top of page

లడ్డూ కావాలా ‘బాబు’!

Writer: ADMINADMIN
  • మూడు రాష్ట్రాల ఎన్నికల కోసమేనా?

  • దేశవ్యాప్తంగా ఏకమైన హిందువులు

  • మోడీ కోసం బాబు చేశారన్న వాదన

రాష్ట్రంలో తిరుపతి లడ్డూ రాజకీయం నిజంగా చంద్రబాబు బుర్ర నుంచి పుట్టిందేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా బాబు ఒక స్కెచ్‌ వేస్తే, దాని నుంచి బయటపడటం ఎవరి తరం కాదు. ఇప్పుడు తిరుపతి లడ్డూలో యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందని చంద్రబాబు ఆరోపణలు చేయడం వల్ల ఇప్పటికిప్పుడు ఆయనకొచ్చిన ప్రయోజనం చూస్తే ఏమీ లేదు. మరో ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవు. పోనీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆయన ఈ దుమారం రేపారని అనుకున్నా, అది కూడా మరో 18 నెలల వరకు లేదు. ఒకవేళ ఉన్నా.. గతసారి మందిబలంతో ఏకగ్రీవం చేసుకున్న వైకాపా మాదిరిగానే తెలుగుదేశం కూటమి ఏకగ్రీవంగా పంచాయతీల నుంచి జిల్లాపరిషత్‌ల వరకు అధికారాలను కైవసం చేసుకోవడం ఇప్పుడున్న రాజకీయాల్లో కష్టమూ కాదు, జగన్మోహన్‌రెడ్డి లెక్క ప్రకారం తప్పుకాదు. అటువంటప్పుడు చంద్రబాబు తమ ప్రభుత్వం వచ్చిన వంద రోజులకే ఇంత పెద్ద కుదుపును ఎందుకు తీసుకువచ్చారన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సోషల్‌ మీడియాలో గుర్రం సీతారాములు అభిప్రాయం ప్రకారం ప్రధాని మోడీ రాబోయే మూడు రాష్ట్రాల ఎన్నికల కోసం చంద్రబాబుకు లడ్డూసాయం అడిగినట్లు భావించాలి. హిందూ ఓటు పోలరైజ్‌ కోసం ఏకంగా అన్ని రాష్ట్రాల్లోనూ హిందువులు బీజేపీ వైపు నడిస్తే, ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ గట్టెక్కుతారు. బహుశా అందుకోసమే చంద్రబాబు ఈ లడ్డూ కథను తెర మీదకు తెచ్చివుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తడబడుతున్న చంద్రబాబు

చంద్రబాబు వెంటనే రంగంలోకి దుమికారు. పవిత్ర ప్రసాదంగా భావించే తిరుమల లడ్డులో పశువుల నెయ్యి కలిసిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి విచారణ చేయకుండా, వివాదం చేయడం ఈ ఎత్తుగడలో మొదటి భాగం. ఈ ప్రయత్నం ఇదే తొలిసారి కావడంతో కొంత తడబాటు తప్పలేదు. సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణ అధికారి (ఈఓ) నాణ్యత ప్రమాణాలు పాటించలేదని రెండు లోడ్ల నెయ్యిని వెనక్కి తిప్పి పంపేశామన్న మరునాడే ముఖ్యమంత్రి, ఆ నెయ్యి లడ్డూలకు వాడేశామన్నారు. ఆ ఆర్డరు పెట్టింది తమ ప్రభుత్వమేనని ఆయన చెప్పరు. నందిని నెయ్యి మంచిదని ఆయనే అంటారు, అంతకు ముందు నందిని నెయ్యిని తామే ఆపేశామని చెప్పరు. నాలుగొందలకు మంచి నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ఆయనే అంటారు, తమ హయాంలో మూడు వందలకే కొన్న సంగతి చెప్పరు. అసలు తిరుమలలో ల్యాబ్‌ లేదని ఆయనే అంటారు, అక్కడ నాణ్యతను నిర్ధారించే ల్యాబ్‌ ఉందని, వచ్చిన ప్రతి లోడ్‌నూ మూడు పర్యాయాలు పరిశీలించి సంతృప్తి చెందాకనే వాహనాన్ని లోపలికి అనుమతిస్తారని చెప్పరు. ఇదివరలో నా రాష్ట్రంలోకి సిబిఐని అడుగు పెట్టనివ్వనని ఆర్డర్లు వేసిన నోటితో సిబిఐ విచారణకు ఆదేశించరు. దేశమంతా నిండివున్న వెంకన్నస్వామి భక్తుల అనుమానాలు తీరేదెన్నడు? మంగళవారం వేకువ జామున అనంతపురం జిల్లా కనేకల్లు మండలంలోని హనకనహల్‌ గ్రామంలో రాముడి గుడిలోని రథం అగ్నిప్రమాదానికి గురైంది. ఇదీ మంటను రాజెయ్యడం. ఇక ఒక్కొక్కటే ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలు జరిపించే తుంటరులు ఎప్పటికీ పోలీసులకు చిక్కరు. అన్ని వేళ్లూ ఒకవైపే చూపిస్తుంటాయి. రాష్ట్రంలో మెజారిటీ పోలరైజేషన్‌ జరుగుతుంది. రాజకీయంగా మరెవరికో లాభం జరుగుతుంది. నష్టం రాష్ట్ర ప్రజల భవితకు.

