top of page

రెవెన్యూ కనికట్టు.. కోనేరు హాంఫట్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Aug 28
  • 3 min read
  • ఎస్‌ఎల్‌ఆర్‌లో నిక్షేపం.. భౌతికంగా మాయం

  • గత ప్రభుత్వంలో వరదగట్టులో కలిపి కొట్టేసిన వైకాపా నేత

  • అది జిరాయితీ భూమి అని సర్టిఫికెట్‌ ఇచ్చేసిన అధికారులు

  • షాపింగ్‌ కాంప్లెక్‌ నిర్మించి అద్దెలు దండుకుంటున్న నేత

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాజుగారి చేపల చెరువు సినిమాను తలపించేలా నగర శివారులో కొందురు ప్రబుద్ధులు రీక్రియేట్‌ చేశారు. బలగ సర్వే నెంబర్‌ 1/4లో ఉన్న 1.05 ఎకరాల కోనేరును దొంగలెత్తుకుపోయారట! అదేంటి.. కోనేరును ఎత్తుకుపోవడమేమిటి?.. అదేలా సాధ్యం అన్న అనుమానం కలగవచ్చు. కానీ ఇది స్థానికులో.. పత్రికలో అంటున్న మాట కాదు. సాక్షాత్తు శ్రీకాకుళం రెవెన్యూ సిబ్బంది తహసీల్దారుకు ఇచ్చిన నివేదికలో ఇదే చెప్పారు మరి! కోనేరు ఎక్కడ ఉందో చూపించగలరా? అని ప్రశ్నిస్తే.. దానికి వారి వద్ద సమాధానం లేదు. ఎస్‌ఎల్‌ఆర్‌లో ఉన్న కోనేరు భౌతికంగా మాత్రం కనిపించడం లేదు. దాన్ని కబ్జాదారులు మింగేశారు. కోనేరు వద్ద ఆక్రమించిన భూమిలో అది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని, వారం రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆదేశించినా సిబ్బంది ఖాతరు చేయలేదు.

బలగ పరిధిలో నాగావళి వరదగట్టును కొందరు కబ్జా చేసి దాని చుట్టూ కంచె కట్టి హద్దులు ఏర్పాటు చేసిన విషయాన్ని రెండేళ్ల క్రితమే ‘సత్యం’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన అప్పటి రెవెన్యూ అధికారులు దాన్ని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఆక్రమిత భూమిని ఫ్లాట్‌లుగా విభజించి నిర్మాణాలు చేపట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలపైనా ‘సత్యం’ వరుస కథనాలు ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు దిగువస్థాయి సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. భూమి స్వభావాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆక్రమణలపై రెండువారాల క్రితం ఆదివారంపేటకు చెందిన బోనెల చిరంజీవి కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న భూమి స్వభావంపై నివేదిక ఇవ్వాలన్న తహసీల్దార్‌ ఆదేశాల ప్రకారం మండల సర్వేయర్‌, ఆర్‌ఐ, వీఆర్‌వో, సచివాలయ సర్వేయర్లు కలిసి ఒక నివేదక తయారు చేశారు. 1.05 ఎకరాల విస్తీర్ణంలో కోనేరు ఉన్నా.. దాన్ని వరదగట్టుగా నమోదు చేసి నివేదికలో పొందుపర్చినట్టు విశ్వసనీయ సమాచారం. అక్కడే హెచ్చరిక బోర్డు పెట్టాలని ఆదేశించినా రెవెన్యూ సిబ్బంది స్పందించడం లేదు. బలగ సర్వే నెంబర్‌ ఒకటిలోని ఐదు సబ్‌ డివిజన్లలో 1/4 సర్వే నెంబర్‌ మినహా మిగతావి జిరాయితీగా తేల్చారు. వాస్తవంగా వరద గట్టు లోపలి భాగంలో జిరాయితీ భూమి ఉంది. దాన్నే ఇప్పుడు శ్రీకాకుళం` ఆమదాలవలస రోడ్డుకు ఆనుకుని రూ.కోట్లు విలువ చేసే జిరాయితీగా చూపించారు. ఈ వ్యవహారంపై అప్పటి ఉన్నతాధికారులు దృష్టి పెట్టడంతో తహసీల్దారు పొజిషన్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న వరదగట్టు తమకు వారసత్వంగా వచ్చిందని ఎవరూ రెండేళ్ల క్రితం వరకు రెవెన్యూ అధికారులను సంప్రదించలేదు. అలా అని ఆ భూమిలో సాగుకు ఆస్కారం లేదు. ఎందుకంటే.. వరదగట్టు కోసం ప్రభుత్వ సేకరించిన భూమి కావడం, అంతా గట్టులో కలిసి ఉండడమే.

