top of page

లెక్క మారదు.. టెక్కలి చిక్కదు!

Writer: NVS PRASADNVS PRASAD
  • `వ్యూహాత్మక తప్పిదాలతోనే వైకాపాకు గండి

  • `అభ్యర్థులను పరస్పరం మార్చడమే అసలు లోపం

  • `దువ్వాడకు సొంత పార్టీ, ఇంట్లోనే ప్రత్యర్థులు

  • `గతం కంటే బలం పెంచుకున్న అచ్చెన్నాయుడు

అసెంబ్లీలో సందర్భం వచ్చిన ప్రతిసారీ తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై విరుచుకుపడిపోయే మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఓడిరచడానికి జగన్మోహన్‌రెడ్డి వేసిన వ్యూహం తొలినుంచీ బెడిసికొడుతోంది. అచ్చెన్నాయుడును తీవ్ర పదజాలంతో విమర్శించడానికే ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను సరిపోతున్నారు తప్ప.. ప్రజాక్షేత్రంలో ఆయన్ను ఓడిరచడానికి మాత్రం దువ్వాడ బలం సరిపోవడంలేదు. ఈ విషయం తెలిసినా కూడా దాగుడుమూతల ఆటాడి చివరికి ఆయనకే ఎమ్మెల్యే టికెటిచ్చి వైకాపా మరో తప్పిదానికి తెరతీసిందా? అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత నియోజకవర్గం కంటే రాష్ట్రంపైనే అచ్చెన్నాయుడు ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ టెక్కలిలో ఆయన ఏమాత్రం పట్టుకోల్పోలేదని నియోజకవర్గంలో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని టీడీపీలో కొనసాగుతున్న చేరికలే నిరూపిస్తున్నాయి.
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నియోజకవర్గంలో తన ప్రత్యర్థిగా ఉన్న అచ్చెన్నాయుడును వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నా ఆయన మాత్రం ఏరోజూ దువ్వాడను టార్గెట్‌గా విమర్శలు చేయలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్‌రెడ్డిపైనే గురి పెట్టారు. దీంతో జనంలో చులకన కాకపోవడం వల్ల గత ఎన్నికల్లో వైకాపాకు పని చేసిన పలువురు కీలక నాయకులు ఇప్పుడు అచ్చెన్న వెంట కనిపిస్తున్నారు. దువ్వాడ శ్రీనును గతంలో మాదిరిగానే ఎంపీ బరిలో నిలిపి, తిలక్‌ను టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడితే కచ్చితంగా జగన్‌ ఆశించిన ఫలితం వచ్చి ఉండేదని స్వయంగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. కానీ దువ్వాడ శ్రీనును అసెంబ్లీకి పంపడమే జగన్‌ లక్ష్యం కావడంతో పాటు ఇదే నియోజకవర్గంలో నందిగాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేరాడ తిలక్‌ను ఎంపీగా పంపడం వల్ల ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాళింగ సామాజికవర్గ ఓటు పోలరైజ్‌ అయ్యి దువ్వాడ గెలుస్తారన్న ఉద్దేశంతో ఆయనకు టికెటిచ్చారు. కానీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల సమయమే ఉన్న ఈ తరుణంలో నియోజకవర్గంలో అటువంటి వాతావరణం కనిపించడంలేదు. దువ్వాడ శ్రీను అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతవరకు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచిన దాఖలాలు లేకపోవడంతో కొందరు ఈసారి శ్రీను గెలుస్తారని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కనిపించడంలేదు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం రోజురోజుకు బలపడుతున్నారు. కొన్ని పోలింగ్‌ బూత్‌లలో పూర్తిస్థాయి రిగ్గింగ్‌ చేయించడం ద్వారానే ప్రతిసారీ అచ్చెన్న గెలుస్తున్నారని, ఇప్పుడు దాన్ని అడ్డుకున్నామని వైకాపా నేతలు చెబుతోంది. అయితే గతంలో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపణలు ఉన్న బూత్‌లలో ఈసారి రిగ్గింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే టీడీపీకి ఓట్లు పడే పరిస్థితి కనిపిస్తోంది. అటువంటప్పుడు ఏ పోలింగ్‌ బూత్‌ వద్ద ఎంత బలమైన ఏజెంట్‌ను పెట్టినా ఓటరు వేవ్‌ను అడ్డుకోలేరు. వాస్తవానికి ఇక్కడ తిలక్‌కు టికెటిచ్చుంటే నందిగాం మండలంలో ఆయనకు సాలిడ్‌గా ఓట్లు పడటంతో పాటు సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో అచ్చెన్న ఓటును చీల్చగలిగి ఉండేవారు. దీంతో పోరు నువ్వా నేనా అన్న స్థాయిలో ఉండేది. దీనికి తోడు వైకాపా అధికారంలో ఉండటం వల్ల ఫలితం అనుకూలంగా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండేదికాదు.

