top of page

లింగాలవలస రౖెెల్వేగేట్‌ క్లోజ్‌..!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO

Updated: Sep 16, 2024

  • వాహనాల రాకపోకలపై ప్రభావం

  • స్థానికుల ఆందోళనపై స్పందించిన మంత్రి అచ్చెన్న

(సత్యంన్యూస్‌, టెక్కలి)

నౌపడ`గుణుపూర్‌ రైల్వేట్రాక్‌పై లింగాలవలస వద్ద ఉన్న గేట్‌ను శాశ్వతంగా మూసివేయడాన్ని సుమారు 15 గ్రామాలకు చెందిన గిరిజనులు, ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి గేట్‌ క్లోజ్‌ చేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేయడంతో స్థానికులు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పనులు నిలిపేసి తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఎప్పటికైనా గేట్‌ మూసివేయడం తప్పదని రైల్వే అధికారుల హెచ్చరికతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. ఈ రైల్వేగేట్‌ దాటుతూ నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో గేట్‌ మూసివేస్తామన్న ప్రతిపాదనలతో రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తే స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈస్ట్‌కోస్ట్‌ అధికారులను, విశాఖలో డీఆర్‌ఎంను కలిసి వినతిపత్రాలు అందించారు. దీంతో మూడేళ్ల పాటు ఈ గేట్‌ మూసివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం గేట్‌ను శాశ్వతంగా మూసివేసి అండర్‌పాస్‌ నుంచి రాకపోకలు సాగించాలని సూచించడంతో ఈ గేట్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్న సుమారు 15 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లింగాలవలస పంచాయతీ పరిధిలోని సొర్లిగాం, సవర సొర్లిగాం, హరిపురం, సన్యాసిపేట, సొర్లిగాంకాలనీ, సారవకోట మండలం కూర్మనాధపురం పంచాయతీ పరిధిలోని బంజీరుపేట, సవరబంజీరుపేట, మర్రిపాడు తదితర గ్రామాలకు వెళ్లేందుకు ఇదే మార్గం కావడంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. సుమారు వెయ్యి కుటుంబాలు ఈ మార్గం ద్వారా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోపాటు ఈ మార్గంలోనే 12 గ్రానైట్‌ పరిశ్రమలకు చెందిన లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లూ గ్రానైట్‌ వెలికితీసే పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సుమారు 1200 మంది ఉపాధి పొందుతున్నారు. వీరంతా ఈ మార్గంలోనే వాహనాల్లో రాకపోకలు చేస్తుంటారు.

అండర్‌ పాస్‌ ద్వారా రాకపోకలు

గేట్‌ మూసివేసి అండర్‌ పాస్‌ ద్వారా రాకపోకలు సాగిస్తే గ్రానైట్‌ వాహనాలు, భారీ యంత్రాలతో పాటు, ప్రజల నీటి అవసరాల కోసం గ్రామాల్లో వేసే బోర్‌వెల్స్‌ను తవ్వే యంత్రాలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని అదుపు చేయడానికి వచ్చే ఫైరింజన్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. 15 గ్రామాల పరిధిలో సుమారు 3వేల ఎకరాల్లో వ్యవసాయం సాగవుతుంది. వరి కోత యంత్రాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సు అండర్‌ పాస్‌ నుంచి రాకపోకలు సాగించే ఆస్కారం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 గ్రామాల్లో సుమారు 600 ఆదివాసీ కుటుంబాలు వ్యవసాయం చేసి జీవనోపాధి పొందుతున్నాయి. వీరి ఉత్పత్తులను ఆదివాసీ గ్రామాల నుంచి సమీపంలోని పట్టణాలకు తీసుకురావడానికి అవకాశం కోల్పోతామని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు లింగాలవలస పరిధిలో కాట్రగడ రిజర్వాయర్‌ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాంత వ్యవసాయ భూములకు నీరందించడానికి కాట్రగడ రిజర్వాయర్‌ నిర్మాణం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాల వద్ద ప్రతిపాదన పెట్టారు. దీన్ని ప్రభుత్వం ఆమోదించి నిర్మాణానికి చర్యలు తీసుకుంటే గేటును మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జోక్యం చేసుకొని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైల్వేగేట్‌ మూసివేత ప్రక్రియకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page