స్పీడెక్కువ - ఆలోచనకి పవరెక్కువ. మాటలే మనసులను కలుపుతాయి - మాటలే మనుషుల్ని విడదీస్తాయి. నటులమీద చేయిచేసుకోవటం ముమ్మాటికీ మా తప్పే అన్నారు పోలీసులు. ఉద్యమకారులతో మావాళ్ళను కలపడం మాదికూడా తప్పేలెండి అన్నారు దర్శకులు.
అందరూ చేతులు కలిపారు... మరుసటిరోజు పేపర్లలో ‘‘భారత్‌బంద్’’ చిత్ర యూనిట్ అరెస్ట్ అని వచ్చిన పెద్దపెద్ద హెడ్డింగ్‌లు మాత్రం సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ అయ్యాయి. తరువాత షూటింగ్ జరిగినన్నిరోజులూ పోలీసులిచ్చిన సహకారం మరువలేనిది.
డైరెక్టర్ దేవీప్రసాద్.
.
Kommentarer