top of page

రాష్ట్రంలో రాజకీయ శూన్యత!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 18
  • 3 min read

అధికార కూటమి సంఖ్యాబలం సరిపోక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయినప్పటికీ.. దానిపై చర్చ, ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే డీలిమిటేషన్ అనేది జనాభా(డెమోగ్రాఫిక్) బాంబులా మారినట్లు కనిపిస్తున్నది. జానాభా దామాషా పద్ధతిలో జరిగే పునర్విభజన వల్ల సీట్ల విషయంలో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య భారీ వ్యత్యాసం చోటుచేసుకుంటుందన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్నది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడం వల్ల దక్షిణ భారతంలో జనాభా పెరుగుదల అదులోకి రాగా.. అదే సమయంలో కు.ని. సక్రమంగా అమలు కాని ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా బాగా పెరిగింది. దీని ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్షిణాదితో పోలిస్తే చాలా ఎక్కువగా పెరిగి పాలనా వ్యవహారాలు, నిధుల పంపిణీలో, ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియలోనూ సౌత్ రాష్ట్రాలకు ప్రాముఖ్యత తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. దక్షిణ భారతంలోని కర్ణాటక నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాలదీ ఇదే ఆందోళన. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ బిల్లును నల్ల చట్టం అని పిలవడం వెనుక ఈ భయమే కనిపిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా జీడీపీ ఆధారంగా రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను ఖరారు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ చేసిన ప్రతిపాదన వర్కౌట్ కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏదో విధంగా కేంద్రంతో ఫైట్ చేస్తుంటే మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రతిపక్షం వైకాపాతో సహా టీడీపీ, జనసేనలు మోదీకి గొడుగు పట్టడానికే పోటీ పడుతున్నాయి. పార్టీలు తమ మనుగడ కోసం రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెడుతున్నాయా? అన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒకరకమైన రాజకీయ శూన్యత (పొలిటికల్ వాక్యూమ్) ఏర్పడుతున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రెండూ కేంద్రానికి సబార్డినేట్స్ మాదిరిగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు ఛాయిస్ అనేది లేకుండా పోతున్నది. వైకాపా మూడు రాజధానులు, మావిగన్ మోడల్ అంటూ నిలకడలేమితో ప్రజలకు దూరమైంది. పాలక టీడీపీ-జనసేన కూటమి కేంద్రంతో దోస్తీ వల్ల చాలా విషయాల్లో కేంద్రంతో విభేదించలేక మౌనంగా ఉండిపోవాల్సి వస్తున్నది. దీనివల్ల ప్రతిపక్ష స్థానంలో శూన్యత ఏర్పడిందన్నమాట. ఒక రాష్ట్రంలో ఉన్న అదికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏదైనా అంశంపై ఒకే స్టాండ్ తీసుకుంటే.. అది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఒక శూన్యత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసినా అది ఢిల్లీ పెద్దలకు మద్దతుగానే మారుతుంది. కేంద్ర పెద్దల వద్ద రాష్ట్ర హక్కుల గురించి గట్టిగా అడగలేకపోతున్నారనే నెగిటివ్ ఫీలింగ్ కనుక ప్రజల్లో బలంగా నాటుకుపోతే అది తమిళనాడు తరహాలో ప్రాంతీయవాదం బలపడటానికి దారితీస్తుంది. ఇదే అదనుగా ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఒక కొత్త రాజకీయ లేదా సామాజిక వేదిక సిద్ధం కావచ్చు. అది మేధావుల నుంచి రావచ్చు లేదా సోషల్ మీడియా వేదికగా పుట్టిన ఉద్యమం కావచ్చు. రాజకీయాల్లో శూన్యత చాలా ప్రమాదకరం. అది అస్థిరతకు దారితీస్తుంది. రాష్ట్ర రాజకీయ పార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలి. ఢిల్లీ అధికారంలో భాగస్వామ్యం, నిధులు, పథకాల మంజూరుకు కేంద్రంలో సఖ్యంగా ఉండాల్సి రావచ్చు. కానీ గల్లీలో జనం నాడి పట్టుకోకపోతే చరిత్రలో కలిసిపోవడం ఖాయం. ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలు వెయిటింగ్ మోడ్‌లో ఉన్నాయి. కొత్త తరం నాయకత్వం ఈ శూన్యాన్ని భర్తీ చేస్తుందా లేక ఉన్న నాయకులే తమ పంథా మార్చుకుంటారా? అనేది ఇప్పటికిప్పుడు అంతుచిక్కని ప్రశ్న. కానీ రాజకీయాల్లో శూన్యత అనేది శాశ్వతం కాదు. ప్రజల్లో సహనం నశించినప్పుడు, మార్పు కోరుకున్నప్పుడు కచ్చితంగా మార్పు వస్తుంది. కొత్త నాయకత్వం తెరపైకి వస్తుంది. రాజకీయ పార్టీలు, నాయకులకు మనుగడ చాలా ముఖ్యం. దానికోసమే ఢిల్లీ ప్రభువుల అడుగులకు మడుగులొత్తుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ ఆత్మగౌరవం అనేది పెద్ద ఎన్నికల అంశంగా మారవచ్చు. ఢిల్లీకి తలొగ్గితే గల్లీలో ఓట్లు పడవనే భయం మొదలైతే తప్ప పార్టీలు తమ పంథా మార్చుకోవు. అటువంటి భయం కలిగించాల్సింది ప్రజలే. సోషల్ మీడియా పుణ్యాన ప్రజలు ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుందో, తమ హక్కులు ఎలా హరించుకుపోతున్నాయో నిశితంగా గమనించగలుగుతున్నారు. అందువల్ల మార్పు రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కొత్త నాయకత్వం అంటే జస్ట్ ఒక కొత్త పార్టీ పెట్టడం కాదు. ఒక బలమైన సిద్ధాంతంతో రావాలి. ప్రజామద్దతు బలంగా పొందగలిగేలా ఉండాలి. ఒకవేళ ఉన్న పార్టీలు తమ ‘సబార్డినేట’ ముద్రను వదిలించుకోకపోతే.. ఒక కొత్త ప్రాంతీయ పార్టీ లేదా పౌర ఉద్యమం రాజకీయాల్లోకి రావడం ఖాయం. గతంలో ఎన్టీఆర్ రాకకు ముందున్న పరిస్థితే దాదాపుగా ఇప్పుడు కనిపిస్తున్నది. అప్పట్లో కూడా ఒక రకమైన పొలిటికల్ వాక్యూమ్ ఉండేది. నాడు ఎన్టీఆర్ దాన్ని భర్తీ చేశారు. మరి ఇప్పుడు ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికి ప్రజలు మాత్రం ‘వెయిట్ అండ్ సీ’ మూడ్‌లో ఉన్నారు. నాయకులు మారతారో లేదో తెలియదు కానీ.. ప్రజల నిరసన మాత్రం అంతర్లీనంగా సెగలు కక్కుతోంది. అది ఎప్పుడు లావాలా ఉప్పొంగుతుందో ఎవరూ ఊహించలేరు. వచ్చే రెండేళ్లు చాలా కీలకం. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏపీ సీట్లు తగ్గకపోయినా.. ఉత్తరాదితో పోలిస్తే మన వెయిటేజీ తగ్గుతుంది. ఈ పాయింట్ మీద ఏ పార్టీ అయితే గట్టిగా నిలబడుతుందో, ఏ పార్టీ అయితే కేంద్రాన్ని ధైర్యంగా ప్రశ్నిస్తుందో,.రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందో.ఆ పార్టీకే భవిష్యత్తు ఉంటుందన్నది వాస్తవం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page