రీసర్వేలో సోంపేట భూములు మాయం
విద్యుత్ సబ్‌స్టేషన్, కాలనీలు, ప్రైవేటువట
‘జగద్ధాత్రి’ మాదిరిగా పాత సీఎంవోలో బీజం
కలెక్టర్ సీసీతో సర్వం కానిచ్చేశారు
160 మంది రైతులు ఆందోళన బాట
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ`సర్వేను ఆ పార్టీ నాయకుల అండతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. రీ`సర్వేలో వాస్తవానికి విరుద్ధంగా భూములతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను చొప్పించి రెవెన్యూ అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కొత్తూరు మండలం కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల పంటభూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు, సిబ్బంది తారుమారు చేశారు. రీ`సర్వేలో వేరొకరి పేరును చేర్చి రికార్డులను మార్చేశారు. దీనిపై రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు.
ఇదే మాదిరిగా సోంపేట మండలం కొర్లాం రెవెన్యూ పరిధిలో అగ్రహారం చెరువు ఆయకట్టు కింద ఉన్న కొర్లాం, పాలవలస పంచాయతీలోని కుమ్మరిపాడు, లక్కవరానికి చెందిన సుమారు 160 మంది రైతుల 210 ఎకరాల జిరాయితీ భూమిని రీ`సర్వేలో ఒడిశాకు చెందిన భువనేశ్వర్ పాడి పేరుతో నమోదుచేసి ఎల్‌పీఎం (సర్వే నెంబరు లెక్క)ను జనరేట్ చేశారు. చిత్రమేమిటంటే కొర్లాం పంచాయతీ పరిధిలోని హుకుంపేట కాలనీలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కాలనీ, బారువ రోడ్డులో ఐదు ఎకరాల్లో నిర్మించిన ప్రభుత్వ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రీసర్వేలో భువనేశ్వర్ పాడి పేరు మీద మార్చేశారు. దీనికోసం అప్పటి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి వారికి అనుకూలమైన రెవెన్యూ అధికారిని బదిలీపై తీసుకువచ్చి రీసర్వే తంతును పూర్తిచేశారు. టెక్కలి వైకాపా నాయకుడిగా చెప్పుకునే వ్యక్తితో విశాఖ ఎంపీ ఒకరితో జిల్లా ఉన్నతాధిóకారులతో మాట్లాడిరచి ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ వైవీ ప్రసాద్ ద్వారా ఈ పనిని పూర్తి చేశారని భోగట్టా. డీటీగా ఉన్న ప్రసాద్‌కు తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించి సోంపేటకు తీసుకువెళ్లారు. దీని వెనుక రెవెన్యూ ఉన్నతాధికారుల హస్తముందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున భూ రికార్డులను మార్చే ప్రక్రియ ఒక్క రెవెన్యూ అధికారుల వల్లే కాదు. దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపిస్తూ సదరు రైతులు సోమవారం గ్రీవెన్స్‌లో జేసీకి వినతి అందించి న్యాయం చేయాలని కోరారు.
అంతా ముందస్తు పథకం మేరకే..
భూముల రీసర్వే ప్రారంభించిన సమయంలో ప్రణాళిక ప్రకారం ఒడిశాలోని గంజాం జిల్లా పాత్రుపురం పంచాయతీ జయంతిపురానికి చెందిన భువనేశ్వర పాడి వారసుడు క్రిష్ణచంద్ర పాడి కొర్లాం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 50 నుంచి 110 వరకు ఉన్న సుమారు 210 ఎకరాలను తమ భూమిని రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారని అప్పటి సీఎంవో అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు, స్థానిక తహసీల్దారుకు ఫి˜ిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తర్వాత భువనేశ్వర్ పాడి మనుమడు క్రిష్ణచంద్ర పాడి గత ఏడాది జూన్‌లో అప్పటి సోంపేట తహశీల్దార్ వైవీ ప్రసాద్‌ను కలిశారు. తర్వాత రైతుల పేర్ల స్థానంలో భువనేశ్వర్ పాడి పేరు నమోదైంది. ఆయన పేరు మీదనే 811, 812, 813, 814, 815, 816, 817, 819, 820, 821, 827, 872, 532 ఎల్‌పీ నెంబర్లు జనరేట్ చేశారు. సదరు భూమికి సంబంధించిన హక్కు పత్రాలు లేకపోయినా భువనేశ్వర్ పాడి కుమారుడు క్రిష్ణచంద్ర పాడి ఏం చెప్తే అది చేసేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు రూ.20లక్షలు తీసుకున్నారన్న విమర్శలున్నాయి. 1965లో భువనేశ్వర పాడి తండ్రి నుంచి కొనుగోలు చేసిన భూములపై 160 మంది రైతులకు పూర్తి స్వాధీన హక్కులు పొందారు. అప్పట్నుంచి రైతుల ఆధీనంలోనే ఉంది. వీరందరి వద్ద 1బి, అడంగల్ ఒరిజినల్ పత్రాలు ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు 160 మంది రైతుల పేరుతోనే జరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఈ`క్రాప్‌లో ఆ సర్వే నెంబర్లేలో సదరు రైతుల పేరుతో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుభరోసాను జమ చేస్తుంది. తిత్లీ సమయంలో పంటలకు పరిహారం కూడా అందించారు. పంటలకు ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. ఏ ఆధారం లేకుండా క్రిష్ణచంద్ర పాడి 210 ఎకరాల భూములను తనకు చెందినవని ఫిర్యాదు చేయడం, వాటిని రీసర్వేలో ఎల్‌పీ నెంబర్లు కేటాయించడం జరిగిపోయాయి.
