top of page

లక్కూ.. కిక్కూ అందరిదీ!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 14, 2024
  • 3 min read
  • టీడీపీ, వైకాపా, జనసేన సిండికేట్లకే షాపులు

  • పార్టీ వైరాలు విడిచి వ్యాపారాలు

  • వందలకొద్దీ దరఖాస్తులు వేసిన జిల్లా బయటి వ్యక్తులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ప్రైవేటు మద్యం దుకాణాలకు సోమవారం నిర్వహించిన లక్కీడ్రాలో అన్ని పార్టీల నేతలు కలిసి షాపులను సొంతం చేసుకున్నారు. తెల్లవారితే తమది పసుపు జెండా అని, తాము జగన్‌ వీరాభిమానులమని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నాయకులంతా మద్యం షాపుల కోసం ఒక్కటైపోయి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరికే షాపులు దక్కాయి. జిల్లాలో ప్రతీ ప్రాంతంలోనూ ఈ మూడు పార్టీల నేతలు కలిసి దరఖాస్తులు వేశారు. దీంతో ఎవరికి వచ్చినా షాపులు వీరి సిండికేట్లకు వచ్చినట్టే. అంటే లక్కూ, కిక్కూ రెండూ వీరికే. గతంలో ప్రైవేటు మద్యం పాలసీ ఉన్నప్పుడు, ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం చేస్తున్న వారితో ఇక్కడ టీడీపీ, వైకాపా, జనసేన నాయకులు జతకట్టారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 158 షాపులకు గాను 4671 దరఖాస్తులు వేశారు. ఏ షాపునకు ఎన్ని వేయాలి, ఏ షాపునకు ఎంత వ్యాపారం జరుగుతుంది అన్న లెక్కల మేరకు దరఖాస్తులు పడ్డాయి. జిల్లాలో మరెవరూ దరఖాస్తులు చేయడానికి వీళ్లేదని, కేవలం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులే షాపులు సొంతం చేసుకుంటారని కథనాలు వెలువడ్డాయి. కానీ అప్పుడే ‘సత్యం’ దీన్ని ఖండిరచింది. చివరకొచ్చేసరికి ఎవరూ ఆగరని, అంతా కలిసి అప్లికేషన్‌ వేస్తారని పేర్కొంది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. శ్రీకాకుళం నగరంతో పాటు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో జీవీ కృష్ణ Ê చౌదరి గ్రూప్‌తో టీడీపీ, వైకాపా నేతలు 70 షాపులకు దరఖాస్తులు వేశారు. ఇందులో 5 షాపులు వీరికి లక్కీడ్రాలో దక్కడంతో పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే.. 70 దరఖాస్తులు వేసినా ఒక్క షాపైనా వస్తుందన్న గ్యారెంటీ లేని డ్రా ఇది. 2014`19 ఎక్సైజ్‌ పాలసీలో నగరంలో పాత శ్రీకాకుళానికి చెందిన ఒక షాపు కోసం అప్పట్లో 12 దరఖాస్తులు పడ్డాయి. ఇందులో 10 దరఖాస్తులు ఒక వ్యక్తే వేశారు. కానీ మిగిలిన రెండు దరఖాస్తులు వేసినవారిలో ఒకరికి షాపు దక్కింది. ఇది పూర్తిగా లక్కు ఫేవర్‌ చేస్తే గానీ షాపులు రావు. అలాంటిది 70 దరఖాస్తులు వేసిన టీడీపీ, వైకాపా నేతలు ఐదు షాపులు దక్కడంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇక లావేరుకు చెందిన ఇజ్జాడ శ్రీను, నగరానికి చెందిన టంకాల బాలకృష్ణల కూటమిలో 400 దరఖాస్తులు వేస్తే, సోమవారం మధ్యాహ్నం నాటికి కేవలం ఐదు షాపులే వీరికి దక్కాయి. ఇందులో ఇజ్జాడ శ్రీను టీడీపీ కమ్‌ బీజేపీ కాగా, టంకాల బాలకృష్ణ వైకాపా నేత. ఇందులో కూడా అనేకమంది మూడు పార్టీల నేతలూ ఉన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అన్ని షాపులకూ, మరీ ముఖ్యంగా ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు ప్రాంతాల్లో హయ్యస్ట్‌ సేల్‌ ఉన్న షాపులకు ఎక్కడి నుంచో వచ్చిన చౌదరి గ్రూపు 300 దరఖాస్తులు వేసినట్లు తెలుస్తుంది. వీరికి ప్రస్తుతానికి ఐదు షాపులు దక్కాయి. శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ మద్యం సిండికేట్లలో తల దూర్చకపోవడంతో ఇక్కడ షాపుల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. అదే నరసన్నపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే బయటివారు రాకూడదనే అనధికార నిబంధన పెట్టడం వల్ల ఇక్కడ టీడీపీ నాయకుల కుటుంబ సభ్యుల పేరిటే మూడు షాపులు వచ్చాయి. ఇక మిగిలిన షాపులు కూడా బినామీ పేర్లతో వారికే వచ్చినట్లు భోగట్టా. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, నగరంలో ఎలక్ట్రికల్‌ షాపు నిర్వహిస్తున్న భైరి శ్రీను సిండికేట్‌కు కూడా పెద్ద ఎత్తున షాపులు లక్కీడ్రాలో వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులోనూ అన్ని పార్టీల నేతలూ ఉన్నారు. వైకాపా నాయకుడు మామిడి శ్రీకాంత్‌ సిండికేట్‌ 50 దరఖాస్తులు వేస్తే, రాజాం ప్రాంతంలో ఒక షాపు వచ్చింది. అలుగుబిల్లి నాగభూషణంకు ఆరు షాపులు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఇవన్నీ విజయనగరం జిల్లాకు చెందుతాయి. ఆమదాలవలసకు చెందిన గుండ లక్ష్మణ గ్రూపునకు శ్రీకాకుళం రూరల్‌, ఆమదాలవలసలో కలిసిన నాలుగు షాపులు వచ్చాయి.

