కమీషన్ల కోసం సిబ్బందిపై ఒత్తిడి
ఆర్‌ఎం కళ్లలో ఆనందమే శ్రీకర్ కొంపముంచింది
కొద్ది రోజుల్లో బజారుబ్రాంచి పాత బీఎంకు ఊస్టింగ్
కొలిక్కి వచ్చిన నకిలీ రుణాల కుంభకోణం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నరసన్నపేట ఎస్‌బీఐ బజారు బ్రాంచిలో జరిగిన నకిలీ రుణాల కుంభకోణం గుట్టు దాదాపు వీడిపోయినట్టే. ఇందుకు పాత్రధారిగా వ్యవహరించిన అప్పటి బ్రాంచి మేనేజర్ శ్రీకర్‌ను బ్యాంకు అధికారులు ఉద్యోగం నుంచి పక్కన పెట్టారు. సస్పెన్షనా? టెర్మినేషనా? అనేది చెప్పకుండా ఈ కుంభకోణం బయటపడిన దగ్గర్నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు గార బ్రాంచిలో జరిగిన తాకట్టు బంగారం కుంభకోణాన్ని పోలీసులు రీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నందున ఇందులో సూత్రధారిగా భావిస్తున్న అప్పటి ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు మీద పోలీసులు తీసుకునే చర్యల మేరకు నరసన్నపేట బజారుబ్రాంచి నకిలీ రుణాల కేసులో కూడా పాత్ర ఉందని భావిస్తున్న రాజు కథ కొలిక్కి వచ్చాక శ్రీకర్‌ను ఇంటికి పంపిస్తారని భోగట్టా. అసలు ఈ బ్రాంచిలో జిల్లాలో ఎక్కడా లేనన్ని నకిలీ రుణాలు ఎందుకు ఇచ్చారన్నది తెలియాలంటే ముందుగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం తెలుసుకోవాలి. అప్పటి రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు కళ్లలో ఆనందం చూడటం కోసం, ఆయన్ను కోటీశ్వరుడ్ని చేయడం కోసం బజారు బ్రాంచి మేనేజర్ శ్రీకర్ పడిన తపనలో భాగమే ఈ నకిలీ రుణాల బాగోతం. దేశంలో టాప్ టెన్ ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసిన రీజియన్‌లో శ్రీకాకుళం రీజియన్ టీఆర్‌ఎం రాజు హయాంలో టాప్`5లో ఉండేది. ఇదేదో బ్యాంకు వరకు ఘనకార్యమేమో గానీ సరిగ్గా ఇదే అంశం ఇక్కడ ఎస్‌బీఐని బజారుపాలు చేసింది. ఎస్‌బీఐలో డిపాజిట్ చేయడానికి వచ్చినవారిని, రుణాలు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నవారితోను ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి, ఆ కమీషన్‌ను టీఆర్‌ఎం రాజు లక్షల్లో పొందేవారు. ఇందుకోసం తన రీజియన్ పరిధిలో ఉన్న ప్రతీ బ్రాంచి మేనేజర్‌కు టార్గెట్ ఇచ్చి ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బలవంతంగా కస్టమర్‌తో కట్టించే విధంగా చేసేవారు. ఇందులో నరసన్నపేట బజారుబ్రాంచ్‌కు మేనేజర్‌గా పని చేసిన శ్రీకర్ ముందువరుసలో ఉండేవారు. ప్రతీనెల అందరికంటే ఎక్కువ ఎస్‌బీఐ లైఫ్‌లు కట్టించి ఆర్‌ఎం ప్రశంసలు అందుకునేవారు. ఇందులో వచ్చిన కమీషన్ నేరుగా ఆర్‌ఎంకు చేరేది. ఒక ఏడాదికి ఎస్‌బీఐ లైఫ్ ద్వారా వచ్చిన కమీషనే కనీసం రూ.50 లక్షలు టీఆర్‌ఎం రాజు ఖాతాలో జమై ఉంటుందని ఒక అంచనా. నరసన్నపేట బజారుబ్రాంచి మేనేజర్ శ్రీకర్ అడ్డగా రుణాలు ఇచ్చేసేవారు. అది కాకుండా బినామీ పేర్లతో కూడా లావాదేవీలు నడిపించారు. ఇవన్నీ అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజుకు తెలుసు. అయితే లోన్‌గా వెళ్లిన ప్రతీ అకౌంట్ నుంచి ఎస్‌బీఐ లైఫ్ కట్టించడం వల్ల అర్హత లేనివారికి కూడా రుణాలు ఇవ్వాల్సి వచ్చేది. ఎవరైనా పెద్దమొత్తానికి ఎస్‌బీఐ లైఫ్ కడతామంటే గుడ్డిగా ఇక్కడ లోన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. ఎస్‌బీఐ లైఫ్‌లో ఒక ట్రెడిషనల్ పాలసీ తీసుకుంటే లక్ష రూపాయల ప్రీమియంకు రూ.30వేల కమీషన్ వస్తుంది. ఇటువంటి సొమ్ముల కోసం ఇష్టారాజ్యంగా లోన్లు ఇచ్చి మంది సొమ్ముకు కన్నం వేశారు. గులాబ్‌జామ్ కొంటే గిన్నె ఫ్రీ అన్న చందంగా తమ వద్ద లోన్ కావాలంటే