నందిగాం కీలకం

తిలక్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే వైకాపాకు బలమని చెప్పడానికి ఈ కింది గణాంకాలే సాక్ష్యం. టెక్కలి అసెంబ్లీ సీటు గెలిచిన పార్టీయే శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందడం రివాజుగా వస్తోంది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా డాక్టర్‌ కొర్ల రేవతీపతి 1,893 ఓట్లతో గెలుపొందితే, ఎంపీగా కిల్లి కృపారాణి 30వేల ఓట్లతో విజయం సాధించారు. అచ్చెన్నాయుడు గెలుపొందిన ప్రతిసారీ అప్పట్లో కింజరాపు ఎర్రన్నాయుడు, ప్రస్తుతం రామ్మోహన్‌నాయుడు గెలుపొందుతూ వచ్చారు. 2019లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్ధిగా పేరాడ తిలక్‌, ఎంపీ అభ్యర్ధిగా దువ్వాడ శ్రీనివాస్‌ పోటీలో నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధి దువ్వాడకు టెక్కలి సెగ్మెంట్‌లో 78,268 ఓట్లు, అసెంబ్లీ అభ్యర్ధి తిలక్‌కు 77,769 ఓట్లు వచ్చాయి. అంటే ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్‌ కంటే ఎంపీ అభ్యర్ధి శ్రీనుకు 499 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈ సెగ్మెంట్‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడుకు 8,588 ఓట్ల మెజార్టీ రాగా, ఎంపీ అభ్యర్థి రాముకు 8,608 ఓట్ల ఆధిక్యత లభించింది. గతం నుంచి చూసుకున్నా ఈ నియోజకవర్గంలో కింజరాపు ప్రత్యర్ధులు గెలిస్తే 2వేలు, కింజరాపు కుటుంబం గెలిస్తే 8వేలకు మించి మెజారిటీలు రాలేదు. రేవతీపతి 2009లో గెలుపొందినా ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో రేవతిపతి భార్య భారతి పోటీ చేసి నాలుగువేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఈ మెజారిటీ సాధించడంలో నందిగాం మండలం కీలక పాత్ర పోషించింది. రేవతీపతి, తర్వాత భారతీల విజయానికి నందిగాంలో లభించిన 4 వేలకు పైగా మెజార్టీయే కీలకం. 2019లో అసెంబ్లీ బరిలో ఉన్న తిలక్‌కు ఆ మండలం నుంచి 1600 ఓట్ల ఆధిక్యం లభించగా 2014లో వైకాపా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దువ్వాడకు 19 ఓట్ల ఆధిక్యత లభించింది. దీనివల్ల నందిగాం మండలంలో తిలక్‌కు సాలిడ్‌గా ఓటు పడుతుందని అర్థమవుతుంది.

ఆ కుటుంబాలే ప్రత్యర్థులు

నియోజకవర్గంలో కాళింగ, వెలమ, యాదవ, దళిత, గిరిజన, మత్స్యకార, రెడ్డిక ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో ఒక్కో సామాజకవర్గం ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. కింజరాపు కుటుంబానికి కంచుకోటగా నిలిచిన టెక్కలిలో ఎక్కువ సందర్భాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, సంపతిరావు రాఘవరావు ప్రత్యర్ధులుగా నిలిచారు. సొంత ఓటు బ్యాంకుతో పాటు పార్టీ ఓటుతో నెగ్గుకు రావాలని ప్రయత్నించిన ప్రతిసారీ మామాఅల్లుళ్లకు నిరాశే మిగిలింది. ప్రత్యర్థులంతా ఏకతాటిపై నిలిస్తే స్వపక్షంలో విపక్షం నెరిపే నాయకులు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని గతంలో కాంగ్రెస్‌, ఆ తర్వాత వైకాపా అధిష్టానాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీను క్యాంప్‌లో అదే పరిస్థితి ఉంది. ఒకవైపు భార్య, మరోవైపు పిల్లనిచ్చిన మామ ఆయనకు దూరం జరిగారు. అంతకు ముందు హరిశ్చంద్రపురం, ఇప్పుడు టెక్కలిగా నియోజకవర్గం పేరు మారినా నాయకుల్లో మార్పు రాలేదు. అందరినీ ఎకతాటిపైకి తీసుకు రావడానికే ఈ ఎన్నికల్లో పేరాడ తిలక్‌ను ఎంపీ అభ్యర్ధిగా, దువ్వాడను ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో నిలిపింది. కచ్చితంగా టెక్కలి అసెంబ్లీని గెలిపించుకోవడం కోసం నందిగాం మండలంకు చెందిన తిలక్‌ను పోటీలో నిలిపారని పార్టీలో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల అనంతరం తిలక్‌ టెక్కలిలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో నందిగాం, కోటబొమ్మాళి మండలాల బాధ్యతలు అప్పగించడంతో మరింత బలపడ్డారు. నందిగాంలో తిలక్‌ ప్రత్యేక దృష్టి పెట్టి వైకాపా అభ్యర్ధులు ఇద్దరికీ ఐదువేలకు పైగా మెజారిటీ సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్కలి మండల కేంద్రంలో టీడీపీ ఆధిక్యం ప్రదర్శిస్తే, రూరల్‌లో జగన్‌ పథకాలు దిక్కవుతాయి. ఈ రెండు మండలాల్లో వైకాపా 12వేలకు పైగా ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే తప్ప వైకాపా అభ్యర్థుల విజయం సులభం కాదు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page