రోడ్లు విస్తరణ సందట్లో..

శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తరించడానికి రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బి అధికారులు కొలతలు వేసిన సమయంలో అప్పటి అధికార పార్టీలో నాయకులుగా చెలామణీ అవుతున్న నలుగురు స్థానికులు ఆ భూమి వారసత్వంగా తమకు దఖలుపడిరదంటూ తెరపైకి వచ్చారు. తాతముత్తాతల నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వీరికి క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది సహకరించారు. ఆ తర్వాత రీసర్వేలో కొన్ని మార్పులు చేసి అంతా తమదేనంటూ అప్పటి ప్రజాప్రతినిధుల సహకారంతో వరద గట్టును చదును చేసి కంచె కట్టి హద్దులు వేశారు. అయితే ఈ వాదనను అప్పటి జిల్లా అధికారులు తిరస్కరించారు. కానీ ఇప్పుడు మళ్లీ కబ్జాదారులు రంగంలోకి దిగారు. ఆ భూమి తమదేనని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని, అది తమకు వారసత్వంగా వచ్చిందంటూ స్థానిక వీఆర్వో ద్వారా మంత్రాంగం నడిపారు. అయితే రెవెన్యూ సిబ్బంది, ఉద్యోగులు ఇచ్చిన తాజా నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు కోనేరు ఉంటే హద్దులు నిర్ణయించి బోర్డు ఏర్పాటు చేయాలని వీఆర్‌వో, ఆర్‌ఐకి నోటీసులు ఇచ్చారు. అక్కడ కోనేరు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా.. ఫిజికల్‌గా అది లేదని చెబుతున్నారు. ప్రభుత్వ కోనేరును కబ్జాదారులు వరద గట్టు తవ్వి క్రమంగా కప్పేశారు. రోడ్డు విస్తరణ సమయంలో యంత్రాలతో మట్టిని తవ్వి కోనేరును కప్పేశారు. ఈ విధంగా కోనేరు మట్టిలో కలిసి ఆక్రమణదారుల చేతిలో వెళ్లిపోయి ప్లాట్‌లుగా మారి విక్రయానికి సిద్ధమైంది. ఈ వ్యవహారాన్ని రెవెన్యూ సిబ్బంది, ఉద్యోగులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

వైకాపా నాయకుడికి రెవెన్యూ తోడ్పాటు

ఇదే కోవలో ఆదివారంపేట వద్ద బలగ రెవెన్యూ సర్వే నెంబర్‌ 23లో శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని జిరాయితీ బందగా చూపించి స్థానికంగా నాయకుడిగా చెలామణీ అవుతున్న వ్యక్తి వ్యాపార సముదాయాన్ని నిర్మించి ప్రతి నెల రూ.లక్షలు ఆదాయం జేబులో వేసుకుంటున్నారు. వరదగట్టుకు కంచె కట్టకముందు దీన్ని ఆక్రమించి రెవెన్యూ ఉద్యోగుల తోడ్పాటుతో నిర్మించారు. ఇప్పటికీ జిరాయితీ బందగానే రెవెన్యూ రికార్డుల్లో ఉంది. స్థానికులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. జిరాయితీ బంద ఒక కుటుంబానికి వారసత్వంగా దక్కినట్లు రెవెన్యూ అధికారులే చూపించి వ్యాపార సముదాయం నిర్మాణానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో సదరు వైకాపా నాయకుడు ఒక వ్యాపార సామ్రాజాన్ని ఏర్పాటు చేసి నాగావళి వరదగట్టు వద్ద ఉన్న 1.05 విస్తీర్ణంలోని కోనేరు కాజేసి కప్పేశారు. పోనీ మన రెవెన్యూ అధికారులు, పరపతి కలిగిన నాయకులు చెప్పినట్లు అదంతా జిరాయితీయే అనుకుందాం. కానీ బఫర్‌ జోన్‌, గ్రీన్‌ బెల్ట్‌ అనే చట్టాలు కొన్ని ఉన్నాయి. నదికి ఆనుకొని ఇప్పుడు ప్లాట్‌లు అమ్మడమేమిటో, నిర్మాణాలకు సిద్ధమవడమేమిటో రెవెన్యూ యంత్రాంగం చెబితే బాగుంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page