సత్యంన్యూస్, కొత్తూరు

రీ`సర్వే ముసుగులో రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన నిర్వాకం రైతులను సమస్యల సుడిగుండంలోకి నెట్టింది. అనేక చోట్ల ప్రభుత్వ భూమిని జిరాయితీగా చూపించి ఎల్‌పీఎం నెంబర్లను కేటాయించారు. మరికొన్ని చోట్ల ఉమ్మడి భూమిగా మార్చి యజమానుల పేర్లలో కొత్తవారిని చేర్చారు. సర్వేయరు, వీఆర్వో, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా భూముల రీసర్వే కాస్తా తప్పులతడకగా తయారైంది. ఈ వ్యవహారమంతా రెవెన్యూ అధికారుల జోక్యంతోనే సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల ఆర్డీవోలకు, తహసీల్దార్లకు ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. తహసీల్దారు కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. కొత్తూరు మండలం కర్లమ్మ రెవెన్యూ పరిధిలో జిరాయితీ భూమిని ప్రభుత్వ భూమిగా, ఒకరికే దఖలుపడిన భూమిని ఉమ్మడి ఆస్తిగా మార్చి నమోదు చేశారు. సంబంధం లేని వ్యక్తుల పేర్లతో వందలాది ఎకరాల భూమిని నమోదు చేసేశారు. ఒక రైతుకు చెందిన భూమిని రెండు భాగాలుగా విభజించారు. రికార్డుల నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించే కొర్లేషన్‌లో తప్పుగా నమోదు చేశారు.
కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో రీ`సర్వేలో అనేక మంది రైతులకు సంబంధించిన భూముల్లో గతంలో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణంతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. పలువురు రైతులకు సంబంధించిన పాస్‌బుక్‌లలో తమకు సంబంధం లేని సర్వే నెంబర్లను చేర్చి భూ విస్తీర్ణం పెంచి పాస్‌బుక్‌లు పంపిణీ చేశారు. దీంతో వివాదాల పరిష్కారం కోసం అంటూ చేపట్టిన రీసర్వే కాస్తా భూ వివాదాలను పెంచే విధంగా మారిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎందుకు చేశారని రైతులు అధికారులను ప్రశ్నిస్తే తర్వాత సరిచేస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇక్కడ సచివాలయం సర్వేయర్‌గా పనిచేసిన గిరిరాజు అక్రమాలు వెలుగులోకి రావడంతో సెలవుపై వెళ్లిపోయారని తెలిసింది. సర్వేయర్ నిర్వాకం వల్ల రైతుభరోసాకు, రుణాలు పొందడానికి, భూ క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో 221 మంది రైతులకు సంబంధించిన భూమిని ఉమ్మడి భూములుగా రెవెన్యూ రికార్డులో నమోదు చేశారు. ఈ ఉమ్మడి భూముల సమస్యలు జేసీ లాగిన్‌లోనే పరిష్కారమవుతాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు పరిష్కారం ఇప్పటికీ చూపించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చోడవరపు కొండలరావుకు చెందిన సర్వే నెంబరు 141/3లో 3.56 ఎకరాల భూమి ఉండగా, దీన్ని 2.25గా నమోదుచేసి ఈ కుటుంబం, ఈ భూమితో సంబంధం లేని నలుగురు పేర్లను చేర్చి ఉమ్మడి భూమిగా రికార్డుల్లో నమోదుచేశారు. దీంతో 1`బీ నిలిచిపోయింది.
పెద్దకోట యతీరాజుకు చెందిన సుమారు 7 ఎకరాలు భూమిని సర్వ్ నెంబరు 40/1లో 4.06 సెంట్లు, 369/12లో 3.86 ఎకరాలు వేరే వ్యక్తి పేరున నమోదు చేశారు.
పెద్దకోట గోవిందరాజకు చెందిన 3.5 ఎకరాల భూమిని సర్వెే నెంబరు 369/12లో 2 ఎకరాలు, 42/1లో 85 సెంట్లు, 43లో 30 సెంట్లను వేరే వ్యక్తి పేరు నమోదు చేశారు.
పెద్దకోట రామారావు చెందిన 5.7 ఎకరాల భూమిని సర్వేనెంబరు 345/1లో 3.31 సెంట్లు, సర్వే నెంబర్ 345/2లో 1.98 సెంట్ల భూమిని వేరే వ్యక్తి పేరున రీసర్వేలో నమోదు చేశారు.
చోడవరపు రాజుకు చెందిన భూమి సర్వే నెంబరు 141/4లో 3.5 ఎకరాలు ఉండగా 2.04 ఎకరాలుగా నమోదు చేశారు.
గేదెల క్రిష్ణారావు, సుధారాణిలకు చెందిన ఖాతా నెంబర్ 986, 562లలో ఉన్న 9.5 ఎకరాలు భూమి ఉండగా, కేవలం 50 సెంట్లు మాత్రమే రికార్డులు చూపిస్తుంది. ఈ భూమి కూడా వేరే వ్యక్తితో కలిపి ఉమ్మడి భూమిగా నమోదు చేశారు.
సర్వే నెంబర్ 204/5లో ఎద్దు వెంకటరమణకు 44 సెంట్లు ఉండగా, దీన్ని వేరే వ్యక్తి పేరున నమోదు చేసేశారు.
పెద్దకోట గోవర్ధన సర్వే నెంబర్ 154/5లో 30 సెంట్లు జిరాయితీ భూమిని గ్రామకంఠంగా చూపించారు. ఖాతా నెంబర్ 718లో చోడవరపు శ్రీరాములు మూడు ఎకరాలు విస్తీర్ణంలో కొంత మాత్రమే నమోదు చేశారు.
బోర లక్షణకు చెందిన సర్వే నెంబర్ 151/6లో 79 సెంట్లు, 156/1లో 25 సెంట్లు భూమిని వేరే వ్యక్తి పేరున నమోదు చేశారు.
ఇలా అనేక మంది రైతులకు చెందిన పూరా విస్తీర్ణాన్ని నమోదు చేయలేదు. నమోదు చేసిన భూమిని ఇతరులు పేరుతో రికార్డు చేశారు. బాధితులంతా కాళ్లరిగేలా తహసిల్దార్ కార్యాలయానికి, సచివాలయానికి తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. దీనిపై సిటు, రైతు సంఘాల ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళన చేస్తున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments