తడిసి మోపెడవుడవుతున్న టాక్స్‌లు
20 శాతం లాభం కాస్త 9కి మిగిలింది
ఏడాదిలో కట్టాల్సిన లైసెన్స్ ఫీజు 8 నెలలకు కుదించుకుపోయింది
రూ.10 లక్షలు అమ్మితే 90వేలు లాభం
రెండు నెలల లాభం లైసెన్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సరి
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అన్ని పన్నులు సరళీకరించడం ద్వారా మద్యం వ్యాపారులకు గరిష్టంగా 20 శాతం మార్జిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం ద్వారా పెద్ద మొత్తంలో దరఖాస్తులు వేసి జిల్లా నుంచి కేవలం అప్లికేషన్ ఫీజు రూపంలోనే రూ.92 కోట్లు ఇచ్చిన వ్యాపారులు ఇప్పుడు అన్ని లెక్కలూ చూసుకుంటే 9 శాతానికి మించి లాభం రావడంలేదని లబోదిబోమంటున్నారు. మూలిగిన నక్క మీద తాటిపండు పడినట్లు రెండు నెలలకు ఒకసారి కట్టాల్సిన లైసెన్స్ ఫీజు ఇన్‌స్టాల్‌మెంట్ సమయాన్ని కుదించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు.

ఫీజు చెల్లింపులో మెలిక
లైసెన్స్ ఫీజు చెల్లింపు విషయంలోనూ ప్రభుత్వం మెలికపెట్టింది. మద్యం దుకాణాన్ని లాటరీలో దక్కించుకున్న మరుక్షణమే ఏడాదికి రూ.65 లక్షలు లైసెన్స్ ఫీజులో ఆరో వంతు అంటే సుమారు 11 లక్షలు చెల్లించారు. మిగతా మొత్తానికి బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. ఏడాదికి చెల్లించాల్సిన మిగతా మొత్తం ప్రతి రెండు నెలలకు ఒకసారి 10 నెలల్లోగా చెల్లించాలి. ఇప్పుడు గజిట్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా లైసెన్స్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. డిసెంబర్ 20 నాటికి చెల్లించాల్సిన రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈ నెల 20కే చెల్లించాలని లైసెన్స్‌దారులకు నోటీసులు జారీ చేసింది. రెండు నెలల్లో చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్‌ను నెల రోజులకు కుదించింది. అంటే ఏడాది లైసెన్స్ ఫీజును ఎనిమిది నెలల్లోనే వసూలు చేస్తుందన్నమాట. దీనికి తోడు సకాలంలో ఫీజు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత మొదటి 10 రోజులకు 10 శాతం, 11వ రోజు నుంచి 20 శాతం, 21వ రోజు దాటితే 30 శాతం వడ్డీతో చెల్లించాలని షరతు విధించింది. ఒకవేళ చెల్లించకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.
పన్నుల రూపంలో
మద్యం తయారుచేసే కంపెనీ దగ్గర్నుంచి, రాష్ట్రానికి సరుకు వచ్చేవరకు వివిధ దశల్లో అనేక టాక్స్‌లు విధించిన తర్వాత నిర్ణయించిన ఎమ్మార్పీపై 20 శాతం లాభం వస్తుందని గెజిట్ చూసిన వ్యాపారులకు అర్థమయింది. తెలంగాణలో ఇదే మోడల్ ఉండటంతో 20 శాతం కాకపోయినా కనీసం 13 శాతమైనా మిగులుతుందని ఈ రంగంలో ఆరితేరినవారు భావించారు. కానీ ప్రభుత్వం బిగించిన అనేక మెలికల వల్ల ఇప్పుడు 9 శాతానికి లాభం కుదించుకుపోయింది.
కోత విధించి మద్యం రిలీజ్
ప్రభుత్వం ప్రస్తుతం వ్యాపారులు మద్యం కోసం చెల్లిస్తున్న నెట్ ఇండెంట్ మొత్తంలో 42.28 శాతం పన్నుల రూపంలో కోత విధించి కేవలం 57.72 శాతానికి మాత్రమే మద్యం రిలీజ్ చేస్తుంది. ఇందులో సెస్సులు, ప్రివిలేజ్ ఫీజులు అని అనేక రకాల మెలికలు ఉన్నాయి. ఉదాహరణకు రూ.10 లక్షల సరుకు కావాలని ఇండెంట్ పెడితే, అందులో రూ.4,22,800 టాక్స్ కింద కట్ చేసి మిగతా రూ.5,77,200కు మద్యం రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన మద్యం విక్రయిస్తే రూ.90వేలు మిగులుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.2 లక్షలు విక్రయించే షాపులకు రోజుకు రూ.18 వేలు లాభం వస్తుందని, నెలకు సుమారు రూ.6 లక్షలు చెప్పున రెండు నెలలకు రూ.12 లక్షలు వస్తుందని చెబుతున్నారు. రెండు నెలల్లో వచ్చే రూ.12 లక్షలను ప్రతి రెండు నెలలకు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజుకే సరిపోతుందని చెబుతున్నారు. షాపు నిర్వహణ, మద్యం డిపో నుంచి రవాణా, షాపులో పనిచేసే సిబ్బంది జీతాలు, మద్యం స్టాక్ కోసం తెచ్చిన అప్పునకు వడ్డీ జేబులో నుంచే చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమౌతోందని, వీటికి అదనంగా ఎక్సైజ్ అధికారుల ప్రోటోకాల్స్‌ను చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. మొదటి ఏడాదికి రూ.65 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజే రెండో ఏడాదికి రూ.71.50 లక్షలు కానుందని, ప్రభుత్వం గజిట్‌లో పేర్కొన్న మాదిరిగా 20 శాతం మార్జిన్ ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. అమ్మకాలపై 20 శాతం మార్జిన్ అనుకుంటే చేతికి 9 శాతమే వస్తోందని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వైన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు ఎక్సైజ్ అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. ఇలాగైతే వ్యాపారం చేయడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Bình luận