ఎస్‌బీఐ లైఫ్ కట్టాలన్న నిబంధనే ఇప్పుడు బజారుబ్రాంచిలో నకిలీ రుణాలకు దారితీసింది. ఇందులో తిలా పాపం తలా కొంత పంచుకున్నారు. టీఆర్‌ఎం రాజుకు రూ.30వేలు కమీషన్ వస్తే అందులో మేనేజర్‌కు రూ.5వేలు వేసేవారట. ఇలా బ్రాంచి మేనేజర్లే ఎస్‌బీఐ లైఫ్ ఏజెంట్లుగా అవతారమెత్తడంతో నకిలీ రుణాలు సృష్టించి, వాటి పేరుతో ఎస్‌బీఐ లైఫ్ కట్టించి దొరికిపోయారు. వాస్తవానికి ఇది ఎస్‌బీఐకి సంబంధించిన సెమీ ఆర్గనైజేషన్. ఇందులో పాలసీలు కట్టించడానికి ఏజెంట్లు ఉంటారు. కానీ బ్యాంకు ఉద్యోగులే ఇటువంటి పాలసీలు కట్టిస్తే వీరిని సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటేటర్స్ అంటారు. ఎప్పుడైతే పెద్ద ఎత్తున కమీషన్లు, స్టార్ హోటల్‌లో మందు, విందు చిందు వంటి ఏర్పాట్లు, టార్గెట్లు ఇచ్చారో అప్పుడే ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు బజారు బ్రాంచిలోని వ్యవహారాన్ని టీఆర్‌ఎం రాజు సరిగ్గా ఇలాగే వాడుకున్నారు. బిజినెస్ క్రాస్ సెల్లింగ్ పేరుతో ప్రతీ లోనుకు భారీ ఎత్తున పాలసీలు చేసి కమీషన్‌ను వైట్‌మనీగా సంపాదించడం మొదలుపెట్టారు. ఈ మాయలో పడి బజారు బ్రాంచి మేనేజర్ శ్రీకర్ సుమారు రూ.కోటి వరకు ఎస్‌బీఐ లైఫ్ ప్రీమియమ్‌లు కలెక్ట్ చేసి టీఆర్‌ఎం రాజుకు బహుమానంగా ఇచ్చారు. మరీ విచిత్రమేమిటంటే.. రాజుగారి పుట్టినరోజు ఉందని ఒక అకేషన్ చూపించి ప్రీమియమ్స్ కలెక్ట్ చేసిన ఘనత శ్రీకర్‌దే. అందుకే ఇక్కడ మూడు కోట్ల వరకు నకిలీ రుణాలు వెలుగుచూశాయి. ఇక కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రానికి, మూలపేటలో పోర్టుకు భూమిలిచ్చినవారికి సంబంధించిన పరిహారం ఎస్‌బీఐలో ప్రభుత్వం జమ చేసింది. వీరి వద్ద పెద్ద మొత్తం ఉందని తెలుసుకున్న అప్పటి ఆర్‌ఎం రాజు వీరందరితోనూ ఎస్‌బీఐ లైఫ్ కట్టించేసి కమీషన్ తన ఖాతాలో వేసుకున్నారు. వాస్తవానికి ఇది రైతుల వార్షిక ఆదాయం కాదు. భూమి పోవడం వల్ల వచ్చిన సొమ్ము. కానీ ఎస్‌బీఐ లైఫ్ కట్టకపోతే విత్‌డ్రా చేయడానికి అవకాశం లేదని భయపెట్టడంతో చాలామంది ఈ పాలసీలు తీసుకున్నారు. ఆ తర్వాత దీన్ని మరుసటి ఏడాది కొనసాగించలేదు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ లాఠకర్ ఈ సొమ్ములను ఎస్‌బీఐ నుంచి తీసేసి ఐసీఐసీఐ బ్యాంకులో వేశారు. దీని వల్ల తన కమీషన్ పోతుందని భావించిన టీఆర్‌ఎం రాజు స్వయంగా కలెక్టరేట్ ఉద్యోగులు లంచం తీసుకొని ఐసీఐసీఐకి అకౌంట్లు ట్రాన్స్‌ఫర్ చేసేశారంటూ ప్రచారం చేసుకొచ్చారు. ఒక్క కొవ్వాడ పరిహారం నుంచే రూ.3 కోట్ల ప్రీమియంలు ఎస్‌బీఐకి వెళ్లాయి. పరిహారాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేయడానికి వెళితే లక్షల్లో ఎస్‌బీఐ లైఫ్‌ను కట్టించారు. ఇప్పుడు రెన్యువల్ చేయలేక రైతులు లబోదిబోమంటున్నారు. తప్పు చేసైనా ఎస్‌బీఐ లైఫ్ కట్టించాలని టీఆర్‌ఎం రాజు ఆదేశించడంతో అప్పట్లో దీనిని ఉద్యోగుల సంఘ నాయకుడొకరు వ్యతిరేకించారు. దీంతో ఆయన్ను శ్రీకాకుళం నుంచి 900 కిలోమీటర్ల దూరం బదిలీ చేయించిన ఘనుడు రాజు. నగరానికి చెందిన ఒక కులకార్పొరేషన్ మాజీ చైర్మన్ తప్పుడు అప్రూవల్స్‌తో రామలక్ష్మణ బ్రాంచిలో లోన్స్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజు చివరకు ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ను బెదిరించి పెద్ద ఎత్తున సొమ్ములు తన బినామీ పేరు మీద అపార్ట్‌మెంట్‌లో ఒక ప్లాట్‌ను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తానికి ఎస్‌బీఐ లైఫ్ పేరుతో బ్యాంకు లైఫ్‌ను తీసేసిన బజారు బ్రాంచి కథ కొలిక్కి వచ్చినట్లయింది.
Comments