ఇసుక డిమాండ్‌తో ‘దేశం’ నేతలకు కాసుల పంట
వైకాపా బాటలోనే టీడీపీ కేడర్
వాహనాలు సీజ్ చేసినా మారని సీన్
సీజ్ చేసిన ఇసుకతో ప్రత్యేక దందా
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒకే ఒక్క ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. అదీ నారాయణపురం ఆనకట్టలో ఇసుక పూడికను తీసి బూర్జ మండలం కాఖండ్యాంలో స్టాక్‌పాయింట్‌కు చేర్చడం. అక్కడి నుంచే ఇటు రణస్థలం, అటు ఇచ్ఛాపురం వరకు సరఫరా చేయాలి. శ్రీకాకుళం రూరల్ మండలం, గారల్లో ఎటువంటి స్టాక్ పాయింట్లు, రీచ్‌లకు అనుమతి ఇవ్వలేదు. గారలో ఇటువంటి పూడిక తొలగింపునకే ఒక అనుమతి వచ్చినా, మాన్యువల్‌గా ఎత్తాలనే నిబంధన ఉండటం వల్ల లేబర్ ఛార్జి పెరిగి ఇసుక ధర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు సరఫరా చేయలేమని, మిషిన్ల ద్వారా ఎత్తుకోడానికి అనుమతి కోరడంతో ఇక్కడి నుంచి ఎటువంటి తవ్వకాలు జరగడంలేదు. దీంతో కాఖండ్యాం ఒక్కడే లెక్కల ప్రకారం అధికారికంగా ఇసుకను విక్రయించే పాయింట్. కానీ గార మండలం బూరవల్లి, అంబళ్లవలసలో గతంలో అక్రమంగా తవ్వారని సీజ్ చేసిన ఇసుకను నెల రోజులుగా విశాఖకు వందల టన్నులు తరలించుకుపోతున్నారు. దీనిపై మొదటి నుంచి బూరవల్లి, అంబళ్లవలస, సాలిహుండం గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చల్లార్చేందుకు స్థానిక టీడీపీ నాయకులు ట్రాక్టర్ల యజమానులకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇసుకను తరలించుకుపోయినా డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రతిరోజు బూరవల్లి టీడీపీ నాయకుడు ఇంటికి డబ్బుల కోసం ట్రాక్టర్ల యజమానులు క్యూ కడుతున్నారని తెలిసింది. వాస్తవానికి ఇక్కడి నుంచి తరలిపోతున్న ఇసుక ఇక్కడిది కాదు. అప్పట్లో వంశధారకు ఆవలి వైపు ఉన్న నరసన్నపేట మండలం గోపాలపెంటకు నదిలో బాటలు వేసి ఇసుకను తవ్వి అక్కడి నుంచి బూరవల్లి ఒడ్డుకు తరలించి గుట్టలుగా వేశారు. ఇప్పుడు దీన్నే దశల వారీగా విశాఖకు రవాణా చేస్తూ వచ్చారు. గోపాలపెంట నుంచి బూరవిల్లి వైపు వేసిన ఇసుక పోగులు అక్రమమని రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తే రైల్వే అవసరాల కోసమని ఒక అనుమతి కాగితం చూపించి అంతకు పదింతలు నిల్వలు తరలించుకుపోయారు.
జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేనందున అక్రమార్కులకు జేబు నిండా డబ్బు చేరుతోంది. ఉచిత ఇసుక ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అమలులో లోపాల కారణంగా అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఏ ఇసుక విధానమైతే గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిందో, ఇప్పుడు అదే ఇసుకతో టీడీపీ నాయకులు తమ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారు. ఇసుక డిమాండ్‌ను బట్టి డబ్బులు గుంజుతున్నారు. ప్రతి రోజు జిల్లాలో పదుల సంఖ్యలో లారీలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఉన్న అన్ని ఒడ్డుల నుంచి భారీ మొత్తంలో ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నట్టు అర్థమవుతుంది. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఇసుక ర్యాంపుల్లో ఈ దందా మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే డిమాండ్‌ను బట్టి రూ.5 వేల నుంచి రూ.6వేలు చెల్లిస్తున్నారు. 20 టన్నుల లారీకి రూ.6,700కు స్టాక్‌యార్ట్ వద్ద అధికారికంగా లోడ్ చేస్తున్నారు. అనధికారికంగా మరో 10 టన్నుల ఇసుకను అదనంగా లోడ్ చేస్తున్నారు. దీనికోసం అక్కడ సిబ్బంది రూ.వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. 20 టన్నుల లారీ లోడ్ చేసి రోడ్డు మీదకు రావడానికి సుమారు రూ.30వేలు ఖర్చు చేస్తున్నారు. వీటిని విశాఖకు తరలించుకుపోయి రూ.70వేలకు విక్రయిస్తున్నారు.
జిల్లా పరిధిలో నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదుల పరిధిలో 28చోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నట్లు నిఘావర్గాల భోగట్టా. వీటిని ఆయా నియోజకవర్గాల పరిధిలో కూటమి నాయకుల కనుసన్నల్లో ట్రాక్టర్లు, లారీల్లో లోడ్ చేసి తరలించుకుపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేయకుండా నిలువరించేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను టీడీపీ నాయకులే తూట్లు పొడుస్తున్నారు.
మంగళవారం ఉదయం బైరి రీచ్ నుంచి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్న ట్రాక్టర్‌ను బైరి బస్టాండ్ వద్ద అక్కడ ఉన్న కానిస్టేబుల్ అడ్డగించి, డ్రైవర్‌తో బేరం కుదిరిన తర్వాత వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే రోజు రాత్రి దూసి నుంచి వస్తున్న రెండు లారీలను సీజ్ చేశారు. అంతకు ముందు సోమవారం రాత్రి వన్ టౌన్ సీఐ రోడ్డు మీద కాపుకాసి భైరి నుంచి ఇసుక లోడ్‌తో విశాఖకు వెళుతున్న రెండు లారీలను పట్టుకొని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్టి కేసు నమోదు చేశారు. అలాగే కొత్తరోడ్డు వద్ద మూడు లారీలను అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఐ రోడ్డు మీద కాపుకాసి అడ్డుకున్నారు కాబట్టి ఇసుకను విశాఖకు అక్రమంగా తరలించే లారీలు దొరికాయి. అధికారులు రోడ్డు ఎక్కితే తప్ప అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటుతున్న ఇసుక లారీలను అడ్డుకోవడం లేదు. ఈ లెక్కన అనధికారిక ర్యాంపుల నుంచి ఎంత మొత్తంలో ఇసుక విశాఖకు తరలిపోతుందో అర్ధమవుతుంది.

Comments