top of page

రీ-సర్వేలో లోపాలు.. వేలమంది విన్నపాలు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • అధికారుల చేతివాటంతో మారిపోయిన రికార్డులు

  • లోపెంట సర్వేయర్‌ సరెండర్‌

  • కర్లెంలో కొనసాగుతున్న పోరాటం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వైకాపా హయాంలో చేపట్టిన భూముల రీసర్వే లోపభూయిష్టంగా జరిగిందనడానికి రెవెన్యూ సదస్సులకు వస్తున్న ఫిర్యాదులే నిదర్శనం. అప్పుడే ఫిర్యాదులు వచ్చినా రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. సర్వేలో లోపాలను సరిచేస్తామని ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు. సర్వే సిబ్బందిపై పని ఒత్తిడి, సాంకేతిక కారణాల వల్ల అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. సర్వే చేపట్టిన రెవెన్యూ గ్రామాల్లో భూకొలతల్లో తేడాలు, సర్వే నెంబర్ల మార్పు, వారసుల పేర్ల నమోదు, సరిహద్దు సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు, రికార్డుల్లో తప్పులు, అడంగల్‌లో పేర్లు మార్పు, వారసత్వానికి బదులు కొనుగోలుగా నమోదు.. తదితర సమస్యలతో ఇప్పటికీ రైతులు గ్రామస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి గ్రామస్థాయిలో సచివాలయ సర్వేయర్లు, మండల సర్వేయర్‌, రెవెన్యూ సిబ్బంది చేతివాటమేనని ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద, డీ`పట్టా భూములను జిరాయితీగా చూపించారని విమర్శలు ఉన్నాయి. వైకాపా నాయకుల అండతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు జిల్లావ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. రీ`సర్వేలో వాస్తవానికి విరుద్ధంగా భూములతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను చొప్పించి రెవెన్యూ అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కొత్తూరు మండలం కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల పంట భూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు, సిబ్బంది తారుమారు చేశారు. రీ`సర్వేలో వేరొకరి పేరును చేర్చి రికార్డులను మార్చేశారు. దీనిపై రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు. ఇదే మాదిరిగా సోంపేట మండలం కొర్లాం రెవెన్యూ పరిధిలో అగ్రహారం చెరువు ఆయకట్టు కింద ఉన్న కొర్లాం, పాలవలస పంచాయతీలోని కుమ్మరిపాడు, లక్కవరానికి చెందిన సుమారు 160 మంది రైతులకు చెందిన 210 ఎకరాల జిరాయితీ భూమిని రీ`సర్వేలో ఒడిశాకు చెందిన వ్యక్తి పేరుతో నమోదుచేసి ఎల్‌సీఎంను జనరేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ అంశం జేసీ విచారణ చేస్తున్నారు. సుమారు నాలుగు నెలలుగా పెండిరగ్‌లో ఉంది. ప్రస్తుతం ఇలాంటి అక్రమాలు వేలల్లో ఉన్నాయి.

ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో లావేరు మండలం లోపెంట రెవెన్యూ గ్రామంలో జరిగిన రీ`సర్వేలో గ్రామ సర్వేయర్లు చేతివాటం చూపించినట్టు బాధితులు 2023 జూన్‌ 5న గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. లావేరు మండలంలో 18 గ్రామంలో రీ`సర్వే నిర్వహించగా అందులో లోపెంట రెవెన్యూ నుంచే ఎక్కువ ఫిర్యాదులు గ్రావెన్స్‌లో కలెక్టర్‌కు అందాయి. డీ`పట్టా భూములను జిరాయితీ భూములుగా మార్చడానికి రైతుల నుంచి పెద్ద మొత్తంలో గ్రామ సర్వేయర్‌ కొన్ని సుధీర్‌ వసూళ్లకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 29న కేశవరాయపాలెం నుంచి మరోసారి కొన్ని సుధీర్‌పై గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఆర్డీవోకు విచారణ చేయాలని ఆదేశించారు. దీన్ని సర్వేశాఖ ఏడీకి అప్పగించి పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించారు. సర్వే శాఖ ఏడీ మండల సర్వేయర్‌కు బాధ్యత అప్పగించి ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాన్ని పట్టించుకోకుండా సర్వే రిపోర్టు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత గ్రామ సర్వేయర్‌ కొన్ని సుధీర్‌ చేతివాటం చూపించారని క్షేత్రస్థాయి విచారణలో బాధిత రైతుల ఇచ్చిన వాంగ్మూలం పక్కన పెట్టి ఏడీ విజయ్‌కుమార్‌ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని గ్రీవెన్స్‌ను క్లోజ్‌ చేశారు. లోపెంట రెవెన్యూ గ్రామం రీ`సర్వేలో కొన్ని సుధీర్‌, కొన్ని సతీష్‌, బోర శైలజ, వీఆర్వో అంబటి మల్లేశ్వరరావు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని బాధిత రైతులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ నెల 16న లోపింటి గ్రామం నుంచి బి.గురుదేవి రీ`సర్వేలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేశారు. న్యాయస్థానంలో వివాదం నడుస్తున్న భూమిని వేరొకరి పేరుతో మార్చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఫిర్యాదులు లోపెంట రెవెన్యూ గ్రామం పరిధిలో వందల్లో ఉన్నాయని బాధిత రైతులు చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్న గ్రామ సర్వేయర్లు, వీఆర్వో కలిసి రైతుల పేర్లను తమకు నచ్చిన విధంగా మార్పులు చేసి భూములపై హక్కులు కట్టబెట్టారు. లోపెంట గ్రామ సర్వేయర్‌ శైలజ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లిపోవడంతో వీఆర్వో అంబటి మల్లేశ్వరరావుకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోవడంతో సర్వే బృందంలో డిప్యూటేషన్‌పై గ్రామ సర్వేయర్లుగా వచ్చిన కొన్ని సుధీర్‌, సతీష్‌ సోదరులు ఇద్దరూ భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని భూరికార్డులను తారుమారు చేశారని బాధిత రైతులు ఆరోపిస్తూ గ్రీవెన్స్‌లోనూ, ఆ తర్వాత ఇటీవల రీ`సర్వే గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఫిర్యాదు చేస్తున్నారు. లావేరు మండలంలో అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 7 వరకు రీ`సర్వే చేసిన 18 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 690 గ్రీవెన్స్‌ను రెవెన్యూ అధికారులు స్వీకరించారు. లోపెంటలో అక్టోబర్‌ 25న నిర్వహించిన గ్రామసభలో 87మంది రైతులు రీ`సర్వే తర్వాత జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. ఇందులో ఎక్కువగా విస్తీర్ణంలో మార్పులు, ఎల్‌ఎంపీలో వేరొకరి పేరు చేర్చడం, పట్టాదారులో వివరాలు తారుమారు, ప్రభుత్వ భూములను పట్టాభూములుగా చూపించడం తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ఈ లెక్కన ఆ రెవెన్యూ పరిధిలో ఎంతమంది బాధితులు ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

గ్రామ సర్వేయర్ల నిర్వాకం వల్ల రికార్డుల్లో పేర్లు మారిపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు అందక, ఈ`క్రాప్‌ జరగక నేటికీ ఇబ్బందులు పడుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లోపెంట రెవెన్యూ పరిధిలోని బాధిత రైతులు ఎన్నికల ముందు లావేరు తహసీల్దార్‌కు ఆధారాలతో సహా పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు సర్వేయరు కొన్ని సుధీర్‌ను ఏడీ సర్వేశాఖకు తహసీల్ధారు సరెండర్‌ చేశారు. అప్పటి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు ఇచ్చిన వాంగ్మూలాన్ని వీడియో తీసి ఏడీ సర్వే శాఖ అధికారికి అందజేశారు. వీటిని సర్వే అధికారులు పరిగణలోకి తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. సర్వేశాఖ ఏడీ అధికారులను సరెండరైన కొన్ని సుధీర్‌ మేనేజ్‌ చేసి శాఖపరమైన చర్యలు లేకుండా తప్పించుకున్నాడని బాధిత రైతులు చెబుతున్నారు. సరెండర్‌ చేసిన నెల రోజుల తర్వాత కాలు విరిగిందని మెడికల్‌ లీవ్‌ పెట్టి కొన్ని రోజులు మేనేజ్‌ చేశాడు. ఇంతలో ఎన్నికల ఫలితాలు రావడంతో కూటమి నాయకులను ఆశ్రయించిన సుధీర్‌ లావేరులో పోస్టింగ్‌కు ప్రయత్నించాడు. సుధీర్‌ను అందరూ తిరస్కరించడంతో స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించి చివరికి మురపాక సచివాలయానికి బదిలీపై వచ్చాడు. ఆ తర్వాత కూడా చేతివాటం చూపిస్తూ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడని రైతులు చెబుతున్నారు. లోపెంట రెవెన్యూ పరిధిలో సుధీర్‌ చేతివాటం చూపించి భారీస్థాయిలోనే కూడబెట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి. కూడబెట్టిన డబ్బులతో డీ`పట్టా భూములను, ఒక ఇంటిని కొనుగోలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. లోపెంటలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి రెవిన్యూ, సర్వే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. రెవెన్యూ గ్రామంలో ఉద్దేశపూర్వకంగా మార్చిన రికార్డులను సరిచేసి రైతులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page