మార్క్స్‌ ఎప్పుడో ఊహించాడు

పెట్టుబడిదారుడు తనకు 20 శాతం లాభం వస్తుందంటే తన విస్తరణ కాంక్షను ఊరు సరిహద్దు దాటిస్తాడు. 50 శాతం లాభం వస్తుందంటే వాడ దాటుతాడు. 80 శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటుతాడు. చివరకు తాను మరణిస్తే 100 శాతం లాభం వస్తుందని తెలిస్తే ఆ క్షణాన చంపడానికి చావడానికి ఆలోచించడని కార్ల్‌ మార్క్స్‌ 200 ఏళ్ల క్రితమే ఊహించాడు. అటువంటి వ్యాపారం జరుగుతున్న చోట నెయ్యిలో కల్తీలు కాక ఏముంటాయి? నెయ్యిని సరఫరా చేస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థను మార్చాలంటే కొత్త ప్రభుత్వం ఎటువంటి రాద్ధాంతం లేకుండా ఆ పని చేయొచ్చు. దేవస్థానంలో ఉన్న అధికారులను, బాధ్యులను లోపలెయ్యొచ్చు. వ్యాపారస్తుడు తన లాభం కోసమే బతుకుతాడు.. అది పాలైనా, పెరుగైనా, నెయ్యి అయినా. దేశం కోసం, ధర్మం కోసం కేవలం గడ్డి మాత్రమే తినే జంతువుల నుంచి పాలు పితికి నెయ్యి తియ్యాలి. అప్పటి వరకు ఏ నెయ్యి కొన్నా యానిమల్‌ ఫ్యాక్‌ కనిపిస్తునే ఉంటుంది.

సమ్మతి సృష్టి

ఉత్తరప్రదేశ్‌లో గోమాంసం పట్టుకు వెళ్తున్నాడనే అనుమానంతో పాతికమంది పెద్దలు పదహారేళ్ల ఇంటర్మీడియట్‌ కుర్రాడిని వెంబడిరచి హతమార్చారు. హత్యకు పాల్పడిన పాతికమంది యువకులు హిందువులనీ, హత్యకు గురైన ఆ యువకుడు ముస్లిం అనీ మనం ప్రస్తావించుకోనవసరం లేదు. మూకగా వెళ్లి చిన్న బృందాన్ని అనుమానం వస్తే చాలు చంపేయవచ్చన్నంత స్వేచ్ఛ లభించిన పాలన తీసుకువచ్చాం. అది అసలు తప్పు కాదన్న మనస్తత్వం మనకు ఈ పదేళ్లలో వచ్చేయడం ఉంది చూశారూ, అది గొప్ప విషయం! అదే ఉత్తరప్రదేశ్‌లో వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ మతాన్ని దుకాణం బోర్డుల మీద రాయాలని ఆజ్ఞాపించారు.

కొసమెరుపు

ఆంధ్రప్రదేశ్‌ రోజురోజుకు యుపికి చేరువవుతోందనే నమ్మకం మనకు కుదరాలంటే మన ఉప ముఖ్యమంత్రి ఎక్స్‌ (ట్విట్టర్‌) హ్యాండిల్‌ చూడాలి. కాస్త ఆలోచించే స్వభావమున్న ప్రకాష్‌రాజ్‌, కార్తీ లాంటివారు లడ్డు మీద చేసిన వ్యాఖ్యలకు ఈయన ఇచ్చిన సమాధానం: మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి. లేకపోతే మౌనంగా కూర్చోండి. అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరు’’. ప్రజలు అంటే మెజారిటీ ప్రజలు! అదీ మ్యాటరు!!

- సత్యం ఐటీ డెస్క్‌

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page