top of page

లత, ఆశ మధ్య పోటీకి తెరరూపం.. సాజ్!

  • Guest Writer
  • Apr 17
  • 2 min read

లత, ఆశా మధ్య ఎంత అక్కాచెల్లెళ్లైనా ప్రొఫెషనల్ పోటీ మాత్రం తప్పలేదు. పైకి వారిద్దరూ ఏనాడూ దాన్ని కనిపించకుండా దాచినా... నిప్పు లేందే పొగ రాదన్నట్టు వారి మధ్య గాయనీమణులుగా నెలకొన్న పోటీనే సినీ తెరపైకెక్కించారు దర్శకులు సాయి పరాంజపే. అదే సాజ్ గా మనముందుకొచ్చింది.

లత, ఆశా మధ్య యదార్థగాధను తీసుకునే సాజ్ సినిమా తీశారనే ప్రచారంతో కొంత వివాదాలనూ మూటగట్టుకుంది.

లత, ఆశ అమరగాయకులు. వారు పోయినా గీతాల రూపంలో వారు జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటారు.

తండ్రి మరణంతో ఆశ.. అక్క లతతో కలిసి 9 ఏళ్ల ప్రాయంలోనే కలిసి పనిచేయడం ఆరంభించింది. 1943లో తన పదేళ్ల ప్రాయంలోనే మరాఠీ చిత్ర మాజా బాల్ లో పాడింది. అప్పటికే లత నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. ఆశ అప్పుడే తన సినీ నేపథ్యగానాన్ని ప్రారంభించింది.

ఆశా కూడా నేపథ్య గాయనిగా క్లిక్ అయ్యాక.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య సహజంగానే పోటీ నెలకొంది. ముఖ్యంగా అందుకు ఎన్నో కారణాలు. ఓపీ నయ్యర్ వంటివారు లతతో పనిచేయనని భీష్మించడం.. ఆశాభోంస్లేకే అవకాశాలివ్వడంతో పాటు.. ఆశ కూడా తనకంటూ ప్రత్యేకమైన శైలితో దూసుకెళ్తుండటం అక్కగా లతకు ఒకింత ఆనందాన్నిచ్చినా.. ఎక్కడో ఒకింత ప్రొఫెషనల్ రైవల్రీకీ అవకాశం ఉండకపోదు.

కానీ, ఆశగానీ, లతగానీ ఇద్దరూ ఈ విషయాల్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఎవరైనా ప్రస్తావించినా కొట్టిపారేసేవారు. తోడబుట్టిన బంధం కంటే ప్రొఫెషన్ తమకు ఎక్కువ కాదని ఆశాభోంస్లే పలుమార్లు చెప్పుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

కొంతమంది మధ్యలోవాళ్లు ఉన్నవీ, లేనివన్నీ కలిపి కొత్త సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించేవారు. రక్తసంబంధం కన్నా బలమైంది ఇంకేదీలేదంటూ ఆశ మాట్లాడారు. కొన్ని కార్యక్రమాలకు ఇద్దరు కలిసి హాజరైనప్పుడు అక్క లతతోనే మాట్లాడేవాళ్లని.. తనను పట్టించుకోకపోయేవారనీ ఆశ చెప్పారు. ఆ తర్వాత తామిద్దరం అలాంటి సంఘటనలను తల్చుకుని నవ్వుకునేవాళ్లమనేదీ ఆశ అభిప్రాయం.

సాజ్ సినిమాతో అక్కాచెల్లెళ్ల ప్రొఫెషనల్ రైవల్రీపై మరింత చర్చ!

1998లో సాయి పరాంజపే సాజ్ నిర్మించారు. లత, ఆశా మధ్య నెలకొన్న వృత్తిపరమైన పోటీనే సాజ్ సినిమా ప్రధాన ఇతివృత్తం. అదే ప్రేరణగా సినిమా తెరకెక్కింది.

అరుణా ఇరానీ లతా మంగేష్కర్ పాత్రలో కనిపించగా.. షబానా ఆజ్మీ ఆశాభోంస్లే పాత్రతో మురిపించింది. ప్రముఖ తబలా విద్వాంసుడు, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్ ఆర్డీ బర్మన్ పాత్రలో కనిపించిన విశేషమైన చిత్రమిది.

చిన్న చెల్లెలైన ఆశాభోంస్లే అక్క లతా మంగేష్కర్ నీడ నుంచి బయటపడటానికి చేసే యత్నంగా ఈ సినిమాను నడిపించారు.

సాజ్ పై ఆశా ఏమన్నారు..?

ఆ సినిమా ఓ కల్పితం. నిజం కానే కాదు. ఇద్దరు మహిళలకు పొడవాటి జడలు పెట్టి, ఏవో కొన్ని ఘట్టాలను తీసుకుని మూడు గంటల సినిమా చేయడం సమయం వృథా అంటూ సాజ్ గురించి కొట్టిపారేశారు.

మరి ఆ తర్వాత దర్శకుడేమన్నారు..?

సాజ్ పూర్తిగా కల్పిత కథేనని సాయి పరాంజపే చెప్పారు. అద్బుతమైన గాత్రాలు కల్గిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే వృత్తిగతమైన పోటీనే తప్ప.. అధి ఎవ్వరి బయోపిక్ కాదని సమర్థించుకున్నారు. కానీ, సినిమాలో అరుణా ఇరానీ, షబానా ఆజ్మీ, జాకీర్ హుస్సేన్ పాత్రలను చూసినప్పుడు కచ్చితంగా సాజ్ లతా, ఆశల లైఫ్ స్టోరీని ప్రేరణగా తీసుకుని రూపొందించిందేనని రూఢీ అవుతుంది. అందుకే, సాజ్ రిలీజ్ సందర్భంలో వివాదాలకు తెరలేచింది.

లతా, ఆశ సింగింగ్ జర్నీ!

ఆశాభోంస్లే, లతా మంగేష్కర్ కలిసి 1968లో వచ్చిన పడోసన్ సినిమాలో మై చలి మై చలితో పాటు.. 1978లో వచ్చిన మై తుల్సీ తేరే ఆంగన్ కీ సినిమాలోని ఛాప్ తిలక్ సబ్ వంటి కొన్ని పాటలు కలిసి పాడారు.

లతతో పాడేటప్పుడు ఆశా అనుభవాలు!

దీదీతో పాడేటప్పుడు జాగ్రత్తగా ఉండేదాన్ని. ఆమె పాటలో ఏ కొత్త గమకాన్ని జోడిస్తారో.. ఎలా ఎత్తుకుంటారో అని ఆలోచించేదాన్ని. మేమిద్దరమూ పాటల్లో మా మా ప్రత్యేకతలను చూపే అలవాటు చేసుకున్నాం. అక్క పాటలు విని ఆ ఒత్తిడి నాపై ఇంకా ఎక్కువ ఉండేదని ఆశా చెప్పుకొచ్చేవారు.

మా ఇద్దరి మధ్యా పోటీ ఉండేది. కానీ, అది పూర్తిగా ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే. అదే మా పాటలను, కెరీర్ ను మరింత మెరుగ్గా కొనసాగించేందుకు ఉపయోగపడిందనేది ఆశ.

- బాతాఖానీ.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page