రెవెన్యూ సిబ్బంది పాత్ర
ఈ వ్యవహారంలో సోంపేట సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ అదనపు బాధ్యతలతో తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం కలెక్టర్ సీసీగా విధులు నిర్వహిస్తున్న వైవీ ప్రసాద్, రీసర్వే డీటీ గౌరీశంకర్, మండల సర్వేయర్ తిరుపతిరావు, వీఆర్‌వో తిరుపతిరావు ప్రధాన సూత్రధారులని సోమవారం గ్రీవెన్స్‌లో జేసీకి రైతులు చెప్పుకొచ్చారు. రెవెన్యూ సిబ్బంది మాత్రం తాము రీసర్వే సమయంలో 160 మంది రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, ఆ తర్వాత భువనేశ్వరపాడి పేరుతో ఎల్‌సీఎం ఎలా నమోదయిందో తెలియదని చెబుతున్నారు. వంశపారంపర్యంగా సంక్రమించిన భూముల్లో 160 మంది రైతులు వరి, నువ్వు పంటలు సాగు చేస్తున్నారు. వైకాపా హయాంలో 2023 ఆగస్టులో అధికారులు చేపట్టిన భూసమగ్ర సర్వే సమయంలో 160 మంది రైతులను పొలాల్లోకి తీసుకొచ్చి ఫొటోలు తీసి వివరాలను నమోదు చేశారు. తమ భూములకు రక్షణ ఉంటుందని, శాశ్వత పట్టాలు పొందవచ్చని అంతా అనుకున్నారు. సరిగ్గా ఏడాది గడిచింది. బ్యాంకు రుణాల రెన్యువల్ కోసం 1బి, అడంగల్ కాపీలు సమర్పించాల్సి రావడంతో వారంతా మీ`సేవ కేంద్రాలకు వెళ్లారు. సర్వే నెంబర్లు చెప్పి తమకు ప్రింట్లు ఇవ్వాలని అడిగిన వారికి మీసేవా నిర్వాహకుల నుంచి ఊహించని సమాధానం ఎదురైంది.
అనుభవ హక్కులున్నా..
ఆ సర్వే నెంబర్లల్లో రైతుల పేర్లు లేవని, వేరే వ్యక్తి పేరు చూపుతోందని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. రైతులు స్థానిక తహశీల్దార్, పలాస ఆర్డీవో కార్యాలయాలకు వెళ్లి మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదు. రైతులు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులెవరూ స్పందించకపోవడంతో సోమవారం బాధిత రైతులు జేసీని కలిసి విన్నవించారు. దీనికి పరిష్కారం చూపించి న్యాయం చేయాలని కోరారు. జేసీకి సమస్యను విన్నవించడానికి వచ్చిన బాధిత రైతులను కలెక్టర్ సీసీ ప్రసాద్ కలిసి అంతా సర్దుకుంటుందని, వారం రోజుల్లో వ్యవహారం చక్కబెడతానని చెప్పి పంపించినట్లు బాధితులే చెబుతున్నారు. మీ-భూమి వెబ్‌సైట్‌లో రైతుల పేర్ల స్థానంలో భువనేశ్వర్ పాడి పేరుతో ఇనాం భూములుగా కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ భూములు సెటిల్డ్ ఇనాంగా ఎస్‌ఎల్‌ఆర్‌లో ఉన్నట్టు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. రైతుల వద్ద రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైతులతో పాటు భువనేశ్వర పాడి పేరును చేర్చి మొత్తం 13 ఎల్‌పీ నెంబర్లలో భూమితో పాటు సమీపంలోని కాలనీ, సబ్‌స్టేషన్‌తో కలిపి మొత్తం 250 ఎకరాలు లాక్ చేసినట్టు చెబుతున్నారు.

Comments