జిల్లాలో మద్యం షాపులను లాటరీ పద్ధతిలో రెండేళ్ల కాలానికి కేటాయించే ప్రకియను సోమవారం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, శ్రీకాకుళం ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రారంభించారు. లాటరీ పద్ధతిలో షాపులకు డ్రా తీసి మొదటి వచ్చే నెంబర్‌కు షాపు కేటాయించి, తర్వాత రెండు నెంబర్లను రిజర్వులో పెట్టారు. డ్రాలో వచ్చిన నెంబరు గల వ్యక్తి సకాలంలో లైసెన్స్‌ రుసుములో ఆరోవంతు చెల్లించని పక్షంలో రిజర్వులో ఉన్నవారికి అవకాశం ఇవ్వడానికి నిర్ణయించారు.

డ్రా తీసే సమయంలో ఆరో నెంబరుకు, తొమ్మిదో నెంబరుకు మధ్య తేడా స్పష్టంగా రాయకపోవడం వల్ల మూడు షాపుల డ్రాల విషయంలో కన్ఫ్యూజ్‌ కావాల్సి వచ్చింది.

మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నవారిలో 40 శాతం మంది మహిళలు ఉన్నారు. షాపులు దక్కించుకున్నవారిలో 10 శాతం మంది మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం నగరం, మండలం పరిధిలో మొత్తం 32 మద్యం దుకాణాల్లో ఐదుగురు మహిళలు ఉండడం విశేషం. ఆమదాలవలస సర్కిల్‌ పరిధిలో ఆమదాలవలస షాపు నెంబర్‌ 40ను జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్‌ భార్య దానేటి రాధాదేవి దక్కించుకున్నారు. టెక్కలి, కోటబొమ్మాళిలో అడ్వకేట్‌ కింజరాపు అచ్చెన్నాయుడు భార్య పేరుతో నాలుగు షాపులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది కింజరాపు హరివరప్రసాద్‌ సిండికేట్‌లో భాగమని అంబేద్కర్‌ ఆడిటోరియంలో గుసగుసలు వినిపించాయి. ఈ కార్యక్రమంలో డీసీ డి.త్రినాథరెడ్డి, ఈఎస్‌ సీహెచ్‌ తిరుమలనాయుడు, సీఐలు శ్రీనివాసరావు, తహసీల్దారు గణపతి తదితరులు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page