
ఆమె కుస్తీ బరిలోనే కాదు.. తమ సంఘంలోనే రాజ్యమేలుతున్న అధర్మం, అరాచకంపైనా తుదికంటా పోరాటం చేసింది. మహిళా రెజ్లర్స్‌కు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై తోటి క్రీడాకారిణులతో కలిసి పోరాటం చేసింది. ఎట్టకేలకు విజయం సాధించింది. దాని ఫలితంగానే జాతీయ రెజ్లింగ్ సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగి ఆరోపణలు ఎదుర్కొన్న నేత పదవి నుంచి తప్పుకోకతప్పలేదు. ఈ ఘనవిజయానికి కారకు ల్లో ఒకరైన వినేష్ పోగాట్ అంతర్జాతీయ వేదికపై మాత్రం రూల్స్ చట్రంలో చిక్కుకుని పరాజయం పాలైంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కోసం కళ్లు కాచేలా ఎదురుచూస్తున్న 145 కోట్ల మంది ప్రజల కళ్లలో బంగారు మెరుపులు చూసేందుకు తీవ్రంగా కష్టపడి ఫైనల్‌కు చేరింది. ఆమె జోరు చూసి స్వర్ణం ఖాయమని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఊహించని శరాఘాతం. వినేష్‌ను ఏకంగా ఫైనల్ పోటీలోనే పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు.. ఒలింపిక్ పోటీల నిర్వాహకులు. ఈ వార్త టీవీ ల్లోనూ, సోషల్ మీడియాలోనూ చూసి కోట్లాది భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి. ఫైనల్‌లో గెలిస్తే స్వర్ణం.. దురదృష్టవశాత్తు ఓడిపోయినా రజత పతకమైనా తీసుకొస్తుందనుకుంటే.. అసలు పోటీల్లోనే పాల్గొన కుండా చేయడం ఏమిటంటూ దేశమంతా ఒకటే ఆవేదన, అసంతృప్తి, ఆగ్రహం. ఆమె అనర్హతకు కారణం.. శరీర బరువు నిర్ణీత మోతాదు కంటే కేవలం వందంటే వంద గ్రాములు అధికంగా ఉండటమే. కుస్తీ పోటీల నిబంధనల ప్రకారం పోటీలకు ముందు ఆటగాళ్ల శరీర బరువును చూస్తారు. వారు ఏ కేటగిరీలో పాల్గొంటే కచ్చితంగా అంతే శరీర బరువు కలిగి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని ఒలింపిక్ పోటీ నిర్వాహ కులు చెబుతున్నారు. ఆ ప్రకారం మహిళల 50 కిలోల విభాగంలో పోటీపడుతూ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన మనదేశ రెజ్లర్ వినేష్ పోగాట్‌కు పరీక్షలు నిర్వహించినప్పుడు ఆమె నిర్ణీత 50 కేజీల కంటే వంద గ్రాములు ఎక్కువ బరువు ఉన్నట్లు తేలింది. అంతే.. ముందూవెనుకా చూడకుండా ఆమెను ఫైనల్‌లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసేశారు. అదేంటి.. ఏపాటి లెక్కలోకి రాని వంద గ్రాముల బరువు అధికంగా ఉన్నంత మాత్రాన తొలగించేస్తారా? అంటూ యావత్ భారత ప్రజానీకం విస్మయానికి, ఆగ్రహానికి గురైంది. భారత ఒలింపిక్ సంఘం ప్రతినిధులు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్వాహకులను, అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం ప్రతినిధులను కలిసి ఇదే విషయం ప్రస్తావిస్తే ‘ఏం చేస్తాం.. నిబంధనలు ఫాలో అవ్వాలి కదా? ఒక్కరి కోసం రూల్స్ మార్చలేం కదా?’ అని తేల్చేశారు. అయితే దీనిపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో తన బరువును నిర్ణీత ప్రమాణాల మేరకు కాపాడుకునేందుకు వినేష్, ఆమె శిక్షకులు, వైద్యులు నిర్వి రామంగా చేసిన కఠోర శ్రమ వృథా అయ్యింది. ప్రపంచ నెంబర్ వన్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అయిన జపాన్‌కు చెందిన యీ సుసాకీని, మరో ప్రపంచశ్రేణి రెజ్లర్ ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌లను మట్టికరిపించి ఫైనల్‌కు చేరిన వినేష్ పోగాట్(65వ ర్యాంకు) నిర్వాహకులు విసిరిన ఊహించని రివర్స్ పంచ్‌తో చతికిలపడిరది. ఫైనల్‌కు అర్హత సాధించిన తర్వాత వినేష్ శరీర బరువు అకస్మాత్తుగా పెరగడాన్ని ఆమెతో పాటు శిక్షకులు ముందురోజు గుర్తించారు. దాంతో అప్రమత్తమై ఆ రోజు రాత్రితెల్లవార్లు వినేష్‌తో సహా అందరూ జాగారం చేసి మరీ ఆమె శరీర బరువు నిర్ణీత ప్రమాణాల మేరకు తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. అందులో భాగంగా వినేష్ సైక్లింగ్‌తో సహా చాలారకాల కసరత్తులు రాత్రంతా చేస్తూనే ఉంది. చివరికి ఆమె శరీరం నుంచి రక్తం కూడా తీసేశారు. జత్తు కత్తిరించారు. ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదు. ఇంత చేసినా చివరికి బరువు పరీక్ష సమయానికి నిర్ణీత 50 కిలోల మీద కేవలం వంద గ్రాములు ఎక్కువ వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో ఆమాత్రం బరువు తగ్గడానికి అప్పటికప్పుడు ఒక గంట సమయం ఇస్తారని పలువురు ఒలింపియన్లు స్పష్టం చేస్తున్నారు. 2008లో పురుషుల విభాగంలో రెజ్లింగ్‌లో భారత్‌కు కాంస్యం అందించిన విజేందర్‌సింగ్ ఇదే విషయం చెబుతూ నిర్వాహకుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. బరువు కాస్త ఎక్కువగా ఉంటే స్టీమ్ బాత్ వంటి వాటి ద్వారా తగ్గించుకునేందుకు అవకాశం ఇస్తారని ఆయన అన్నాడు. కానీ అటువంటి అవకాశం ఇవ్వకుండా ఎంతో ప్రతిభ చూపి ఫైనల్ వరకు వచ్చిన వినేష్‌లాంటి ప్రతిభావంతురాలిని చివరి మెట్టుపై నుంచి ఉన్నఫళంగా కిందికి తోసేయడం న్యాయం కాదని ఆయన వ్యాఖ్యానించాడు. మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాతో పాటు అనేకమంది క్రీడా, సినీరంగ ప్రముఖులు వినేష్‌కు సంఫీుభావం ప్రకటిస్తున్నా ఒక సువర్ణావకాశం చేజారడం మాత్రం తీర్చలేని లోటే. భారత రెజ్లింగ్ సమాఖ అధ్యక్షుడిగా గతంలో ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ దాదాపు ఏడాది క్రితం తన తోటి మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచి రోడ్లపైకొచ్చి పోరాడిన చరిత్ర వినేష్‌ది. ఆ పోరాటంలో భాగంగా ప్రభుత్వం తనకు ఇచ్చిన ఖేల్‌రత్నా అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసింది. వివిధ పోటీల్లో సాధించిన పతకాలను గంగానదిలో విసిరేసేందుకు సిద్ధమైంది. చివరికి ఆ పోరాటం విజయం సాధించగలిగింది. అయితే తన సొంత క్రీడా రంగంలో మాత్రం రూల్స్ చట్రంలో చిక్కుకుని చివరి అంకంలో అనర్హతకు గురవడం వెనుక రాజకీయ కుట్ర కూడా ఉండి ఉండవచ్చన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినేష్ విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకుని ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
Great written