top of page

లోకేష్ స్థానంలో రాము

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 15
  • 1 min read
  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం

  • ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా..

  • పోలిట్‌బ్యూరోలో రాష్ట్ర మంత్రి అచ్చెన్న

  • జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ కలిశెట్టి

  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శిరీష, అధికార ప్రతినిధిగా కూన రవి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మహానాడుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ దానికి ముందే పార్టీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. కొత్త పార్టీ జాతీయ కార్యనిర్వాహక(వర్కింగ్) అధ్యక్షుడిగా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 185 మందితో కూడిన కొత్త కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. 29 మందితో పోలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షుడు.. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఏడుగురు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మంది, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర కార్యదర్శులుగా 77 మందిని నియమించారు. తాజా నియామకాల ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగుతారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన తనయుడు నారా లోకేష్ మరింత క్రియాశీలం కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగనున్నారు. మొత్తం కార్యవర్గంలో శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు నేతలకు చోటు లభించింది.

పోలిట్‌బ్యూరోలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతారు. అదే కుటుంబానికి చెందిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది. జాతీయ అధికార ప్రతినిధిగా శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన తమ్మినేని సుజాత, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన కావలి గ్రీష్మ, జోనల్ కోఆర్డినేటర్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా వజ్జ బాబూరావు(పలాస), బగ్గు అర్చన (నరసన్నపేట), కోళ్ల అప్పలనాయుడు (రాజాం), కిమిడి రామ్ మల్లిక్‌నాయుడు (చీపురుపల్లి), రాష్ట్ర కార్యదర్శులుగా పొగిరి బుచ్చిబాబు (పాతపట్నం), మాదారపు వెంకటేష్ (శ్రీకాకుళం) నియమితులయ్యారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page